Thursday, September 20, 2012

వినాయక చవితి (Vinayaka chaviti)

    రెండు దశాబ్దాల క్రితం : తూర్పు గోదావరి జిల్లా, చింతలూరు.. కరెంటు వీధి దీపాల కోసం, టీవి ఉన్నవాళ్ళ కోసం మాత్రమే.. అనే రొజులు. కొత్తూరు సెంటెర్ 'దుంపల బడిలో' ఐదో తరగతి చెక్క బల్లపై కూర్చుని ఉత్సాహంగా, పలక మీద తెలుగు మాస్టారు చెప్పిన ఆకుల పేర్లు రాసుకుంటున్నా, ఎక్కడ దొరుకుతాయో ఎలా ఉంటాయో గుర్తు పెట్టుకుంటున్నా...

      దవనం, మాచ పత్రి, బ్రిహతీపత్రం(వాకుడు), మారేడు, దూర్వర పత్రం(గరిక), ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణు క్రాంతం, దానిమ్మ, మరువము, పెద్ద నిమ్మ, దేవదారు, వావిలి, జాజి, జమ్మి, అశ్వత్థ, తెల్ల మద్ది, జిల్లేడు, వెలగ... రేపు వినాయక చవితి కదా ఇవాళ మధ్యానం నుంచి బడికి సెలవు, ఊర్లొను, పొలం గట్టుల మీద, శివాలయం, అమ్మోరి గుడి.. అన్నీ తిరిగి ఇవన్ని సేకరించాలి. బేమ్మర్ల చెరువులో పాటి మట్టి తెచ్చి తాత చేత వినాయకుడు చేయించాలి. నాన్న మండపేట నుంచి వచ్చేటప్పుడు పాలవెల్లికి కట్టడానికి పళ్ళు అన్నీ తెస్తాడొ లేదో. అమ్మని అడిగి ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, పులిహోర, చెక్కెర పొంగలి చెయ్యడానికి అన్నీ ఉన్నాయెమొ అడిగి, కావాల్సినవి ఆది నారాయణ కొట్టు నుంచి తేవాలి. కుంపటిలో బొగ్గులు వెయ్యాలి, కొత్త స్టొవ్ లో కిరసనాయిలు నింపాలి.హమ్మో ఎన్ని పనులో ... బడి త్వరగా అయ్యిపోతే బాగుండును.ముందు మామిడిఆకులు కొయ్యాలి, జాగు చేస్తే మంచి ఆకులు దొరకవు. మొన్న అట్ల తద్దికి తెల్లారు జాము, ఆటలాడుతూ మామిడి చెట్టు మీదనుంచి పడ్డాగా.. ఈ సారి జాగ్రత్తగా ఎక్కాలి.



     టంగ్ టంగ్ టంగ్ ... సొషల్ మాస్టారు గంట కొడుతున్నారు. పిల్లలందరు పరుగులు మొదలు పెట్టారు. పుస్తకాల సంచీలో రాత్రే దాచిన గోనె పట్టా తీసుకుని బడి ఎదురుగా ఉన్న భాస్కర్ రావ్ దిమ్మ దెగ్గెర మామిడి చెట్టు ఎక్కి ఆకులు కోశా. కాలవ గట్టు దెగ్గర దుర్గ గుడిలో దణ్ణం పెట్టుకుని ఆయుర్వేద నిలయం మీదుగా శివాలయం చేరా. మాస్టారు చెప్పినట్టుగా పాలు కంటిలో పడకుండా జాగ్రత్తగా గన్నేరు ఆకులు కాయలతో సహా తెంపి సంచీలో వేసుకున్నా. బ్రిహతీపత్రం, మారేడు, జమ్మి, అశ్వత్థ, తెల్ల మద్ది, జిల్లేడు కూడా త్వరగానె దొరికాయి. ఇక పెద్ద నిమ్మ, దేవదారు, వావిలి... కోసం నూకాలమ్మ గుడి మీదుగా కపిలేశ్వరపురం రోడ్డు వైపు ఉన్న పొలాల్లొకి పరుగు పెట్టా. కుచ్చెర్లకోటవారి పొలంగట్టు మీద నుంచి ముసలి నాగు పుట్ట దెగ్గర ఉన్న రేగు చెట్టు దెగ్గరకు చేరుకున్నా.  ఆకులు తెంపి సంచిలో వేసుకుని పక్కనే ఉన్న బేమ్మర్ల చెరువు దెగ్గరకు వెళ్ళా. దూడలు కాస్తున్న సత్తయ్యని కాస్త పాటి మట్టి తీసిమ్మని, తామరాకులో నింపా. ఆకులు అన్ని సమకూరాయి అని సరి చూసుకుని ఇంటికి బయలుదేరా. దారిలో సుబ్బాయమ్మ దొడ్లో జామకాయలు రాళ్ళతో కొడుతుంటే సుబ్బాయమ్మ కోడలు కర్రపట్టుకుని పరిగెత్తుకు వచ్చింది... పరుగు పరుగున ఇంటికి చేరా. నాన్న మండపేట నుంచి అన్నీ తెచ్చినట్టున్నాడు సంచి నిండుగా ఉంది. తాత మట్టితో వినాయకుడి బొమ్మ చేసి ఆర పెట్టాడు.

      ఏడింటికి భోజనం చేసి తాత అగస్త్య మహర్షి కధ 'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' చెబుతుంటే, ఊ కొడుతూ పడుకున్నా. చవితి రోజు తెల్లారు ఐదింటికి లేచి మొహం కడుక్కుని నాన్నకి పాలవెల్లి కట్టడం లో సాయం చేసి, తాత చేసిన వినాయకుడిని ఒక సారి చూసుకుని, వెళ్ళి స్నానం చేసా. ఎప్పటిలాగె నాన్న కధ చదివి అక్షింతలు వేసాడు. ఇవాళ చంద్రుడిని చూసినా ఇక పరవాలేదు, రాత్రి ఆరుబయట మడత మంచం వేసుకుని తాత కధ వింటూ చంద్రుడిని చూస్తూ పడుక్కోవచ్చు.బాగా చదువు రావాలని దణ్ణం పెట్టుకున్నా.
మధ్యానం రాజమండ్రి నుంచి మావయ్య వచ్చాడు, రాజమండ్రిలో ఏదో పెద్ద బడి పెట్టారుట అక్కడ చదివితే పెద్ద చదువు వస్తుందని అన్నాడు. మొన్న వేసవి సెలవుల్లొ మావయ్య ఇంటికి వెళ్ళి నప్పుడు సూత్రదారులు సినిమా చూసా.. అందులో హీరో అలాగే కలక్టర్ అయ్యాడు, మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నా..!


ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్... సెల్ అలారం మోగుతోంది, రోజు ఆఫిస్ కోసం ఎనిమిదింటికె లేవాలి అని అలారం పెట్టుకుంటా, ఇవాళ వినాయక చవితి సెలవు అలారం  తీసెయ్యడం మర్చిపోయా. బద్దకంగా లేస్తూ, కలను గుర్తు తెచ్చుకుంటూ సెల్ కాల్ రెజిస్టెర్ చూసా, నాన్న దెగ్గర నుంచి ఆరింటికి రెండు మిస్సెడ్ కాల్స్.. వినాయక చవితి కదా ! పని చేస్తు పడుక్కోవడం వల్ల పక్కనే షట్ డౌన్ చెయ్యని లాప్ టాప్ న్యూ మైల్స్ నొటిఫికేషన్స్ చూపిస్తొంది. ఒక సారి అన్ని మైల్స్ చెక్ చేసుకుని బెడ్ మీదనుంచి లేచి స్నిగ్ధ బెడ్ రూం వైపు నడిచా. మాది ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్, ఈ మద్యే 60 లక్షలు పెట్టి కొన్నా కూకట్పల్లిలో. రాత్రి లేట్ అయ్యినట్టుంది పని ఇంకా లేవలేదు.. నా భార్య స్నిగ్ధ. నేనే కాఫి పెట్టుకుని తాగి టీవి లో న్యూస్ చూడడం మొదలు పెట్టా. బ్రష్ చేసి స్నానం చేసేటప్పటికి 11:30. నాన్న మళ్ళీ కాల్ చెసారు, 'ఎరా పూజ అయ్యిందా?', 'అమ్మాయి వంటలు యేమి చేసిందీ?','మావయ్య...,
'అయ్యింది నాన్నా... ఉండ్రాళ్ళూ, కజ్జి కాయలు చేసిందీ ఆయన మాటలు మద్యలో ఆపేస్తు చెప్పేసా. అబద్దం చెప్పక తప్పింది కాదు. ఆయన యెదొ చెప్పబొతుంటే మళ్ళీ చేస్తా అని కట్ చేసా. నేను చెప్పింది అబద్దం అని ఆయనకు తెలియక కాదు. ఆయనకు చాలా తెలుసు,ఆయన ఉద్దేశం వేరే. హబ్బా అబద్దం చెప్పడం చాలా చిరాకు !

పిజ్జా హట్ కి ఫొన్ చేసి 2 ఎక్స్ ట్రా చీజ్ పిజ్జా ఆర్డర్ చేసా. నాకు వచ్చిన కల, నాన్నకు చెప్పిన అబద్దం కొంచెం నా మీద పని చేశాయ్ అనుకుంటా టీవి ఆన్ చేసి భక్తీ చానెల్ పెట్టా. ఎవరో పెద్దమనిషి వినాయక చవితి గురించి చెప్తుంటే నా లాప్ టాప్ లో పని చేసుకోవడం మొదలు పెట్టా.

టింగ్ టొంగ్ టింగ్ టొంగ్ ... డోర్ బెల్. వెళ్ళి డొర్ తీసా, మావయ్య ఎదురుగా ! సెల్ లో నాన్నతొ మాట్లాడుతున్నాడు, నా ఇంటి అడ్డ్రెస్ గురించి అనుకుంటా, మాట్లాడుతూనే ఇంట్లోకి వచ్చేసాడు. డోర్ బెల్ సౌండ్ కి నిద్ర లేచిన స్నిగ్ఢ కళ్ళు నులుముకుంటూ హాల్లోకి వచ్చింది, మావయ్యని చూసి పలకరింపుగా నవ్వి కిచెన్లోకి వెళ్ళి పొయింది, బెడ్ కాఫి తాగడానికి. 'ఏంటి బావా వీళ్ళు ఇంకా లేవ లేదూ?' మావయ్య నాన్నతో అన్న మాట వినగానే నాకు గుండెలో రాయి పడినంత పని అయ్యింది. మావయ్య ఏదో మాట్లాడి పెట్టేసాడు.
నా మనసు మనసులో లేదు, నాన్న ఏమనుకుంటున్నారో. మావయ్య కొంచెం సేపు ఉండి వెళ్ళి పొయాడు.

నేను ఇవాళ చవితి బాగా చెయ్యాలని నిశ్చయించుకున్నా. ఈ మద్య ఇంటిలో వినాయకుడి పెట్టడం కుదరక, ఖాలి దొరక్క, మా సందులో పెట్టే పెద్ద వినాయకుడికి దన్నం పెట్టి ఊరుకుంటున్నా. యెలాగో పనిలో పడి ఆకాశం వైపు చూసెంత ఖాలి లేదు కనక చంద్రుడిని చూస్తానన్న భయం లేదు. అసలు చంద్రుడిని చూసే చాలా యేళ్ళయ్యింది.
 అడిడాస్ ట్రాక్ సూట్ వేసుకుని కార్ లో 'పత్రి ' కొనడానికి బయలుదేరా. పత్రి, పళ్ళు, వినాయకుడి విగ్రహం కలర్ఫుల్ గా ఉన్నది చూసి కొనుక్కుని ఇంటికి వచ్చా. పాలవెల్లి అంటె ఎవరికి తెలియదుట. ఈ సారికి పళ్ళన్ని కిందే. మరేం చేస్తాం. యుట్యూబ్లో వినాయక వ్రత కల్పం వీడీయొ పెట్టా. నెట్ సిగ్నల్ సరిగ్గా లేక స్లోగ లోడ్ అవుతోంది. స్నిగ్ధ స్నానం చేసి వచ్చి వినాయకుడి చుట్టూ పళ్ళు పూలు సద్దడంలో సాయం చేసింది. పత్రిలో పుచ్చు మామిడి ఆకులు, ఎండు గడ్డీ, వేర్లతో సహా పీకెసిన క్రొటొన్స్ మొక్కలు తప్ప ఎమిలేవు. అక్షింతలే..'అలంకరనార్థం అక్షతం సమర్పయమి ', నారికేళం బదులు,వస్త్ర యుగ్మం బదులు, యగ్నోపవీతం బదులు, మహా నైవెద్యం బదులు (మర్చి పొయిన అన్నింటి బదులు) అక్షింతలే వాడాల్సి వచ్చింది.
పిజ్జా నైవేద్యం పెడదాం అని అనిపించింది కాని మళ్ళి భయం వేసి తమాయించుకున్నా. మొత్తానికి ఇద్దరం కలిసి పూజ తూతూ మంత్రంగా అయ్యిందనిపించాం. 10,15 ఫొటొలు తీసి ఎఫెక్ట్స్ చేసి ఫేస్ బుక్ లో పెట్టి ఆనందించాం.నాన్నకి కూడ ఫేస్ బుక్ లో చూడమని కాల్ చేసి చెప్పా.....

లోపల మనసు మాత్రం చెప్తొంది... "కనీసం మళ్ళీ సారైనా...!  "




గమనిక : ఈ కధలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు. ఇందులోని పాత్రలకు నాకు ఎటువంటి సంబంధం లేదు.. ముఖ్యంగా స్నిగ్ధ :-)

Tuesday, March 20, 2012

A Lesson In Psychology !!

  • When A Person Laughs 2 Much Even On Stupid Things,Be Sure That Person Is Sad Deep Inside.
  • When A Person Sleeps Alot, Be Sure Dat Person Is Lonely.
  • When A Person Talks Less, And If He Talks,He Talks Fast Then It Means That Person Keeps Secrets.
  • When Someone Can't Cry Then That Person Is Weak.
  • When Someone Eats In Abnormal Way Then That Person Is In Tension.
  • When Someone Cry On Little Things Then It Means, He Is Innocent & Soft Hearted.
  • When Someone Gets Angry On Silly Or Small Things It Means He Is In Love.