ప్రేమంటే ఇంతేనా?
అప్పుడెప్పుడో మీనాల్లాంటి కళ్ళు అని మొదలు పెట్టి
నఖ శిఖ పర్యంతం కవితలల్లుకున్న ఆ కొన్ని రోజులేనా?
అని ఆలోచిస్తే...
నువ్వు వదులుకున్న పుట్టినిల్లు, ఇంటిపేరు
నిలబెడతావన్న నమ్మకంతో నేను పంచుకున్న,
సమాజంలో ఉన్న మంచి పేరు ..
నేర్చుకున్న వంటలు, కట్టుబాట్లు
సర్దుకున్న మార్పులు, అలవాట్లు
ఎంచిన కొత్తబట్టలు,
ఉతికిన పాత బట్టలు,
కొట్టిన దోమలు
తల నిమిరి కప్పిన దుప్పట్లు,
మోసిన బస్తాలు,
కలిసిన సంపాదనలు
పరిక్ష పెట్టిన దెబ్బలాటలు, గొడవలు
బలం చేకూర్చిన ప్రేమాప్యాయతలు
తారల్లా సరదాలు, సంబరాలు
పిల్లల పెద్దల సంగతులు
నేర్చుకున్న ఎత్తులు పల్లాలు,
ఓర్చుకున్న మంచి చెడులు
పాల డబ్బాల నుండి, స్కూలు ఫీజుల దాకా
పిల్లల పురిటి నెప్పుల నుండి, పెద్దల మోకాళ్ళ నొప్పుల దాకా
నువ్వూ నేనూ మనమై వేస్తున్న
ప్రతి అడుగూ ప్రేమను అంతర్గతంగా తెలిపే కవనమే
పలికే ప్రతి పదమూ సున్నితమైన రాగమే
వెరసి,
ముడిపడిన మన జీవితం
మౌనంగా "నిన్ను ప్రేమిస్తున్నా"
అని చెప్పే ప్రేమాయణమే !