Thursday, July 2, 2015

ప్రక్షాళణే దేవుని లక్ష్యం



అదేదో ఊరి నుండి మహా శిల్పి వచ్చాడు,
మరేదో ఊరినుండి పెద్ద బండ తెచ్చాడు,
ఆరడుగులు కొలతపెట్టి బండను ఖండించాడు,
మూడడుగుల ముక్కను పక్కకు తోసేసాడు !

ఆరడుగల బండేమో విగ్రహమై వెలిసింది,
మూడడుగుల బండేమో చాకిరేవు చేరింది,
కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి,
కంపుగొట్టు బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి !

గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిసాయి,
మురికి మరకల బట్టలన్ని నీటిలో మునిగాయి,
అర్థంగాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు,
చాకలి నోటివెంట హిస్సు హిస్సు శబ్దాలు !



శటగోపం పవిత్రంగా ప్రతి తలనూ తాకుతోంది,
పవిత్రతకై ప్రతిబట్ట బండను బాదుతోంది,
కడకు దేముడినుండి ప్రతి మనసూలన్నీ కంపుతోనే వెళ్ళాయి,
రేవునుండి బట్టలన్ని ఇంపుగానే వెళ్ళాయి !

బండలోని దేముడా, దేముడి లోని బండా !
ఎవరు దేముడు ? ఎవరు బండ ?

-Actor Ranganath





Thursday, June 11, 2015

నువ్వు చూసావో లేదో ..



నువ్వు చూసావో లేదో
నాకు కవితే స్పురించట్లా,
నీతో మాట్లాడకపోతే

నువ్వు చూసావో లేదో
నాకు ఎమీ తోచట్లా,
నువ్వు మౌనంగా ఉంటే

నువ్వు చూసావో లేదో
నా నిశీధి వీధిలో వెన్నెల రేడు ఉదయించట్లా
నీ ఊసులు లేకపోతే
ఏ తారల తళుకులూ కనిపించట్లా

నువ్వు చూసావో లేదో
గమనించావో లేదో
నువ్వే లేకపోతే
నాలో నా పోలికలే కనిపించట్లా !!