Saturday, November 2, 2013

నిన్ను నువ్వే తెలుసుకో

మరు జన్మమో, జన్మ రాహిత్యమో..
ఆధునిక పోకడ లో అంతటితో అంతమో..

ఎవరికి యెరుక?

ఆది నుండి అంతందాకా 'నేను ' అన్న పదానికి
నిర్వచనం 'శరీరం', 'మనసు ' !

నిన్ను నువ్వే తెలుసుకో
నీతో నిన్నే కొలుచుకో
ఎక్కువ తక్కువలు బేరీజు వేసుకో

క్రికెట్టు మైదానంలో ఫ్లడ్డు లైటు లా
ఓ ప్రక్క నిలబడి, పై నుంచి నిన్ను నువ్వే చూసుకో
నీ హృదయపు వెలుగులో
నీ ప్రతి చేష్టని చిట్టా రాసుకో


రోడ్డు దాటించి సాయం చేసినప్పుడో
రోడ్డుకడ్డం పడినందుకు బూతులు తిట్టినప్పుడో
నీ హృదయంలో నిన్నే తూర్పారబెట్టుకో

నిన్ను గురించి నువ్వు
నవ్వుకుంటూనో .. నొచ్చుకుంటూనో
మెచ్చుకుంటూనో .. మధనపడుతూనో
నీతో కాస్త నువ్వు గడుపు

ఎంత కాలం వారి కళ్ళలోంచో
వారి ఆశ నుంచో
నిన్ను నువ్వు నిర్ణయించుకుంటావ్?

నిన్ను నువ్వు చూసుకునే కళ్ళు నీవి కానంత కాలం
నీకు తెలిసిన నువ్వు నువ్వు కాదు
అది నీకు నువ్వు చేసుకుంటున్న మోసం
నీతో నువ్వు ఉండటం ఏకాంతం
ఒంటరితనమంటే వేరే ఉంటుంది
అదీ ఇది ఒకటే అనుకుని ఏకాంతం తప్పనుకోకు

కరెంటు పోయిన చిమ్మ చీకటి లోనో
కావాలని కల్పించుకున్న ఏకాంతంలోనో
నిద్దుర పట్టక నింగికి చూస్తూనో
గదికి ఒక మూల గొంతుకు కూర్చొనో

ఊహ తెలిసినప్పటి నుంచి
వేసిన తప్పటడుగులూ
చేసిన మంచి పనులూ
సమాలోచన చెయ్
అవసరమైతే చెప్పుతో కొట్టేయ్
నీ చెంపేమీ పగిలి పోదుగా?

నీ మెదడులో ప్రతీ పదం
నీ చేతలో ప్రతీ భావం
స్వచ్చమైన తెల్లటి వెలుగులో పరికించి చూసుకో

నిన్ను నువ్వే తెలుసుకో !



'జరుగుతున్న దానిపట్ల ఎరుక కలిగి ఉంటూ దానితోపాటు జీవించటమే ఆధ్యాత్మికత.
తాడును పాము అనుకోకపోవడమే యథార్థత.

'ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి యథార్థతను గ్రహించుకోకుండా భ్రమలతో, భయాలతో, దుఃఖాలతో బతుకుతున్నాడు, వీటినుంచి బయటపడటానికి భద్రతను వెతుక్కుంటున్నాడు. ఆ భద్రత, ఆస్తులు కూడబెట్టుకోవడంలోనూ, హోదా పెంచుకోవడంలోనూ లేదు. తనను తాను తెలుసుకుని, తనలో సంపూర్ణమైన మార్పు పొందినవాడే భద్రత సాధించగలడు' .

మనిషి మానసిక స్థితినిబట్టి అతడి చర్యలుంటాయి. తన చేతనలోను, అంతః చేతనలోనూ, లోపలిపొరల్లో ఉండే తన స్థితిని తెలుసుకోగలిగితే తానెందుకు భయపడుతున్నాడో, ఎందుకు దుఃఖపడుతున్నాడో అర్థంచేసుకుంటాడు. అలా వాటినుంచి విముక్తి పొందగలడు. అదే 'స్వీయజ్ఞానం'.

మనిషి భద్రతకోసం పడే ఆరాటంలో నుంచే కూడబెట్టుకోవడం, ఆర్జించుకోవడం అనే తత్వం వస్తుంది. గాఢోద్రేకాలూ, అసూయ, దుర్బుద్ధి... ఇవన్నీ కూడా ఆర్జించుకునే మనస్తత్వంలో నుంచే పుడతాయి. వాటినుంచి విడుదల కావాలంటే, తనలో జనించే ఆలోచనలను, వాటివల్ల శరీరంలో వచ్చే ప్రతిస్పందనలను అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆ అవగాహనే మనిషికి సత్యమంటే ఏమిటో తెలుసుకునే గ్రహింపునిస్తుంది.

జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్లుగా గ్రహించాలి. అంటే దానికి ఏ విధమైన ఊహలు, అపోహలు జోడించకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగలిగితే- సత్యాన్ని తెలుసుకున్నట్టే.
ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనసు ఎటువంటి భయాలూ లేకుండా ఉండాలి. అలా మనసు అటూ ఇటూ తిరుగాడకుండా నిశ్చలత్వాన్ని పొందినప్పుడే సత్యాన్ని గ్రహించగలుగుతాం. అలా నిశ్చలమైన మనసును సాధించాలంటే మనసులో పుట్టే ప్రతి ఆలోచన పట్లా ఎరుక కలిగి ఉండాలి. వాటిని అవగాహన చేసుకోవాలి. ఆ నిశ్చలమైన మనసే అన్ని సంఘర్షణలనుంచి, దుఃఖాలనుంచి తప్పించగలుగుతుంది'.

స్మృతులు పనిచేస్తున్నంతవరకు మనిషి యథార్థతను కనిపెట్టలేడు. అందుకే వాటినుంచి విముక్తి పొందాలి అని మనసు తనకు తానే చెప్పుకొంటుంది. మనసు తాలూకు చేతన, అంతఃచేతనా అన్నింటినీ అవగాహన చేసుకుని ఎటువంటి కదలికా లేకుండా నిలిచిపోతుంది. ఈ స్థితిలో ఒక బ్రహ్మాండమైన సజీవశక్తి, శాంతి అప్రమత్తతా ఉంటుంది. ఆ శాంతమైన మనసులో చురుకుతనం, విస్తృతమైన ఎరుక ఉంటాయి. అక్కడ కేవలం అనుభూతి చెందుతూ ఉన్న స్థితి ఉంటుంది. ఆ స్థితిలోనే యథార్థాన్ని చూడగలరు. సత్యాన్ని తెలుసుకోగలరు. ఇదంతా తెలుసుకోవాలంటే మనిషికి తనను గురించి తాను తెలుసుకోవటం ఎంతో అవసరం.

Monday, October 14, 2013

రాజ్యం దోపిడీదారుల భోజ్యం - జాహ్నవి

ప్రతి దోపిడీ వెనుక రాజ్యం, లేదా రాజ్యాన్ని ఆసరా చేసుకుని బ్రతికే శక్తులే ఉంటాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం దోపిడీ కాదు. ఈ విషయాల్లో తప్పుడు మార్క్సిస్టు అవగాహనల నుంచి బయటపడితే తప్ప దోపిడీ మూలాలను గుర్తించడం, వర్గ చైతన్యం పెంచుకుని, దోపిడీకి వ్యతిరేకంగా జతకట్టి పోరాడడం సాధ్యం కాదు. ప్రజలు కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీల్లాంటి కృత్రిమ విభజనలకు లోనై తమలో తాము కలహించుకుంటూ అసలు దొంగైన రాజ్యాన్నే ఆశ్రయించి న్యాయం కోరడం, తీర్పు చెప్పమనడం హాస్యాస్పద విషాదం.
డబ్బు సంపాదించడానికి రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి, కష్టపడాలి, సంపాదించాలి, కొంత వాడుకుని మిగతాది పొదుపు చెయ్యాలి, దాన్ని మదుపు చెయ్యాలి (పెట్టుబడి పెట్టాలి), వచ్చిన లాభంలో కొంత వాడుకుని మిగతాది పొదుపు, మదుపు.. ఇలా. అటువంటివారు సంపద సృష్టికర్తలు. ఇతరులె వరినీ నష్టపెట్టకుండా యాంత్రీకరణ, పని విభజన, కొత్త సాంకేతిక ఆవిష్కరణల ద్వారా సంపద సృష్టించి లోక కళ్యాణానికి కారకులవుతారు. రెండో మార్గం-పైవన్నీ చేసి సంపాదించిన వాళ్ళ దగ్గర్నుంచి లాక్కోవడం. మానవజాతికి రెండు మార్గాలు సాధ్యమే. సంపద సృష్టించేవారు చిన్న స్థాయి మొదలుకుని, వ్యాపార, ఉత్పత్తి సంస్థలుగా, బహుళజాతి కంపెనీలుగా విస్తరిస్తారు. అలాగే లాక్కుని తినేవాళ్ళు కూడా దొంగల ముఠాలుగా, రాజకీయ పార్టీలుగా, ప్రభుత్వాలుగా, రాజ్యాలుగా ఏర్పడి ఎవరూ కన్నెత్తి చూడలేనంత పెద్ద పెద్ద సంస్థలుగా రూపొందుతారు.
అవి క్రమేపీ తమ పరిధులను విస్తరించుకుని, ఊడలు తీరిన మహావృక్షాలవుతాయి. ఈ వాస్తవిక కోణం నుంచి చూస్తే చరిత్ర అంతా కష్టపడి సంపాదించే వర్గం ఒకవైపు, వారిని దోచుకుని తినే పాలక వర్గం రెండోవైపు ఉండి, ఈ రెండు వర్గాల మధ్య జరిగిన సంగ్రామాల సమాహారంగా కనిపిస్తుంది. కాబట్టి, చరిత్రను వివరించడానికి వివిధ కాలాల్లో ఉన్న స్వేచ్ఛ, దోపిడీ పాళ్ళు, పరాన్నజీవితాలు, ఆర్థిక అణచివేత, ఆస్తి హక్కులు, వాటిని కాలరాసిన తీరు లేదా రక్షించిన సంస్కృతి-ఇవే ప్రధానాంశాలు కావాలి. అలా కాకుండా చరిత్రను రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, కట్టడాల రూపంలో వివరిస్తే, అది సారంలేని విశ్లేషణ, వృథా ప్రయాస అవుతుంది.
కొద్దిమందితో కూడిన పాలక వర్గం అసంఖ్యాక ప్రజా శ్రేణుల్ని శాసిస్తూ, దోపిడీ చెయ్యాలంటే, ప్రజల్లో వర్గ చైతన్యం చాలా నిమ్న స్థాయిలో ఉంచాలి. అంటే తాము దోపిడీకి గురవుతున్నామన్న విషయం, అది ఏ విధంగా జరుగుతోంది అన్న వివరాలు ప్రజలకు తెలియకూడదు, వాటిపై ప్రజల్లో విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయం రాకూడదు. వస్తే పాలకవర్గం పట్ల వ్యతిరేకతకు, విప్లవానికి దారితీస్తుంది, కొంపమునుగుతుంది. వర్గ చైతన్యం ప్రబలకుండా తీసుకునే జాగ్రత్తల్లో మొదటిది ఒక రాజ్యంగా, వివిధ చట్ట సంస్థలు, చ ట్టాలు ఏర్పరచడం. దాని ద్వారా సమాజంలో శాంతి, సుస్థిరతలు ఏర్పడతాయని బయటకు చెబుతారు. నిజానికి సుస్థిరమయ్యేది పాలకవర్గం, వారి ప్రత్యేక స్థానం, వారి విశేష అధికారాలు. ప్రజాదరణ కలిగిన సమానత్వం, స్వేచ్ఛ, ఆస్తి హక్కు లాంటి భావాలను పొందుపరుస్తూనే, పాలకవర్గాల ప్రత్యేక అధికారాలను, పాలితుల పరిమితులను చట్రాల్లో బిగించేస్తారు. ఉదాహరణకు పేరుకు ఆస్తి హక్కు ఉంటుంది, కానీ ప్రభుత్వం దానిమీద ఇష్టమొచ్చిన పన్నులు వేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు జాతీయం చెయ్యొచ్చు. అందరూ సమానమే కానీ మంత్రులు, అధికారులు, రాష్ట్రపతి, గవర్నర్లు, జడ్జీలు ఎవరూ ప్రశ్నించలేనంత ప్రత్యేక రక్షణలు కలిగి ఉంటారు.
స్వేచ్ఛ ఉంటుంది, కానీ ప్రభుత్వం ఎప్పుటికప్పుడు నిర్ణయించే పరిమితుల మధ్య మాత్రమే అనుభవించగలం. పాలితుల విషయంలో అమలయ్యే చట్టాలు, విధానాలు తమకు వర్తించకుండా చూసుకుంటారు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, పాలకవర్గ ప్రయోజనాలకు మధ్య పేచీ వస్తే పాలకవర్గమే గెలిచేలా చట్టాలు రాసుకుంటారు. ప్రజల కష్టఫలం నుంచి కావలసినంత భాగం పన్నులు, సెస్సుల రూపాల్లో లాక్కోవడానికి ప్రశ్నించజాలని విశేషాధికారాలు కల్పిస్తారు. ఆ విధంగా కష్టపడే వారికి వారి కష్టఫలం మీద, వ్యక్తులకు వారి శరీరాల మీద హక్కు లేకుండా చేస్తారు. అదే అసలైన దోపిడీ. మార్క్సు దీన్ని ఎత్తి చూపకుండా, అదనపు విలువ, అదనపు శ్రమ సిద్ధాంతాల భ్రమలో కొట్టుకుపోయాడు. ఆస్తి హక్కులను చట్టపరంగా గుర్తించడం ద్వారా దోపిడీ వర్గాలు వర్గ న్యాయాన్ని (ఇజ్చూటట ఒఠట్టజీఛ్ఛి) అనుసరిస్తాయన్న మార్క్సు వివరణ శుద్ధ తప్పు. పాలకవర్గం తన వర్గ న్యాయాన్ని నిజానికి ఎలా అమలు చేస్తుందంటే - తాము కష్టపడకుండా తిని కూర్చోవడానికి వసూలు చేసే దాన్ని పన్నులంటుంది. అదే పని ప్రైవేటు వ్యక్తులు చేస్తే దాన్ని దొంగతనంగా జమకడుతుంది. ఈ వైరుధ్యం ద్వారా మాత్రమే పాలకవర్గ న్యాయం అమలవుతుంది.
దోపిడీ విధానాన్ని గుర్తించి, వివరించడంలో విఫలమైనా, రాజ్యం యొక్క మౌలికమైన దోపిడీ స్వభావాన్ని మార్క్సు సరిగానే గుర్తించాడు. సంక్షేమం పేరుతో సంపద పునఃపంపిణీ వ్యూహాల ప్రాముఖ్యతను, వాటి వెనుక ఉండే అసలు ఉద్దేశాలను కూడా సరిగానే గుర్తించాడు. సంక్షేమ పథకాలను కార్మిక వర్గానికి విసిరే రొట్టెముక్కలుగా అభివర్ణిస్తూ, వాటి కోసం ఆశపడి, విప్లవ అవసరాన్ని మరువవద్దని తన కరపత్రాల ద్వారా బోధించాడు. నిజానికి సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశం పాలిత ప్రజల్లో వర్గచైతన్యం పెరక్కుండా చూసుకోవడం, ప్రజల్లో రకరకాల విభజనలు తెచ్చి, అందరూ కలిసిపోకుండా, దోపిడీ వర్గానికి ఎదురు తిరగకుండా నిలువరించడం. ఈ వ్యూహపు ఫలితాలు కళ్ళెదుటే ఉన్నాయి. 'తింటే తిన్నాడు, మనక్కూడా కొంచెం పెట్టాడు కదా!' అనే ఆలోచనలు దీనికి రుజువు. పాలకవర్గ పదవులను ప్రజాస్వామీకరించి, తలా ఒక పదవి పడెయ్యడం కూడా ప్రజల్లో వర్గచైతన్యాన్ని తగ్గించి, విభజనలు సృష్టించే వ్యూహంలో భాగమే. అందుకే కొత్త పదవుల సృష్టి జరుగుతూనే ఉంటుంది. మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, శాసనమండలి పునఃప్రతిష్ట, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, చివరికి ఆదర్శ రైతులు - ఇవన్నీ ఆ ప్రయత్నాలకు సాక్ష్యాలే.
మార్క్స్ కూడా సరిగ్గానే గుర్తించినట్లుగా ప్రచారం, ప్రాపగాండా, మభ్యపెట్టే కళల్లో రాజ్యం ఆరితేరింది. దోపిడీని నిజమైన స్వేచ్ఛగా నమ్మిస్తుంది. అవి నిర్బంధ పన్నులు కావు, స్వచ్ఛంద విరాళాలంటుంది. అది పౌర బాధ్యత అంటుంది. ఎవరూ ఎవరినీ పాలించడం లేదు, మనల్ని మనమే పాలించుకుంటున్నామని నమ్మబలుకుతుంది. వీటన్నిటికీ అంతులేని నిధుల్ని, తన శక్తియుక్తుల్ని వెచ్చిస్తుంది. రూ.500 కోట్లతో భారత్ నిర్మాణ్ ప్రచార భేరి ఇందులో భాగమే. ప్రాథమిక స్థాయి నుంచి పాఠ్యాంశాలను రాజ్యమే నిర్దేశించడానికి కారణమిదే. తద్వారా పాలకవర్గ సర్వసత్తాకతకు ఎక్కడా భంగం కలగకుండా, ఎటువంటి విరుద్ధ భావనలూ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పుడన్నా ఏదన్నా సంక్షోభం ఎదురైతే, సంపాదించేవారి స్వార్థాన్ని ఎత్తిచూపి, సరిపడా పన్నులు కట్టడం లేదని ఆడిపోసుకుంటారు. అంతేగానీ, పార్లమెంటు సభ్యులకు మూడొందల కోట్ల మార్కెట్ విలువ గలిగి, ఎకరం భూమిలో కట్టిన బంగ్లాలు, రాష్ట్రపతికి మూడొందల యాభై ఎకరాల ఎస్టేటు ఎందుకు అవసరమో పొరపాటును కూడా చర్చలోకి రానీయరు.
చివరగా, రాజ్యానికి, వ్యాపారస్తులకు - ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మార్క్సు ఎత్తిచూపడం సరైనదే. కానీ దాన్ని వివరించడంలో తప్పుడు అవగాహన చూపాడు. రాజ్యం ఆస్తి హక్కుల్ని కాపాడుతుంది కాబట్టి వ్యాపార వర్గాలు రాజ్యం మీద ఆధారపడుతున్నాయన్నాడు. అది శుద్ధ తప్పు. వాస్తవం దానికి పూర్తి విరుద్ధం. నిజానికి రాజ్యం రకరకాల రాజ్యాంగ అధికరణలు, చట్టాలు, పన్నుల వ్యవస్థల ద్వారా ఆస్తి హక్కులను కాలరాస్తుంది కాబట్టే వ్యాపార వర్గాలు రాజ్యం పంచన చేరతాయి. కొందరేమో తమ ఆస్తులను రాజ్యం లాక్కోకుండా చూసుకునేందుకు, కొందరేమో లైసెన్సులు తెచ్చుకుని లాభపడేందుకు, మరికొందరు రాజ్యం అండతో తమకు పోటీ లేకుండా చూసుకునేందుకు ఆశ్రిత పెట్టుబడిదారులవుతారు. కొన్ని దశాబ్దాల పాటు బజాజ్ స్కూటర్లు, అంబాసిడర్ కార్లు పోటీ అనేదే లేకుండా బ్లాకులో అమ్ముడయ్యేవి. తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ వాతావరణం 'అనుమతించే' సరికి అవేమయ్యాయి? కనుమరుగయ్యాయి.
ఒక రంగంలో గుత్తాధిపత్యాలు పోయి, పోటీ వాతావరణం వచ్చినా, రాజ్యం తన దోపిడీని వేరే రంగాలకు మళ్ళించింది. జలయజ్ఞం, స్పెక్ట్రమ్, బొగ్గు బ్లాకులు, కేజీ బేసిన్ కట్టబెట్టడాల ద్వారా ఊహాతీతమైన స్థాయిలో దోపిడీకి పాల్పడింది. అది బయటపడి వివాదాస్పదమైంది కాబట్టి ఇప్పుడు దోపిడీ ఇంకో రంగానికి మళ్ళుతుంది. మనకు తెలిసే లోగా గుటకాయ స్వాహా అయిపోతుంది. అందుకే వ్యాపార రంగం రాజ్యాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి ఆశ్రిత పెట్టుబడిదారీతనం ఒక నిరంతర వాస్తవం. రిజర్వు బ్యాంకు ఆధీనంలో బ్యాంకింగ్ రంగం వ్యాపార వర్గాలకు కృత్రిమమైన తక్కువ వడ్డీకి రుణాలందిస్తుంది. ప్రభుత్వానికి అవసరమైనన్ని నోట్లు ముద్రిస్తుంది. నగదు నిష్పత్తుల నిరంతర సవరణల ద్వారా బ్యాంకులు గాల్లోంచి డబ్బు సృష్టించే వెసులుబాటు కల్పిస్తుంది. ప్రజలు ఈ విష వలయం నుంచి తప్పించుకునే వీలు లేకుండా ఆదాయ పన్ను చట్టాలు, బంగారం మీద నియంత్రణ చట్రాలు గట్టిగా బిగిస్తుంది. అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలంటుంది. దాంతో ప్రతి లావాదేవీ పైనా రాజ్యం పెత్తనం ఉండి, ఎక్కడ కావాలంటే అక్కడ పన్ను విధించి దోచుకోవచ్చు.
ఇదీ అసలు దోపిడీ జరుగుతున్న విధానం. దోపిడీ శక్తుల వివరణ. ప్రతి దోపిడీ వెనుక రాజ్యం, లేదా రాజ్యాన్ని ఆసరా చేసుకుని బ్రతికే శక్తులే ఉంటాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం దోపిడీ కాదు. ఈ విషయాల్లో తప్పుడు మార్క్సిస్టు అవగాహనల నుంచి బయటపడితే తప్ప దోపిడీ మూలాలను గుర్తించడం, వర్గ చైతన్యం పెంచుకుని, దోపిడీకి వ్యతిరేకంగా జతకట్టి పోరాడడం సాధ్యం కాదు. ప్రజలు కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీల్లాంటి కృత్రిమ విభజనలకు లోనై తమలో తాము కలహించుకుంటూ అసలు దొంగైన రాజ్యాన్నే ఆశ్రయించి న్యాయం కోరడం, తీర్పు చెప్పమనడం హాస్యాస్పద విషాదం. మనం ఇరుక్కుపోయిన ఈ సాలెగూడు నుంచి తప్పించుకోవడమెలానో వచ్చేసారి చూద్దాం.
- జాహ్నవి