మరు జన్మమో, జన్మ రాహిత్యమో..
ఆధునిక పోకడ లో అంతటితో అంతమో..
ఎవరికి యెరుక?
ఆది నుండి అంతందాకా 'నేను ' అన్న పదానికి
నిర్వచనం 'శరీరం', 'మనసు ' !
నిన్ను నువ్వే తెలుసుకో
నీతో నిన్నే కొలుచుకో
ఎక్కువ తక్కువలు బేరీజు వేసుకో
క్రికెట్టు మైదానంలో ఫ్లడ్డు లైటు లా
ఓ ప్రక్క నిలబడి, పై నుంచి నిన్ను నువ్వే చూసుకో
నీ హృదయపు వెలుగులో
నీ ప్రతి చేష్టని చిట్టా రాసుకో
రోడ్డు దాటించి సాయం చేసినప్పుడో
రోడ్డుకడ్డం పడినందుకు బూతులు తిట్టినప్పుడో
నీ హృదయంలో నిన్నే తూర్పారబెట్టుకో
నిన్ను గురించి నువ్వు
నవ్వుకుంటూనో .. నొచ్చుకుంటూనో
మెచ్చుకుంటూనో .. మధనపడుతూనో
నీతో కాస్త నువ్వు గడుపు
ఎంత కాలం వారి కళ్ళలోంచో
వారి ఆశ నుంచో
నిన్ను నువ్వు నిర్ణయించుకుంటావ్?
నిన్ను నువ్వు చూసుకునే కళ్ళు నీవి కానంత కాలం
నీకు తెలిసిన నువ్వు నువ్వు కాదు
అది నీకు నువ్వు చేసుకుంటున్న మోసం
నీతో నువ్వు ఉండటం ఏకాంతం
ఒంటరితనమంటే వేరే ఉంటుంది
అదీ ఇది ఒకటే అనుకుని ఏకాంతం తప్పనుకోకు
కరెంటు పోయిన చిమ్మ చీకటి లోనో
కావాలని కల్పించుకున్న ఏకాంతంలోనో
నిద్దుర పట్టక నింగికి చూస్తూనో
గదికి ఒక మూల గొంతుకు కూర్చొనో
ఊహ తెలిసినప్పటి నుంచి
వేసిన తప్పటడుగులూ
చేసిన మంచి పనులూ
సమాలోచన చెయ్
అవసరమైతే చెప్పుతో కొట్టేయ్
నీ చెంపేమీ పగిలి పోదుగా?
నీ మెదడులో ప్రతీ పదం
నీ చేతలో ప్రతీ భావం
స్వచ్చమైన తెల్లటి వెలుగులో పరికించి చూసుకో
నిన్ను నువ్వే తెలుసుకో !
'జరుగుతున్న దానిపట్ల ఎరుక కలిగి ఉంటూ దానితోపాటు జీవించటమే ఆధ్యాత్మికత.
తాడును పాము అనుకోకపోవడమే యథార్థత.
'ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి యథార్థతను గ్రహించుకోకుండా భ్రమలతో, భయాలతో, దుఃఖాలతో బతుకుతున్నాడు, వీటినుంచి బయటపడటానికి భద్రతను వెతుక్కుంటున్నాడు. ఆ భద్రత, ఆస్తులు కూడబెట్టుకోవడంలోనూ, హోదా పెంచుకోవడంలోనూ లేదు. తనను తాను తెలుసుకుని, తనలో సంపూర్ణమైన మార్పు పొందినవాడే భద్రత సాధించగలడు' .
మనిషి మానసిక స్థితినిబట్టి అతడి చర్యలుంటాయి. తన చేతనలోను, అంతః చేతనలోనూ, లోపలిపొరల్లో ఉండే తన స్థితిని తెలుసుకోగలిగితే తానెందుకు భయపడుతున్నాడో, ఎందుకు దుఃఖపడుతున్నాడో అర్థంచేసుకుంటాడు. అలా వాటినుంచి విముక్తి పొందగలడు. అదే 'స్వీయజ్ఞానం'.
మనిషి భద్రతకోసం పడే ఆరాటంలో నుంచే కూడబెట్టుకోవడం, ఆర్జించుకోవడం అనే తత్వం వస్తుంది. గాఢోద్రేకాలూ, అసూయ, దుర్బుద్ధి... ఇవన్నీ కూడా ఆర్జించుకునే మనస్తత్వంలో నుంచే పుడతాయి. వాటినుంచి విడుదల కావాలంటే, తనలో జనించే ఆలోచనలను, వాటివల్ల శరీరంలో వచ్చే ప్రతిస్పందనలను అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆ అవగాహనే మనిషికి సత్యమంటే ఏమిటో తెలుసుకునే గ్రహింపునిస్తుంది.
జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్లుగా గ్రహించాలి. అంటే దానికి ఏ విధమైన ఊహలు, అపోహలు జోడించకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగలిగితే- సత్యాన్ని తెలుసుకున్నట్టే.
ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనసు ఎటువంటి భయాలూ లేకుండా ఉండాలి. అలా మనసు అటూ ఇటూ తిరుగాడకుండా నిశ్చలత్వాన్ని పొందినప్పుడే సత్యాన్ని గ్రహించగలుగుతాం. అలా నిశ్చలమైన మనసును సాధించాలంటే మనసులో పుట్టే ప్రతి ఆలోచన పట్లా ఎరుక కలిగి ఉండాలి. వాటిని అవగాహన చేసుకోవాలి. ఆ నిశ్చలమైన మనసే అన్ని సంఘర్షణలనుంచి, దుఃఖాలనుంచి తప్పించగలుగుతుంది'.
స్మృతులు పనిచేస్తున్నంతవరకు మనిషి యథార్థతను కనిపెట్టలేడు. అందుకే వాటినుంచి విముక్తి పొందాలి అని మనసు తనకు తానే చెప్పుకొంటుంది. మనసు తాలూకు చేతన, అంతఃచేతనా అన్నింటినీ అవగాహన చేసుకుని ఎటువంటి కదలికా లేకుండా నిలిచిపోతుంది. ఈ స్థితిలో ఒక బ్రహ్మాండమైన సజీవశక్తి, శాంతి అప్రమత్తతా ఉంటుంది. ఆ శాంతమైన మనసులో చురుకుతనం, విస్తృతమైన ఎరుక ఉంటాయి. అక్కడ కేవలం అనుభూతి చెందుతూ ఉన్న స్థితి ఉంటుంది. ఆ స్థితిలోనే యథార్థాన్ని చూడగలరు. సత్యాన్ని తెలుసుకోగలరు. ఇదంతా తెలుసుకోవాలంటే మనిషికి తనను గురించి తాను తెలుసుకోవటం ఎంతో అవసరం.