Monday, May 30, 2022

హిందువు - హిందుత్వ వాది పదాల వివరణ

 ఎవరి పని వారు చూసుకుని..ఓ పక్కోళ్ళది రాసేసుకుని పూసేకోకుండా ఉండటం మంచిది అని చెప్పడం నా ఉద్దేశం.

మేమే కరెక్టనో, మేమే గొప్పనో సోది వద్దు.
అలాంటి మానసిక స్థితితోనే క్రింది వ్యాఖ్యలు చదవండి..
.
ఇక్కడ ఒక మ్లెచ్చులవారు వేదాల్లో మహమ్మదుని వెతుక్కొమని హిందువులను ఉత్సాహ పరుస్తున్నారు(మ్లెచ్చులంటే తామే నని, భవిష్య పురాణంలో చెప్పింది తమ ప్రవక్త గురించే నని విడియో వివరణలో ఉద్ఘాటించారు, సదరు మ్లెచ్చులవారు).
.
ఎవరి పని వారు చూసుకుంటే ఎవరూ ఇంకొకరితో వాదులాడక్కర్లేదు, ఇలా ఉత్సాహపరిస్తే మాత్రం కాస్త సమయం వెచ్చించాల్సి వస్తుంది.
.
1. వేదాలు క్రీస్తు పూర్వం 500 సమయంలో సంస్కృతంలో లిఖించారు, అంతకు ముందు ఎవరు రాసారో తెలియదు, ఈ విషయం తెలుసుకున్న వెద పండితులు ఇస్లాం స్వీకరించారు అని అంటున్నారు. ఇతర గ్రంధాల్లా, ఎవరు రాసారో తెలిస్తే, మానవ లిఖితం అని, తెలివిగా కొంత మంది కలిసి రాసేసారు అని అనొచ్చు. రచయిత తెలియదు కాబట్టి మతం మారి పోయారు అంటే, మారిన వాళ్ళ ఉద్దేశం వేరే ఉండొచ్చు అని నా ఉద్దేశం.
2. "నా తస్య ప్రతిమ అస్తి" - వేదాలు విగ్రహారాధ వద్దని చెప్పాయి అంటున్నారు.
దాని అర్థం నాకు విగ్రహం లేదు , నన్ను వర్ణించే , చిత్రించే సరిగ్గా చూపించేందుకు మీ ఊహ సరిపోదు అని తప్ప, నాకు విగ్రహం పెట్టొద్దు, పెడితే కొడతా అని కాదు కదా?
మరి యజుర్వేదం, సతపత బ్రహ్మణం 14 వ కాండం:
"ద్వెవావ బ్రాహ్మణో రూపే, మూర్తం చైవ అమూర్తం చ " - అంతే దేవుడూ ఆకారుడూ నిరాకారుడూ అని కూడా. అంత శక్తిమంతుడీకి ఒక రూపం దాల్చడం రాదంటారా?
3. "ఎకం సత్య విప్రా బహుదా వదంతి" - అంటే దేవుడు ఒకడే కాని, మీరూ మేము ఒక దేవుడినే పూజిస్తున్నాం పేర్లు వేరే అనే కాని, దేవుడికి వేరే పేర్లు పెట్టొద్దు, కత్తి ఎవడి చేతిలో ఉంటే వాడి దేముడే కరెక్టు అని కాదు. పుర్రెకో బుద్ధి జిహ్వ కో రుచి, యద్ భావం తద్ దృశ్యతి, ఎవరిని పూజించినా, నాస్తికుడివైనా మంచిగా బతకమని ఉద్దేశం.
4. సామవేదం 2:6:8 - "అహ్మదు తన దేవుని వద్దనుండి శాశ్వత ధర్మం నేర్చుకున్నాను" అని తర్జుమా చేసారు. సరే మరి అది నిజమే అనుకుందాం కాసేపు.
సామవేదం 2:6:1 - సుదక్షుడు చేసిన సోమరసం, బార్లీ నీళ్ళు తాగాడూ అని ఉంది ! మరి ఇది ఒప్పుకుంటారా? అందరూ తాగడం మొదలు పెడతారా? లేదంటే ఇది ఇంద్రుని గురించి ప్రస్తావన అని ఒప్పుకుంటారా?
5. భవిష్య పురాణం 3:3:3:5-8 శ్లోకంలో "మ్లెచ్చుల రాజ్యం నుండి మొహమదు అని ఒక గురువు వస్తాడు అతని అనుచరులు పెరుగుతారు అని ఉంది అంటున్నారు.
ఇది నిజమే అయ్యుండొచ్చు.
భవిష్య పురాణం 3:3:3:5-1 శ్లొకం నుండి చదివితే,
కలి పురుషుడు తన భార్యతో కలిసి తపస్సు చేసాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు (మరి దేముడు విష్ణువని ఒప్పుకుంటున్నారా?), మరి అదే పురాణం, మొహమ్మదు సివలింగానికి పూజ చేస్తాడూ అని చెప్తోంది .. ఒప్పుకుంటారా.. శివుడే పరమాత్మని? కలి ప్రభవం వల్ల ఒక దారుణ మైన, రాక్షస రాజ్యం ఏర్పాటు చేస్తా అంటాడు.. మరి మీరు అది మొహమ్మదు అని అంటున్నారా?
.
హిందువు - హిందుత్వ వాది పదాల వివరణ..మీకు తెలిసినా తెలియనట్లు నటించే, అసలు సిసలైన నిర్వచనం
హిందు : సనాతన ధర్మానుచరుడు
హిందుత్వ వాది: యూదుల వలే, యజిదీల వలే, బలోచ్, అఫ్ఘాన్ వాలే తమ సనతన ధర్మం పతన మయ్యిపోకుండా కాపాడుకోవాలేనుకునే వాడు !

https://www.facebook.com/ireaofficial/videos/1214787142367734

Saturday, May 14, 2022

కాష్మీర్ ఫైల్స్ లో కొత్త పేజీలు చేరుతూనే ఉన్నాయి

 రాహుల్ భట్.. ఇంకొక కాష్మీరీ పండిట్ ని చెంపేసారు !


ఇంకొక కాష్మీరీ పండిట్ ని చెంపేసారు,

కాష్మీర్ ఫైల్స్ లో కొత్త పేజీలు చేరుతూనే ఉన్నాయి,

.

ఈసారి వాళ్ళు చంపింది ఒక పండిట్ ని కాదు

రోజులు మారాయన్న మన నమ్మకాన్ని

మత పిచ్చి ముష్కరులు మారిపోయారన్న భ్రమని

.

నమ్మకం లేకపోతే మీ చుట్టూ చూడండి

ఎంత మంది ముస్లిములు రాహుల్ భట్ చావుని ఖండించారో

ఎంత మంది తమ ఉమ్మా అన్నదమ్ములను వారించారో

.

మనం సినిమా చూసి తప్పట్లు కొట్టి అప్పుడే మర్చిపోయాం,

హిందువులుగా మనం ఎప్పుడో చచ్చిపోయాం.


బుర్హాన్ వాణీ ఏం గొప్పోడని,

     వాడు చస్తే దేశం అట్టుడికిపోయింది?

రాహుల్ భట్ ఏం తప్పు చేసాడని,

     అతను చంపబడితే సమాజం మిన్నకుండిపోయింది?


రాహుల్ ని చంపిన వాళ్ళని చెప్పి ఒక

ముగ్గురు తీవ్రవాదుల్ని చంపి పడేసాం,


మరి శిక్షేది...

తీవ్రవాదుల్ని పంపిన వారికి ?

వారికి డబ్బు ఆయుధాలు కూర్చిన వారికి?

వారు చదివిన పుస్తకానికి?

ముఖ్యంగా,

మౌనం గా తీవ్రవాద చర్యను అంగికరించిన మీ పక్కవారికి?

.

ఎక్కడో కాష్మీరే కదా మన దాకా రాదులే అనుకోకండి,

మీరు కాకపోతే మీ పిల్లలు, లేదంటే మనవులు 

ఈ రోజు జాగ్రత్త పడకపోతే కాష్మీరు పరిస్తితే చూస్తారు

వారి పుస్తకమే చెప్తుంది జనభా పెరిగేదాకా

వేచి ఉండమని

అటు కేరళ ఇటు బెంగాల్, పైన కష్మిర్

మికు తెలిసే లోగా

కాఫీర్ గొంతులపై కత్తులు పడతాయ్

పుస్తకంలో పెద్దాయన చెప్పారుగా మరి !

Friday, May 13, 2022

హిందువులకు అత్యంత పవిత్రమైన గుళ్ళ పై ఆ ఏహ్య భావ చిహ్నాలను ఇంకా ఉంచాలా?

 ఇప్పుడు కాశీలో దేవాలయంపై కట్టిన జ్ఞాన్ వాపి మసీదు సమస్య మొదలు.

.
ముష్కరులు మన దేశంపై పడి, మన గుళ్ళను దోచుకుని,
వారి బలానికి,
ఇతర మతాలపై వారికి గల చులకన భావానికి చిహ్నంగా,
తర తరాలు గుర్తుండి పోయేలా మన గుళ్ళ పై వారి మసిదులను కట్టారు.
మరి హిందువులకు అత్యంత పవిత్రమైన గుళ్ళ పై ఆ ఏహ్య భావ చిహ్నాలను ఇంకా ఉంచాలా?
సున్నం వెయ్యని హిందూదేవాలయ స్తంబాలు ఆ అణచివేతను గుర్తు చేసి వెక్కిరిస్తుంటే సహించాలా?




సరే ఇవాళ జ్ణానవాపి మసిదు కూల్చి విస్వనాధుని గుడి స్వాధినం చేసుకుంటాం.. మరి రేపు ఇంకొక గుడి మీద కట్టిన మసీదు సమస్య వస్తే?
జనాలు ఇలా గొడవలు పడుతూ ఉంటే మత సామరస్యం, అభివృద్ధి ఎలా సాధ్యం?
.
మన దేశంలో గుళ్ళపై కట్టిన అన్ని మసీదులు కూల్చాలంటే,
తరాలు గడిచి పోతాయి,
ఎంత శాతం పురాతన మసీదులు మిగులుతాయన్నది ప్రశ్నార్ధకమే.
పై పెచ్చు జనాలు కొట్టుకు చస్తారు.
నాయకులు వోటు బేంకుల కోసం వాడుకుంటారు.
ఇది హిందువులు అలోచించాల్సిన విషయం.
.
అటు ముస్లిములు ఒక అడుగు ముందుకు వేసి,
మసీదులు వారికి పవిత్రం కాదు కాబట్టి అవి కేవలం మీటింగ్ హాల్స్ లాంటివే కాబట్టి,
చర్చలకు సిద్ధం,
సామరస్యంగా పరిష్కరించుకుందాం,
ఇందులో ఇతర ఉమ్మా (వెరే దేశ ముస్లిములు) కల్పించుకోకుండా చూసుకుంటామని హామి ఇవ్వగలగాలి.
.
ఇరు వర్గాలు కూర్చుని భారత దేశం మొత్తంలో ఒక 50 గుళ్ళు హిందువులకు ప్రాముఖ్యం అనుకున్నవి నిర్ణయించుకుని,
అక్కడ మసీదులు నిర్మూలించి గుళ్ళని పునః స్థాపిస్తే,
హిందువులు ఇతర గుళ్ళ విషయంలో రాజీ పడితే,
ఈ సమస్య వచ్చే తరానికి అంటుకోకుండా ఉంటుంది.
.
సెక్యులర్ జనాలు, కాస్త ఇరుపక్షాల మనోభావాలను గుర్తెరిగి, శాశ్వత పరిష్కార దిశగా తమ మద్దతు తెలపాలి.
.
లేదంటే ఇంకొక అధ్భుతమైన ఉపాయం ఉంది 🙂 (ఐతే ఇది జరగని పని, వారికి వారి ప్రార్థనా స్థలాలను ఎంత గొప్పగా కాపాడుకుంటారో బాగా తెలుసు ) .
అబ్రహామిక్ మతాల ప్రముఖ ప్రార్థనా స్థలాలు.. అంటే మక్కా మదినా, జెరుసలెము వంటి ఒక 50 మందిరాల లోగిలిలో అంతే వైభవం గా హిందూ గుళ్ళను నిర్మించి
మాకు మీ మతం అంటే ఎటువంటి ఏహ్య భావం లేదు అని తమ అభిమతాన్ని వ్యక్తీకరిస్తే,
హిందువులకు హజ్జ్ యాత్రలాంటి యాత్రకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తే...సమస్య తీరుతుందేమో !!!
ఏమంటారు???


अयोध्या मथुरा माया काशी काञ्ची अवन्तिका ।
पुरी द्वारावती चैव सप्तैते मोक्षदायकाः ॥
.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః
- గరుడ పురాణం
.
సనాతన ధర్మానుచరులకు మోక్ష దాయకమైన సప్త పురాలు - అయోధ్యా, మథుర, హరిద్వార్, కాంచిపురం, ఉజ్జయిని, ద్వారకా. వీటిని కట్టు దిట్టం చేసి మళ్ళీ ఎటువంటి ఆక్రమణ (భౌతికంగా, ధర్మ పరంగా, వ్యాపార పరంగా.. అన్ని విధాలుగా) జరగకుండా కాపాడుకోవడం మన బాధ్యత.
.
ఒక సారి జరిగితే పొరపాటు,
మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే అమాయకత్వం, అలసత్వం, బలహీనత్వం.



యుద్ధం ముగిసాకా యుద్ధ ఖైదీలకు విముక్తి లభిస్తుంది, మరి మా గుళ్ళకు విముక్తి తెచ్చుకోవడం తప్పా?
లేదా యుద్ధం ఇంకా కొనసాగుతోందనుకుంటున్నారా?



అరచేతిలో అమృతం ఉంటుంది అని చెప్పేవారు చిన్నప్పుడు

 అన్నం అరచేతికి తగిలెలా కలుపుకోవాలని, అరచేతిలో అమృతం ఉంటుంది అని చెప్పేవారు చిన్నప్పుడు.

కేవలం మునివేళ్ళకు తగిలేలా అన్నం కలుపుకు తింటే ఒప్పుకునేవారు కాదు ఇంట్లో.
.
బ్రిటిషు వాళ్ళు పోయినా, ఇంకా వారి పాదదాసులు కొంతమంది మాత్రం పలుగు పార పట్టుకుని తినడమే గొప్ప,
చేత్తో తినడం అనాగరికం అనుకుంటున్నారు.




అసలు ఈ నాగరికత పేరు చెప్పే దేశాలు అన్నీ మత మార్పిడి చేసేసారు ముష్కరులు.
హిందూ దేశంలో హిందుత్వ అనేది చెడ్డ మాటగా, సెక్యులర్ అంటే వెన్నెముక లేకపోవడంగా, తెల్లోళ్ళు ఎం చెస్తే అదే గొప్ప నాగరికత అని జనాలు అనుకునేలా తయారు చేసారు .
కడుక్కోడానికి మంచి నీళ్ళు లేవు కబట్టి ఎడారోళ్ళు, ఎంగిలిపీసోళ్ళ పద్దతులు అలా ఏడిసాయి.
నదీ పరివాహక ప్రాంతాల్లో పరిఢవిల్లిన మన ఆచారాలు శుభ్రంగా కడుక్కొమంటాయి, చేతులు.
చేత్తోనే తినమని చెప్తాయి.
.
సరే ఇప్పుడు మన వేదాలు చెప్పాయనో , ఆచారాలు ఘోషిస్తున్నాయనో చెప్తే మూఢ నమ్మకం కాబట్టి, గూగుల్ తల్లిని అడగండి.
విదేశీ వర్సిటీలు రీసెర్చులు చేసేసాయి, పేటెంటు తీసుకోవడమే తరువాయి.
.
వారు పేటెంటు తీసుకుని, ఎవో చేతికి రాసుకునే లెపనాలు కని పెట్టి , ఆ చెత్తో తినమని చెప్పేదాకా ,
అరిటాకులు వాడండి, అరచేతికి తగిలేలా కలుపుకు తినండి !
ఆరోగ్యానికి మంచిది !

ఇనప సామానుతో తినే తెల్లోళ్ళు ఆరోగ్యంగా లేరా అంటే.. ఉన్నారు, కావాలంటే కరోనాని అడగండి.


Wednesday, May 4, 2022

రోళ్లు బద్దలయినా , రాళ్ళు కరిగిపోయినా అవకాయ పెట్టనిదే ఎండాకాలం అవ్వదు

ఇయ్యాల రంజాన్ శెలవు, అక్షయ తృతియ, పరశురామ జయంతీ కలిపొచ్చాయండీ. 

ఐతే మాకు ఓ ఎగస్త్రా పండగ కూడొచ్చేసిందండీ బాబు, ఆవకాయ పండగ.

.

ఆవకాయంటే ఆషామాషీ కాదండే. 

ఆవకాయంటే సంవత్సరం మొత్తానికి ఇన్స్యూరెన్సు.

మొన్న వాట్సప్పు లో సూసానండీ,ఈ రాకెట్టుల్లో పైకెళ్ళే ఓళ్ళూ బూమ్మిదున్నప్పుడే పళ్ళు, కూరలు, కక్క ముక్క అన్నీ ఎండబెట్టేసేసి డబ్బాల్లో ఉప్పేసి ఊరగాయల్లా ఆడకట్టుపోతారంటండీ. 

అక్కడ పంటలుండవు కదండీ, ఈ డబ్బాల్లో తిండేండీ మరి ఆళ్ళకి. 

.

మరి మన తాతల్నాడే ఇయ్యన్నీ కనిపెట్టేసారు కదండే ?

కరువులొచ్చినా, గోదారికి వరదలొచ్చినా, 

యుద్ధాలొచ్చినా, ఇంటికి ఏళ కాని ఏళ సుట్టాలొచ్చినా, 

రోజుల తరబడి ప్రయాణాలొచ్చినా 

కరోనా కొత్త రకాలతో లాక్డవున్ వచ్చినా

ఊరగాయ జాడిలుంటే కొండంత దైర్నం కదండే?

.

ఉప్పేత్తావాండి, కారవండే, ఆవాలు , పప్పు నూనె , మాడి కాయలు .. ఇంతకన్నా కష్ట కాలం పొయ్యేదాక బలం ఇచ్చే తిండేవుంది సెప్పండి?

ఏడేడి అన్నవ్లా ఆవకాయి లాగించేసి, తరవాత ఓ నాలుగు ముద్దలు పెరుగన్నం తినేహేత్తే తిరుగుంటదాండీ?

ఏదో ఉప్పు కాయే కదా అంటారేమో, ఆవకాయ కుదరాలంటే సెయ్యి తిరిగుండాలండే.

.

ఇయ్యాల పొద్దునే ఆరింటికల్లా మార్కెట్ కెల్లి, పుల్లని పీసున్న సిన్న రసాలు ఎతుక్కుని బేరవాడెవండీ. 

ఆడూ కాయోటీ 30/- అన్నాడండి.

నేను అంతయితే కష్టం ఇంకో కొట్టు సూసి ఒత్తా అన్నానండి.

ఆడు మా ఇంటీకి వచ్చాక ఇంకో ఇంటీకి బోజన వెట్టకుండా ఎలా పంపేత్తావండీ, మీరెంతంటారూ అన్నాడండి. 

సరే ముక్క కొట్టిచ్చేలా బేరవాడి టోకున డబ్బులిచానండె.

మాంచి ఎటకారాలాడుతున్నావ్ ఏవూరేటీ నీది? అన్నానండి

తీరా సూత్తే ఆడు మన భిమారం ఓడు.

సరిపోయింది.. మాది సింతలూరే అన్నానండి.

ఆడు అవిసయిపోయి సింతలూర్లో ఎక్కడా అన్నాడండి. 

మన పెద్ద రావి సెట్టు పక్కనిల్లు, నీకు తెలుసేటి అన్నానండీ. 

ఆడు అయ్ బాబో తెలీపోటవేటండి పెతి  సంస్రం తీర్తానికి కజురం బండి ఎడతావండి , రావి సెట్టు దెగ్గర పైపు లోనే నీళ్ళు తీసుకెల్తావండీ అన్నాడు. 

పొద్దెక్కి పోతందని పనిలో పడ్డావండి.

.

మా అత్తోరికి కూసింత సుబ్రం ఎక్కువండి బాబూ, డబ్బులుపోతే పోయాయని నాలుగు కిన్లే బాటిళ్ళు, ఓ మంచి బకిట్టూ అట్టుకేళ్ళానండీ. 

సరే ఆడితో కబుర్లు సెప్తూ వంద కాయలూ సుబ్బరంగా కడీగేసి మంచి పంచీ ముక్కతో తుడిసేసానండి.

ఆడేమో ఆవకాయ కత్తి పీటేసి, కాయికి 12 ముక్కలు కొట్టేహేడండీ. 

చాలా మంచి పనోడండి ఆడు, వందలో ఒక్క ముక్కా నలగిపోలేదండి.  

పైనో యాబై ఇచ్చా టీ తాగమన్నానండి. ఉండిపోయిన కిన్లే బాటిళ్ళు ఆడి కిచ్చి, ఎండన పడున్నావ్అ, ని తాగెయ్ మన్నానండి. 

.

ఆడించిన రాళ్ళుప్పూ, ఆవ పిండీ, ఏ ఎస్ బ్రాండు పప్పు నూనె, తెనాలి పాలింగువ కొనుక్కుని ఇంటి కొచ్చేహేవండీ. 

కరోనా కదండీ, ఇంటి కొచ్చి స్నానం చేసి టిఫిన్ తిని, పని మొదలేట్టావండి.

.

ముక్కలన్నీ ఆరబోసి, చీర ముక్కతో శుభ్రం గా తుడిసేసి, తౌడు గిన్నితో కొలిసేసామండి.

ఒక తౌడు గుండకి, తౌడున్నర ముక్కల సొప్పున ముందు గుండ కలిపేసుకున్నావండి.

గుండ లెక్కేమో ఒక కారానికి ఒక ఆవ పిండీ, అర ఉప్పూ కలపామండి. కూసింత మెంతులు , రెండు సిటికెడులు ఇంగువండీ.

పెద్ద ఆవాకాయ టబ్బులో గుండ కొలిసి పోసేసి, నూనెలో ముక్కలు తడిపి గుండలో కలిపేసేనండీ. పైన ఒక లీటరు నూనె పోసేత్తే ఎర్రగా నిగనిగ లాడిపోతూ మంచి ఆవకాయ ఓసనండి.

.

అదే కారం సేత్తో ఓ సారి దేవుల్లందరికీ సూపించేసి, 

ఆవకాయ ముక్కలు కలిపిన గిన్నిలో ఓ నాలుగు చెంచాలు పప్పు నూనె పోసి 

నా కారం సేతులతో ఏడేడి అన్నం కలిపి మళ్ళీ దేవుడికి సూపించేసి, 

అందరం తలో ముద్దా తిన్నావండి. 

అమృతం వంటే కారం గా కూడా ఉండొచ్చు కదా అని డౌటనుమానం ఒచ్చేహిందండీ బాబు. 

మూత  శుబ్రంగా చీరేసి పురుకోసతో కట్టేహేనండి.

మూడు నిద్రలయ్యాకా తీసి మళ్ళీ కలిపి ఉప్పు సూసుకుంటే సరిపోద్దండి. ఆడించిన ఉప్పూ అటూ ఇటు అవ్వుద్దికదండీ.

.

ఈడేంటీ ఆవకాయకి ఇంత కధ సెప్పేడు అనుకుంటారేమో, 

సూత్తూ ఉండండీ ఆడు ఎలన్ మస్కోడు 

అమెరికా ఆవకాయనో, 

మస్కు మాగాయనో కంపెనీ ఎట్టేసేసి, 

ఆకాశం లో తిరిగేటోళ్ళకి జాడీలూ పంపేసేత్తాడు.

మీరో కంపెనీ ఎట్టి ఆడు కొనే దాకా ఎయిటు సెయ్యండీ.



తర్వాత ఇంక కాలు మీద కాలేసుకునీ కూసోడమే.




రోళ్లు బద్దలయినా , రాళ్ళు కరిగిపోయినా అవకాయ పెట్టనిదే ఎండాకాలం అవ్వదు

Sunday, May 1, 2022

సాఫ్ట్ వేర్ కార్మీక సోదర సోదరీ మణులందరికీ కూడా శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు

పలుగు పార సుత్తి కత్తి పట్టి శారిరక శ్రమ చేసే కార్మీక సోదరులతో పాటు ... కాఫీలూ టీలూ తాగుతూ కంటి మీద కునుకైనా పడకుండా అపార్టుమెంటు వాచ్ మెన్ కన్నా పెద్ద సెక్యూరిటీ గార్డు మల్లే రాత్రికీ పగలుకూ తేడా లేకుండా పనిచేస్తూ . పిల్లలు డే కేర్లోనూ పెద్దలు సొంతూరులోను మొగుడూ పెళ్ళాలు లాప్టాపుల్లోనూ తామకంటూ ఏమీ లేనట్టు ఎప్పుడూ కస్టమర్ సెంట్రిక్ ఆలోచనలతో . ఆన్ సైట్లో ఉంటే అందరికీ దూరంగా ఆఫ్ షోర్లో ఉంటే నిద్రకు దూరంగా ఎప్పుడు ఎక్కడ ఉన్నా శుభకార్యాలకు దూరంగా వాట్సాప్ లో అభినందనల తో గూగుల్ పే లో బహుమతుల తో జీవితాన్ని గడీపే సుదూర జీవి . పే స్లిప్పుల లెక్కలు అర్థం కాని పసివారు హక్కులు బొక్కలు తెలియని బాల కార్మీకులు కొద్దిపాటి హైకుకే కొండంత మురిసిపోయే భోళా శంకరులు . మానవాళిని రోజు రోజుకీ మరింత వేగంగా మరింత సౌఖ్యంగా మరింత ఆనందంగా చూడాలనే తపనతో . ఎండ బదులు విటమిన్ డీ లు తిండి బదులు ఇన్స్టంట్ నూడిల్లు పని వారమంతా చెయ్యాల్సిన పనులు వారాంతమేమో చెయ్యలేకపోయిన పనులు చేస్తూ ఆరోగ్యాలను సైతం పణం పెట్టి . కీ బోర్డూ మౌసూ ధారులై సదా కంప్యూటర్ స్క్రీను పై దృష్టి నిలిపే నవయుగ మునిపుంగవులు నూత్న యుగ సారధులూ .

















మా సాఫ్ట్ వేర్ కార్మీక సోదర సోదరీ మణులందరికీ కూడా
శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు !