నేనొక నటుడ్ని
నా జీవిత కధనానికి కధానాయకుణ్ణి,
ఎవరి నటన ఎంతో ఎరుగక
నాకు నేనే తప్పట్లు కొట్టుకునే రంగ మార్తాండని !
అభిప్రాయాల బట్టలేసుకొని
అహపు కిరీటం పెట్టుకొని
మాటల కత్తి పట్టుకుని పొగడ్తల పూల వర్షంలో
కాల గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను
సంఘటనల సంభావ్యతలలో బంధీయైనా
వాటిని శాసిస్తున్నానుకునే నియంతని నేను !
నేనొక నటుడ్ని
నాది కాని జీవితాలను గొప్పనుకుని,
వాటిని జీవించే నటుడ్ని
నేను కాని పాత్రలలో నా కోసం వెతికే విటుడ్ని
వేషం కడితే మంచి మనసున్న దేవుడ్ని
వేషం తీస్తే అందరిలాగే సదరు జీవుడ్ని !
నేనొక నటుడ్ని
నచ్చిన వారి కోసం నవ్వేస్తాను
నచ్చని వారినేమో ఏడిపిస్తాను
అర్థంలేని ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను
హరివిల్లుకు ఇంకో రెండు రంగులు వేసి
నవరసాలు అవసరాలకు వాడేస్తాను
నేను మాత్రం తప్పు ఒప్పుల గందరగోళంలో బ్రతుకుతుంటాను !
నేనొక నటుడ్ని
జగానికి జన్మిస్తాను
తెలుసుకుంటూనే జీవిస్తాను
తెలియకుండానే మరణిస్తాను
పోయినా బ్రతికుండాలనుకుంటాను !
నేనొక నటుడ్ని
మీడియాల చేపట్టి,
లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్ని
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని
నాకున్నదంతా నాదే అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు ఉనికే ఎరుగని సగటు మనిషిని !
నేనొక నటుడ్ని
గతానికి వారధి నేను
వర్తమాన సారధి నేను
రాబోయే కాలంలో చెరిగిపోయే చరిత్ర నేను
మాట మాటకీ రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను !
నేనొక నటుడ్ని
వినిపించని కంఠాన్ని నేను, కనిపించని సింహాన్ని నేను
పరిస్తితులకు తగినట్టు నాట్యం ఆడే నటరాజ రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో పౌడర్ కొట్టిన ముఖాన్ని నేను
అదృష్టం కలిసొస్తే ప్రచండం గా
ప్రకాశించు రంగమార్తాండున్ని నేను !
నేనొక నటుడ్ని
అసలు ముఖం అర్థంకాని అమాయకుడ్ని
అవసరంలేని తొమ్మిది తలలు భరించే నటరావణుడ్ని
అలవోకగా ముఖాలు మార్చే మహా నటుణ్ణి
నేనొక నటుడ్ని
కలల అప్సరసల ఇంద్రుడ్ని
ఇంకేది అందని వారికి అందుబాటు చంద్రుడ్ని
ప్రశంసలకు దాసుడ్ని, పైసాకి ఆప్తుడ్ని
గతాన్ని భోంచేస్తూ
భవిష్యత్తులో శ్వాసిస్తూ
వర్తమాణ్మలో అణుక్షణం జీవించే
అల్ప సంతోషిని నేను !
మహా అదృష్టవంతుడిని నేను
ఎక్కలేని చలమేదో ఎక్కాలని కలవరించే
సగటు కళాకారుడ్ని నేను
ఆఖరి శ్వాస వరకు నటనే ఆసరా నాకు
నటుడిగా నన్ను గుర్తించనందుకు
శతకోటి నమస్సులు మీకు !