Monday, August 5, 2013

ఒక రాజు, ఏడుగురు కొడుకులు


అనగనగా ఒక ఊరిలో రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు.
ఆ ఏడుగురు కొడుకులు ఒక రోజు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఏడుగురు ఏడు చేపలు తెచ్చి వాటిని ఎండబెట్టారు.

సాయంత్రానికి ఆరు చేపలు ఎండాయి కాని, ఏడో చాప ఎండలేదు.
ఆ చేపను పట్టిన రాజకుమారుడు, చేపని “చేప చేప ఎందుకు ఎండలేదు” అని అడిగాడు.




ఆ చేప “గడ్డిమేటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది.

ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప ఎండకుండా ఎందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు.
గడ్డిమేటు “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని అంది.

రాజకుమరుడు ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు?” అని అడిగాడు.
“నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.

రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “ఎందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు?”
పాలెరాడు “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని అన్నాడు.

అమ్మని అడిగితే అమ్మ “ఆక్కడ పాప ఎడుస్తొంది” అంది.

రాజకుమారుడు పాపని “పాప, పాప, ఎందుకు ఏడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.


రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడి లాగ చీమని కూడ అడిగాడు “చీమ చీమ పాపని ఎందుకు కుట్టావూ?”

ఆప్పుడు చీమ “నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?” అని అంది !



చిన్నప్పుడు మా అమ్మ మాకు ఈ కథ చెప్పేది.
ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయి.
చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో ఎండు చేప లేదు

Monday, July 8, 2013

ఎన్నెమ్మ పురుగు

ఇది ఒక అమ్మమ్మల కాలం నాటి ఆచారం/ కధ/ నమ్మకం/ సైన్స్ ఎదైనా అనుకోండి...అమ్మమలు, అమ్మలక్కలు మొన్నటి దాకా పాడుకున్న పాటలు... విన్న చదివిన  పాత కధను యధాతధంగా  చెప్పడం జరిగింది, కులాలు మతాలు ప్రస్తావన వచ్చిన చోట నన్ను తిట్టుకోవద్దు, తిట్టుకునే మాటయితే ఇంక చదవద్దు..

             
ఒక పురుగుని ఎన్నెమ్మ పురుగు అనీ పురిటికందుని ఆ పురుగు ముడితే శిశువు కష్టపడుతుంది అని ఆ రోజుల్లో నమ్మేవారు. పురిటి గది కిటికీలు, తలుపులూ, ఆ ఎన్నెమ్మ పురుగు రాకుండా మూసి వుంచేవారు. పురిటి గది గుమ్మానికి ఒక కృష్ణ తులసి కొమ్మ,కలబంద మట్ట, పాత చెప్పు వేలాడగట్టేవారు. తులసి, కలబంద వ్యాధి నిరోధక శక్తి ఔషధ గుణం కలిగినవని మనకు తెలుసు. 

విధి వశాన మోసపోయి మాదిగ వాడిని పెండ్లి చేసుకొని నిజం తెలిసాక ఆ భర్తను పిల్లల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకొన్న రాచ పడుచు ఈ ఎన్నెమ్మ, ఆమెను అవమానించి తరిమివేయడానికి ఈ సన్నాహాలన్నీను, పురిటి గది గుమ్మానికి రెండు వైపులా ఊక పోగులుగా పోసి (ఊక అంటే బియ్యం దంచగా వచ్చే పొట్టు) ఆ కుప్పల మీద నిప్పు వేసి రగిల్చే వారు. అందు మీద జీలకర్ర, వాము పొట్టు, వెల్లుల్లి పొట్టు వేసి పొగ వస్తుంటే గృహంలోని వృద్ధ స్త్రీ ఒకరు ఆ గుమ్మం వద్ద కూర్చొని ఈ విధంగా ఎన్నెమ్మ పాట పాడేవారు.

కాపులు వెయ్యారే! కలితెచ్చీ చల్లారే
కామ కోటమ్మ కావలి వుండావే నల్లని వేముల్లా చిగురు చాబాట్టి (చేబట్టి) 
నాలుగు కోట్ల దేవతల్లారా! మా బాలనికాయండీ!

ఎర్రని వేముల్లా చిగురూ చాబట్టి ఏడుకోట్ల దేవతల్లారా! మా బాలనికాయండి.
(వేప చెట్టు చిగురు, ఆకు, పూవు, కాయ క్రిమి సంహారకాలు కదా! గ్రామ దేవత వేప మండ చేత దాల్చి వుంటుందని నాటి జనుల నమ్మకం).

పచ్చని వేముల్లా చిగురూ చాబట్టీ! పదికోట్ల దేవతలారా మాబాలనికాయండీ.
సెట్టీరావయ్య ! సెట్టికొడకా రావయ్యా ! సెట్టివారి చేతులవీ.
ఏమీ కారాలు! సొంఠీ మిరియమ్మూ సోధ్యపుకారాలూ! ఉల్లీ పిప్పళ్లు ఉత్తపుకారాలు వెండిరోళ్ల పోసిన కారాలు భమిడీరోకళ్ల దంపిన కారాలూ ! వెండీ చేటల్ల్ల తాల్చిన కారాలు
భమిడీ గిన్నెల వండిన కారాలూ! బాలింతరాలికీ ఇచ్చిన కారాలు
అంటూ వైశ్యులు వంశ పారంపర్యంగా ఎప్పుడూ తమ ఇంటికి బాలెంతరాళ్ళకు పెట్టె కాయపు సామాన్లు తెచ్చి ఇస్తారనీ, తాము వెండి రోళ్ళు, బంగారు రోకళ్ళు, వెదురు సామాను బదులు వెండివీ, ఇత్తడి పాత్రల బదులు బంగారు పాత్రలు వాడుకొనేటంతటి భాగ్యశాలులమని పాడుకుని మురిసిపోయే వారు ఆ స్త్రీలు.

ఎల్లవారి పురిటాలు పరుండేటందుకూ! కుక్కీ మంచమ్మూ గూనీ కుంపటీ!
మా పురిటాలు పరుండేటందుకూ పట్టీ మంచమ్మూ పరుపూ తలగడలూ!
ఎల్లవారి పురిటాలు కుడిచేటి కుడుపు
జోరీగల వంటి జొన్న అన్నమ్మూ!
మా పురిటాలు కుడిజేటీ కుడుపూ ! సన్నబియ్యమ్మూ సిరి సెనగపప్పు
చిక్కుడుకాయ, సిరిపొట్లకాయా! కాకరకాయ గారవడియమ్మూ!
అని సాటి సామాన్యుల్లో తమ మాన్యత్వాన్ని పేర్కొన్నాక ఎన్నెమ్మ కథ ప్రారంభం అవుతుంది.

             కథ : అనగా, అనగా ఒక రాజు, ఆయనకు ఒక్కతే కూతురు. ఒక్కతే కూతురనే గారాబం జేత ఆ పిల్లకు రోజు ఒళ్లు నలచి తలంటు పోయించే వాడు ఆ అమ్మాయి తండ్రి. పెరట్లో పారేసిన ఆ నలుగు పిండి, పసుపు కుప్పలపై రెండు చెట్లు మొలిచాయి. ఆ అమ్మాయి స్నానం జేసిన నీరు ఓ కాలువగా ప్రవహించసాగింది. పిల్ల ఎదుగుతూ వుంది. తండ్రికి ఇది కొంత వింతగాను ఒక రకంగా గొప్పగానూ తోచ సాగింది. ఎవరైతే ఈ చెట్ల పేరు, కాలువ పేరు చెప్పుకొంటారో వారికి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ఆ తండ్రి ప్రతిజ్ఞ చేసాడు. ఎంతెంత పండితులు వచ్చీ, ఎంతెంత విద్వాంసులు వచ్చి వాటి పేర్లు చెప్పలేక పరాభూతులై వెళ్లిపోతున్నారు. పిల్లకు పెళ్లీడు దాటి పోతుంది. పాపం ఈ పిల్ల కట్టు తప్పి పోతూంది, వీటి పేరు నేను చెప్తే నాకీ పిల్లనిచ్చి పెళ్లిచేస్తాడేమో చూద్దాం అనుకున్నాడు. అతిధి వేషంలో వచ్చి ఓహోహో! పసుపు చెట్టూ, నలుగు చెట్లూ వేయించి పసుపు కాలువ తవ్వించారే’’! అన్నాడు. వీటి పెరు చెప్పుకొన్నావు, నీకే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఇంటాయన. ఇల్లూ లేదు, వాకిలి లేదు. తల్లీ లేదు, తండ్రీ లేడు. నాకు పెళ్లేమిటి అన్నాడు పాలేరు. ఈ నాటి నుంచి మా ఇల్లే నీ ఇల్లు, మేమే నీ తల్లిదండ్రులం కాదనడానికి వీలు లేదు. అని తన కూతుర్నిచ్చి పెళ్లి చేసాడు. కూతురూ, అల్లుడూ ఇంట్లోనే వుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. ఈడు వారు జోడు వారు అత్తవారింటికి వెళ్ళడం చూచి, తండ్రి వద్దకు వెళ్లి నాన్న నాకు అత్తవారింటికి వెళ్లాలని మనసుగా వుంది అంది ఆ అమ్మాయి. తండ్రి అల్లుణ్ణి పిలిచి ఏమోయ్‌ మా అమ్మాయికి అత్త వారింటికి వెళ్ళాలని మనసుగా వుందట తీసుకొని వెళ్ళవలసింది అని అల్లుడికి కొంత డబ్బు ఇచ్చాడు. అతడు ఆ డబ్బుతో ఊరికి దూరంగాను,  అంత్య కులజుల పల్లెకు చేరువగానూ ఓ ఇల్లు వేసి భార్య, పిల్లలతో అందులో కాపురం పెట్టాడు.

                  రోజులు గడుస్తున్నాయి. రోజూ కూతుర్లకు తలలు దువ్వి జడలు వేసి, నీళ్లు పోసి, బొట్టు కాటుక పెట్టి లక్క పిడతలూ, దొండకాయలూ ఇచ్చి వాళ్ళను ఆడుకొమ్మని తాను మడి కట్టుకునేది. వాళ్ళు అవి అవతల పారేసి దగ్గరగా వున్న మాలపల్లెకు వెళ్లి ఎముకలూ, బొమికలు తెచ్చి ఆడుకొనేవారు. ఇదిలా వుండగా ఒక రోజు భర్త అరుగు మీద కూర్చొని వుండగా ఓ  అంత్య కులజుడు ఆ దారిన పోతూ ఓరి బావా! ఓరి ఎళ్లా యిలారా అని పిలిచాడు. ఇంట్లో పనిచేసుకుంటున్న రాచ కన్య ఇది విని అదేమిటండీ ఆ  అంత్య కులజుడు మిమ్మల్ని ఇలా పిలుస్తున్నాడు అని అడిగింది భర్తని ఏం లేదు. ఏదో పూర్వజన్మ స్నేహంలే అన్నాడు భర్త. ఇదేమిటో చూద్దాం అని అతడి వెనుకనే బయలుదేరింది. ఆమె భర్త మాల వానితో అతడి గూడేనికి వెళ్లి, వాళ్ల కంచాల్లో తిని, వాళ్ల ముంతల్లో త్రాగి వాళ్ల మంచాలపై దొర్లి, వాళ్ల గ్రామ్య భాషలో మాట్లాడటం చూసింది ఆమె. జరిగిన మోసం అర్థం అయిపోయింది. 

ఆనాడు వంటకు ఉపయోగించే పాత్రలు మైలపడితే కొందరు బయట పారేసేవారు. మరికొందరు నిప్పుల్లో కాల్చి వాటిని తిరిగి వాడుకొనేవారు. ఆ పక్రియలో దర్భపుల్ల కాల్చి వాటిమీద వేసేవారు. 

రాచ కన్య తిన్నగా ఇంటికి వెళ్లింది. ఏమి మాట్లాడకుండా వంట చేసి భర్తకూ, పిల్లలకూ పెట్టి తాను మాత్రం అభోజనంగా పడుకుంది. ఓ రాత్రి వేళ లేచి ముంజూరు ముట్టించి తిరిగి పడుకొంది. తెల్లవారేసరికి నలుగురూ ఆ యింటితో పాటు కాలి ముగ్గి ముతమారి వున్నారు. నలుగురి జీవుళ్లు ‘‘ముత్తి ముత్తో’’ అంటూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు.
బ్రహ్మదేవుడు మీ అమ్మ కడుపు కాలా మీకేం ముక్తి నీ భర్త పోతురాజు గ్రామ దేవత గుడి ముందు రాయిగా వుండి గ్రామదేవతతో పాటు పూజలందుకుంటాడు. 
నీ బిడ్డలిద్దరూ కొత్తెమ్మ, కొర్రెమ్మ పురిటి నీళ్ల నాడు పెట్టే షడ్రసోపేతమైన నైవేద్యం వీళ్లకు ఆహారం.
నువ్వు ఎన్నెమ్మవి పురుగై తిరుగుతూ నిన్ను ఎవరైతే తలవరో వారి పురిటి శిశువుల్ని తింటూవుండు అదే నీకు ఆహారం అన్నాడు ఎన్నెమ్మతో. 

ఆనాటి కొందరి జాత్యహంకారానికీ, ముర్ఖత్వానికీ నిదర్శనం ఈ కథ. పాలేరు చేసింది వంచనే అయినా అతడిలో కల్లా కపటం లేదు. వాడు చేసిన పనిలోని ప్రమాదం అతడికి తెలియదు. పిల్లలు ఏ పాపం ఎరుగని అమాయకులు.

                     రాచ కన్య ఎన్నెమ్మా! మాదిగాడి పెళ్లాం ఎన్నెమ్మా! అని పాడితే ఆమె సిగ్గుపడి బుగ్గ కరచుకొని ఏడు వాడలకు రాకుండా పారిపోతుందట.

ఒక్కోనాటెన్నమ్మా। వంటిన్నివుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
రెండోనాటెన్నమ్మా। రెంటిన్నీవుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
మూడోనాటెన్నమ్మా। ముంగిళ్లవుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
నాలుగోనాటెన్నమ్మా నట్టింటవుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
ఐదోనాటెన్నమ్మా। అందందివుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
ఆరోనాటెన్నమ్మా । ఆరుస్తూ వుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
ఏడోనాటెన్నమ్మా । ఏడుస్తూ వుండూ। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
ఎనిమిదోనాటెన్నమ్మా । ఏరుదాటిపాయె। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
తొమ్మిదోనాటెన్నమ్మా । తోరణం దూరిపాయె। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ
పదోనాటెన్నమ్మా। పప్పుముద్ద ఎన్నెమ్మా పట్నం దాటిపాయె। బాలని కన్నాతల్లి! పదిలానావుండూ


అని పాడుతూ మల మూత్ర విసర్జన వేళ ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం వుందని 3,4,5,6 రోజులు మాతా, శిశువుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలని, ఏడవ రోజున ఎన్నెమ్మ తన ప్రయత్నాలు సాగలేదని ఏడుస్తూ వుంటుందనీ, ఏడు రోజులు దాటితే కొంత ఆపద తొలుగుతుందని, పదో రోజున పప్పుముద్ద అంటే అంతా శుభమని ఈ పాటలో అన్యాపదేశంగా చెప్తారు. సామాన్యంగా 11వ రోజున జరిగే పురిటి స్నానం కొన్ని ప్రాంతాలలో 7 రోజులు గడిచాక 8వ రోజున చేయించడం తిరిగి 3 రోజులూ దూరంగా వుంచి శుద్ధి కార్యక్రమం మాత్రం 11వ రోజునే చేయించడం ఆచారంగా వుండేది.

నిఘూడంగా ఉన్న సైన్స్ ఏమైనా అర్థం అయితే ఆనందం లేదంటే ఇదీ ఒక వ్రుధా కధ అనుకుని వదిలెయ్యండి..