Saturday, March 15, 2014

ఏమో ఎవరికి తెలుసు?

ఏమో ఎవరికి తెలుసు?
నీ గొంతే పెగలపోతే
నిత్యం నలిగిపోతున్న బతుకుల బాధలకు
తిరుగుబాటు పదాలు అర్థంకావేమో !

ఏమో ఎవరికి తెలుసు?
నీ పిడికిలే బిగుసుకోకపోతే
అన్యాయాన్ని అంతమొందించే
పోరు పలుగుకు పదును రాదేమో !

ఏమో ఎవరికి తెలుసు?
నీ అడుగే ముందుకు పడక పోతే
ప్రగతి బాటన నడిపించే నాయకుడు లేక
అభివ్రుద్ధి చతికిల పడిపోతుందేమో !

ఏమో ఎవరికి తెలుసు?
నువ్వు ఆశాజ్యోతివై వెలగకపోతే,
నడుస్తున్న నడిరాతిరిలో
రేపటి సూర్యోదయందాకా బతకలేరేమో?

ఏమో ఎవరికి తెలుసు?
నువ్వొక్కడివే ఆగిపోతే
గాంధీజీ కోరుకున్న గౌరవమైన దేశం
నేతాజి కలలు కన్న స్వంతంత్ర దేశం
నేతలెందరో నెగ్గుకొచ్చిన నేటి భారతం
నిర్వీర్యమై నైరాస్యాన మునిగిపోతుందేమో !!

అందుకే ..
నువ్వొక్కడివే అని నిరాశ చెందకు
నీ గొంతులో నిజాయితి ఉంటే,
అది కోటి గొంతుల కొలువై ధ్వనిస్తుంది
నీ పిడికిలి ప్రజలకై బిగిస్తే,
ఆ బలానికి కొండైనా పిండిగా మారుతుంది
నీ అడుగులో అభివ్రుద్ధి ఉంటే,
నీ అనుచరుల పదఘట్టనకు ఆకాశం దద్దరిల్లుతుంది
నీ ఊపిరి ప్రజా ఉద్యమమైతే
అది ఉప్పెనై అన్యాయాన్ని కాలరాస్తుంది

నువ్వే ఆగి పోకుండా ఉంటే...
నువ్వెంత వాడివో లోకానికన్నా ముందు నీకే తెలుస్తుంది,
దేశభక్తుల చిట్టాలో నీ పేరూ చేరుతుంది!!!

Tuesday, March 11, 2014

వక్క పలుకులు

17 Mar,2014
నీకున్న స్వతంత్రం ఆకాసమంత
నువ్వు భయపడుతూఉంటే నీకు చిక్కేది అణువంత !
భయపడడమంటే నిన్ను నువ్వు కోల్పోవడం అని తెలుసుకున్న రోజున
నువ్వు భయపడటానికే భయపడతావ్ !!
------------------------------------------------x-x-x--------------------------------------------------
Feb 5,2014
మనకి నచ్చకపోతే పశువులా ప్రవర్తించాడు అనేస్తామ్.. పసువులకేమి తెలుసు పాపం ?
మనిషి ఎప్పుడూ మనిషిలానే ఉన్నాడు !
ఆలోచించ గలగటమ్ మనిషికి వరమ్... శాపం కూడా !
మనమే మన తప్పుడు ఆలోచనలన్నింటికి పశువులను ఆపాదిస్తామ్, కుదరకపోతే పక్క మనిషి పైకి నేట్టేస్తామ్ !
మనిషి మనిషిలా కాదు దేవుడిలా బతకాలి.. దేవుడిని మనిషి పుట్టించడంలోని పరమార్థం కూడా అదే !!
------------------------------------------------x-x-x--------------------------------------------------
Feb 2,2014

వినాయకునికే దిష్టి కొట్టిన చంద్రుని రాచద్రిష్టి,
నా ప్రియురాలి పసిడి మేనికి తగలకుండా...
నేనే, ఆకాశంలో ఆ నల్ల మబ్బులను అలికేసా ! 

------------------------------------------------x-x-x--------------------------------------------------
Jan 25,2014
తిరుగు ప్రయాణంలో బట్టల బ్యాగ్గు బరువనిపిస్తుంది, కొత్తవేమి పెట్టకపోయినా !
ఎందుకు చెప్మా?
ఒకవేళ వెల్లేటప్పుడు ఉన్న ఉత్సాహం,ఆసక్తి తిరుగు ప్రయాణానికి నీరుగారిపోవడం వల్లనా?
జీవితంలో కూడా అంతే... ఎప్పుడైతే ఉత్సాహం,ఆసక్తి తగ్గిపోతాయో, అప్పుడు బతుకు బరువనిపిస్తుంది. అందుకే మన రావుగోపాల రావు అంటాడు "మడిసన్నాకా కూసింత కళా పోసన ఉండాలో " అని.
------------------------------------------------x-x-x--------------------------------------------------
19 Jan,2014
నిన్ను నువ్వు చూసుకునే కళ్ళు నీవి కానంత కాలం
నీకు తెలిసిన నువ్వు నువ్వు కాదు
------------------------------------------------x-x-x--------------------------------------------------
13 Jan,2014
వందమందిలో ఉన్నా..నీ తలపుల్లోనే ఉన్నా,
నీ తోడె నాకుంటే.. ఆనందం మిన్నంటే !

ఆడగకుండానే ఎన్ని కలలొ కళ్ళకి,
తెల్లారి లేచి దుప్పటి దులిపితే... సాక్ష్యం లేదు దేనికీ !

కదిలిపోయె ప్రతి నిమిషాన్ని తడిమి చూస్తున్నా, 
నీ ఊసుల పూసలు అతికించాలని !

ఎన్నో కలలు కంటున్నా,
కలైనా నిజమైనా..
రేపటికి మిగిలేది తీపి గురుతేగా !
------------------------------------------------x-x-x--------------------------------------------------
10 Jan,2014
పల్లెటూరిలో దున్నపోతులు నల్లగా నాలుగు కాళ్ళతో ఉంటాయి
ఎదోక అడ్డమైన గడ్డి నములుతో రోడ్డుకడ్డంగా నడుస్తాయి
పట్నంలో మాత్రం అలాకాదు,
దున్నపోతులు రంగు రంగుల పాంటు షర్టో లేక పంజాబి డ్రస్సో వేసుకుని
ఫోన్లో పోచికోలు కబుర్లుచెప్తోనో, పక్కమ్మాయితో పనికిమాలిన కబుర్లో చెబుతూనో
తింగరి మాలోకాల్లా రోడ్డుకడ్డంగా నడుస్తుంటాయి
------------------------------------------------x-x-x--------------------------------------------------
20 Sep,2013
సత్యానికి వాదనకీ
మంచితనానికి చేతకానితనానికీ
సహనానికి పిరికితనానికీ
తేడా తెలియనంతవరకే ఒకలా ఉంటాయి

ఎక్కుతూ ఉంటే ఎవరెస్ట్ అంత ఎత్తైనా తరిగిపోతుంది
తొక్కుతూ ఉంటే సముద్రమంత సహనం కూడా చెదిరిపోతుంది !
------------------------------------------------x-x-x--------------------------------------------------
10 Nov,2013
జీవితంలో ఆనందాలు తత్కాల్ టికెట్ లాంటివి, అవి దొరికినా.. దొరకక పోయినా.. పయనం కొనసాగించాల్సిందే!