Thursday, June 11, 2015

నువ్వు చూసావో లేదో ..



నువ్వు చూసావో లేదో
నాకు కవితే స్పురించట్లా,
నీతో మాట్లాడకపోతే

నువ్వు చూసావో లేదో
నాకు ఎమీ తోచట్లా,
నువ్వు మౌనంగా ఉంటే

నువ్వు చూసావో లేదో
నా నిశీధి వీధిలో వెన్నెల రేడు ఉదయించట్లా
నీ ఊసులు లేకపోతే
ఏ తారల తళుకులూ కనిపించట్లా

నువ్వు చూసావో లేదో
గమనించావో లేదో
నువ్వే లేకపోతే
నాలో నా పోలికలే కనిపించట్లా !!

Tuesday, June 9, 2015

ఎన్ని కష్టాలో మనిషికి





ఎన్ని కష్టాలో మనిషికి

జుట్టు నల్లగా ఉండాలని
ఒళ్ళు తెల్లగా ఉండాలని

కళ్ళు నీలంగా ఉండాలని
పళ్ళు ముత్యాల్లా ఉండాలని

మూతి పింకుగుండాలలని
ముక్కు కోటెరులా ఉండాలని
కనీసం .. ఒళ్ళుసన్నంగుండాలలని

ఎన్ని కష్టాలో మనిషికి

తింటే ఆయఅసం
తినకపోతే నీరసం

అరగంట ఆగకుండా పరిగెడితే
100 కేలొరీలు కరుగుతాయంట,
కంచం ముందు 5 నిముషఅలు
కక్కుర్తి పడితే 1000 కేలొరీలు వస్తాయంట,

ఎన్ని కష్టాలో మనిషికి... ఎన్ని కష్టాలో మనిషికి !

మనసు తెల్లనేనా అని పట్టించుకోడు
బుద్ధి వంకరకాదని సరిచూసుకోడు
అద్దంలో అందం తప్ప, ఆత్మలో ఆనందం వెతకడు
ఎంత మానవత్వముంటే అంత మనిషి అవుతాడని తెలుసుకోడు

ఎన్ని కష్టాలో మనిషికి... ఎంత అమాయకుడో మనిషి !

Friday, June 5, 2015

నిశీది వీధిలో నేనొక్కడినే


నిశీది వీధిలో నేనొక్కడినే
ఏ తారల తళుకూ లేక
ఏ వెన్నెల వెలుగూ లేక
ఎలా దాటాలో ఈ దూరం
చిమ్మ చీకట్ల కాసారం

కళ్ళు మిటకరించినా కనిపించకపోతే
చీకటిని చూడటం చేతనయ్యింది

చెవులు రిక్కించినా వినబడకపోతే
నిశ్శబ్దం నాకు వేదమయ్యింది

చేయి పట్టుకు నడిచే తోడు లేకుంటే
నైరాశ్యమే నాకు వేడుకయ్యింది

నీ ధ్యాసే కుదరకపోతే
శూన్యమే నా ధ్యానమయ్యింది

ఐనా ఆశ నడిపిస్తుంది
అమావాస్య ఒక్క రోజే నంటుంది !

Tuesday, June 2, 2015

ఒక్క అడుగు వెనక్కి



ఒక్క అడుగు వెనక్కి

కారు చీకట్లోనో, కళ్ళు మూసుకుపోయో
ఎప్పుడైనా ఒక అడుగు పక్కకుపడితే
లేదా మొదలు అందనంత దూరం పోతే
గుర్తించలేనంత/సరిదిద్దలేనంత అవలికి పోతే
ఒక్క అద్భుత దీపం కావాలనిపిస్తుంది
కాలాన్ని వెనక్కి తిప్పాలని కోరిక
ఒక్క జీవితం మొదలుకి
ఒక్క బాల్యం మొదటికి
ఒక్క నిర్ణయం వెనకకి
కనీసం
ఒక్క కన్నీటి బొట్టు ముందు
విరిసిన నవ్వు కి
ఒక్క పరుషమైన మాట  ముందు
ప్రేమ పలుకులకి
ఒక్క శొక తప్త గ్నాపకానికి
ముందు మల్లెల మనసుకు

ఒక్క పయనం సరిదిద్దుకోగలిగితే
ఒక్క అడుగు వెనకకు తీసుకోగలిగితే !!