అంశం: ఏమని చెప్పను?
శీర్షిక: చతుర్ముఖ బ్రహ్మ
*
ఏమని చెప్పను? ఎంతని వివరించను?
మూడు యూగాలుగా నే ముచ్చట పడి కట్టుకున్న
ఈ భువనాన్ని, మూణ్ణాళ్ళ ముచ్చట చెయ్యొద్దని?
*
యుగానికొక దేవుడిని దింపి
దారితప్పిన రాక్షసులను పైకి పంపి
యుక్తి కోసం వేదాలు కూర్చి
శక్తి కోసం మేధస్సు నిచ్చి
తల్లి తండ్రి తానై లాలించే
ప్రకృతి ఒడిలో ఉయ్యాలలూపితే..
-
దేవుడిని గుడిలో వదిలేసి
రాక్షసుల బాటలో అడుగేసి
వేదాలను త్యజించి
మేధస్సును దురాశకై వెచ్చించి
తల్లి తండ్రీ తానై పోషించిన ప్రకృతికి,
పేరాశతో పోట్లు పొడిచి,
సహోదరుల్లా బతకాల్సిన,
నా సృష్టిలో భాగాలు, నా పిల్లలు
ప్రాణి కోటికి హాని చేస్తూ,
తమలో తాము తన్నుకుంటుంటే
ఏమని చెప్పను? ఎంతని వివరించను?
-
ఏడు కలికాలాలు చూసినా ఏముంది మార్పు?
బ్రహ్మలు మారడమే కాని మనుషులు మారునా?
కలికాలం సత్యయుగమై విలసిల్లునా?
ఏమని చెప్పను? ఎంతని వివరించను?
అష్టమ బ్రహ్మ నీ కదా, అన్నీ కష్టాలే అనుకుంటా
తొమ్మిదో బ్రహ్మ హనుమంతులవారికైనా
కలికాలంలో కాస్త ఊరట కలగాలని కోరుకుంటా !