మైసూర్ కి నిన్న రాత్రి కేసినేని బస్సులో బయలుదేరా, 7 కి చిన్న బస్ ఎక్కించి 9.30 దాక మియాపూర్ హైటెక్ సిటీ మద్యలో తిప్పి తిప్పి పిప్పి చేసాడు. ఆప్పుడు పెద్ద బస్ ఎక్కించి 'బలుపు ' సినిమా వేసి బాదేసాడు. ఇంత విషాదంలో భొజనం కూడా చెయ్యకుండా 10:30 కి పడుక్కుంటే 11:15 కి లేపేసాడు.. భోజనాలంట ! సరేలే అని బూతులు తిట్టుకుంటూ ధాబాలో ఓ రెండు సాగుతున్న చెపాతీల తో మొన్న పున్నమికి చేసిన పాలక్ పన్నీరు కూర తిని, ఒక చిన్న కాఫీ తాగి (ఇది బాగానే ఉంది) మళ్ళీ బస్ ఎక్కి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నా.
నాలుగింటికి ఎందుకో మెళకువ వచ్చింది, డ్రైవర్ చాలా బాగా బస్సు తోలుతున్నాడు అసలు కుదుపే తెలియట్లా అని కిటికీ అద్దానికి అడ్డు ఉన్న గుడ్డ పక్కకి తీసా.... బస్సు ఆగి ఉంది, బెంగులూరు టైంకి తీసుకువచేసాడా !
ఏంటి రా పరిస్తితి అని ఆరాతీస్తే తెలిసింది, డ్రైవర్ ఆర్ టీ ఓ చెక్ పోస్ట్ ని తప్పించడానికి వేరే రూట్లో వెళ్ళి దారి తప్పిపోయాడంట, కోడి కొండ కుగ్రామంలో అడ్డంగా ఇరుక్కుపోయాం. గూగుల్ మాప్స్ మైసూర్ కి .58 నిమిషల దూరం చూపిస్తొంది. సరెలే కనిసం ఒక కునుకు వేడ్డం అని మళ్ళీ వాడిచ్చిన కుళ్ళు దుప్పటి ముసుగుపెట్టా, ఇక మైసూర్ వెళ్ళేదాకా నిద్దురపోవాలి అన్న ధ్రుడ నిశ్చయంతో.
ఒక అరగంట నిద్రోడానికి ప్రయత్నిస్తుండగా... బస్సు పడవలా ఊగడం మొదలు పెట్టింది, ఈ సారి ఏ కాలవలో పెట్టాడో అని చూద్దునా... పక్క సైకిల్ కూడా పట్టనంత సన్నని పుంతగట్టుపై వెళ్తున్నాం.. ఒక 5 నిమిషాల ప్రయాణం తరువాత మళ్ళీ బస్సు ఆగింది, ఈ సారి ఒక డెడ్ ఎండ్ (Dead End) కి చేరుకున్నాం !!!
జనాలు నిద్రలేచి గోల మొదలు పెట్టారు. బస్సు బాక్ గేర్ లో నెమ్మదిగా వెనక్కి కదులుతోంది, అప్పుడే నెమ్మదిగా జనాలు చెంబులతో పుంత గట్టు దెగ్గర మా బస్సు వైపు నడుస్తున్నారు, బస్సు వారి మధ్యనుంచి నెమ్మదిగా ఏమి పట్టనట్టు నడుస్తోంది.
కొంత మంది చుట్ట కాల్చుకుంటూ బస్సు వైపు వింతగా చూస్తున్నారు, కొంతమంది మొహం లో చిరాకు ప్రస్పుటంగా కనిపిస్తోంది, కానీ చలా మంది మొహాల్లో మాత్రం విసుగు, కోపం, కంగారు..ముఖ్యంగా అసహనం కనిపిస్తున్నాయి.
"అయ్యా... డ్రైవర్ గారు మీరు త్వరగా బండి తిప్పండి, జనలు వాళ్ళ చెంబులో నీళ్ళతో శపించేలా ఉన్నారు... నేనే అన్నా వెటకారంగా."
"అలా చేస్తే, తరువాత వాళ్ళే బాధపడతారులేండి " కండఖ్టర్ కౌంటర్.
మొత్తానికి ఎలాగో ఆ ఊరిలోంచి బయటపడి, మయిన్ రోడ్డు ఎక్కాము. బస్సులో ఒక్కడికి కూడ మైసూర్ వచ్చేదాకా వస్తాం అని నమ్మకం లేదు. ఎలగో ముక్కుతూ మూల్గుతూ 11:00 కి మైసూర్ లో దింపాడు .. 'పాడు ' డ్రైవర్ !