Sunday, December 14, 2014

ఓ ఆత్మా రా ! (ఓ యధార్ధ ఆత్మకధ)(OUIJA BOARD) (My close encounters with THE DEVIL - Story 2)




ఓ దస్తా పేపర్లూ, బస్తా పెన్నులూ ఇవ్వండి
ఆత్మ కధ రాసుకోవాలి అంటాడు బ్రహ్మానందం జులాయి సినిమాలో

నా దగ్గర పెన్ను పేపరు రోజూ ఉన్నాయి కానీ, 
ఖాళీ మాత్రం ఇవాళే దొరికింది !
అందుకే నేనూ సరదా పడ్డా ... 
ఆత్మ కధ రాసుకోవాలని !

ఇది నా ఆత్మ కధలో చిన్న ప్రేతాత్మ కధ !
-------------------------------------------------------------

జనవరి 4 వ తేది 

సమయం అర్థ రాత్రి 11:55
ఇంకా ఐదు నిముషాలుంది...
గడియారంలో నిముషం ముళ్ళు భయం భయంగా ముందుకు కదులుతోంది...12 వైపు !

బయట అంతా చిమ్మ చీకటి, ఆ గది లోపల నుండి గొళ్ళెం పెట్టబడి ఉంది. లోపల చిన్న కొవ్వొత్తు వెలుతురు మాత్రమే ఉంది. దాని చుట్టూ 5 గురు వృ
త్తాకారంలో నిల్చుని ఉన్నారు. ఆ చిన్న వెలుతురులో సైతం వారి ముఖాల్లో భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వారి మధ్యలో నేనూ నా మిత్రుడు కిరణ్ ఓజా బోర్డ్ ముందు కూర్చుని ఉన్నాము. 

ఓజా బోర్డు !!!
ఇది చనిపోయినవారి ఆత్మలను పిలిచి వాటితో సంభాషించేందుకు ఉపయోగపడుతుంది.


బోర్డు పై ABC..Z, 123..9, 'Yes 'మరియు 'No' అనే అక్షరాలు, పక్కన వెలుగుతున్న కొవ్వొత్తు వెలుగులో ఎరుపు ఛాయలో మెరుస్తున్నాయి. అక్షరాలకు వాడిన ఖతి, బోర్డ్  పైన ముద్రించిన దెయ్యపు ముఖం, చుట్టుఉ వాడిన పురాతన కాలపు అసురీ విద్యలకు సంబంధించిన చిహ్నాలవల్ల ఓజా బోర్డు చూస్తేనే వెన్నులో ఒక చిన్న వణుకు పుట్టించేలా ఉంది. బోర్డుపై ఒక చిన్న రాగి నాణెం ప్రేతాత్మ చెప్పే అక్షరం పైకి కదిలేందుకు సిద్ధంగా ఉంది. 

మేము ఆ గది నుంచి దేవుడి చిత్ర పటాలు, మా వంటి మీద కాశీ తాళ్ళు, మెడలొ బంగారు గొలుసులూ, ఉంగరాలు, మొహాన బొట్లు అన్ని దైవీక సంబంధమైన చిహ్నాలు తీసేసాం ,  అవి ఉంటే ప్రేతాత్మలు దరికి రావు.


అసలు నాకు ఈ ప్రేతాత్మల పై 
అంత ఆసక్తి ఎమిటి ?

మన హేతుకతకు అందని ఆ తెలియని తనం.. భయం,

తెలియనిది తెలుసనుకునే తెలిసితెలియని తనం.. మూర్ఖత్వం,
అదే భయానికి హేతుకత తోడైతే... ఆశక్తి !

ఈ మూడు గల ఒక 9వ తరగతి పిల్లాడూ ప్రేతాత్మలను పిలిచి సంభాషించేందుకు సిద్ధమయితే? 
ఇప్పుడా గదిలో అదే జరుగుతోంది.
ప్రేతాత్మను ఆవాహనచేసాకా అది తిరిగి వెళ్ళకపోతే? అది అతనినే ఆవహిస్తే? ఆ ప్రేతాత్మల బారినుండి తననుతాను కాపాడుకోగలడా?

రాం గోపాల్ వర్మకి దెయ్యం అంటే ఎందుకు ఇష్టమో నాకు తెలియదు కాని నాకు దెయ్యాలంటే ఆశక్తి కలగడాని నా చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు నాకు వాటి పట్ల మొదట భయం తరువాత ఆశక్తి కలగటానికి కారణమయ్యాయి.

నేను ఆరోవ తరగతి చదువుతుండంగా నా మిత్రుడు ఒకడు కాలం చేసాడు. నేనెప్పుడు ఒంటరిగా ఉన్నా వాడు కనిపించినట్టు అని పించేది, చాలా భయం వేసేది. నేనేమో హాస్టల్ ఎవరికి చెప్పుకోలేక పోయేవాడిని, ఇంట్లో చెప్తేనేమో నమ్మేవారు కాదు, తిరిగి హాస్టల్ కి వెళ్ళడానికి ఇష్టం లేక అబద్ధం చెప్తున్నా అనుకునే వారు ! దానితో భయం అలవాటు అయ్యిపోయింది. ఎంతలా అంటే "అసలు మనం ఎందుకు భయపడుతున్నాం?" అని ఆలోచించేంతలా !!


ఆసక్తే ఆ శక్తి.


ఓజా బోర్డు ముందు కూర్చున్నానేకాని మనసులో చాలా భయంగా ఉంది, ఎంత వద్దనుకున్నా ఊపిరికింద హనుమాన్ చాలిసా స్మరణ జరిగిపోతోంది.గత రెండు రోజులుగా జరిగిన సంఘటనలు అలాంటివి మరి

ఒక్క నిముషం అన్నీ కళ్ళ ముందు కదల సాగాయి ... ... ...

మా హాస్టల్ ఊరవతల పంట పొలాల మధ్యలో ఉంది. మేము వంతుల వారిగా ప్రతీ శని వారం మరియు ఆదివారం రాత్రి ఒక ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు గొడ దూకి హాస్టల్ బయటకు వెళ్ళే వాళ్ళం. అప్సరా సినిమా హాల్లో సినిమా చూసి ధాబాలో పరోటా తిని తిరిగి 1:00 గం కు హాస్టల్ కి వచ్చేసే వాళ్ళం. పొలాల్లో పాములూ, నక్కల ఊళలు కొరివి దెయ్యాల కధలూ లెక్క చేసేవాళ్ళం కాదు.

కాని ఒక రోజు రాత్రి మూడో అంతస్తు కిటికీలోంచి పొలాల మీదుగా చంద్రుడి వెన్నెల ఆశ్వాదిస్తున్న ఒక అమ్మాయికి రెండు తెల్లని దెయ్యపు ఆకారాలు గోడ మీద కూర్చుని కనిపించాయి. దాంతో ఆ అమ్మాయి కెవ్వుమని కేకపెట్టి అక్కడే కళ్ళుతిరిగి పడిపోయింది. ఆమెకు తెలివి వచ్చాక విషయం తెలుసుకుని కిటికీ దెగ్గరకు వెళ్ళి చూస్తే అలంటివి ఏమీ కనిపించలేదు.

ఆ అమ్మాయి భ్రమ పడింది అని అంతా కొట్టిపడేసారు.

నిన్న రాత్రి మళ్ళీ అదే సమయానికి కిటికీ దగ్గర నుంచున్న అమ్మాయిలకు, ఎర్రని నిప్పు కణికలు ఎగురుతూ కనిపించాయి.. కొరివి దెయ్యాలు !! ఈ సారి అరుపులు కేకలు అందరమ్మాయిల వంతయ్యింది. వాళ్ళ ఏడ్పులు పెడ బొబ్బలతో విషయం స్కూల్లో అందరికీ పాకిపోయింది.

ఎవరు చూసినా దెయ్యాల విషయం మాట్లాడుకుంటున్నారు, ఎవరికి తోచినట్టు వారు, ఎవరికి తెలిసినట్టు వారు, ఎవరి అనుభవం వారు... ఎవరి కధలు, కల్పనలు వాళ్ళు.

మేము మాత్రం ఇవాళే ఈ ఓజా బోర్డుతో ప్రేతాత్మను పిలవాలని నిశ్చయించుకున్నాం, ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసాం మరి. ఇవాల్టి దాకా ధైర్యంగా మాతో పాటు ఉండటానికి అంగీకరించిన కొంత మంది అబ్బాయిలు కూడా భయపడిపోయారు.

భయానికి ఆడ మగా తేడాలేదు, అందరూ సమానమే. అమ్మాయిలు ఉన్నదానికంటే ఎక్కువ భయం నటిస్తారు.. అబ్బాయి సాయం కోరడానికి, అబ్బాయిలు ఉన్న ధైర్యం కన్నా ఎక్కువ ధైర్యం నటిస్తారు.. అమ్మాయికి అభయం ఇచ్చేలా కనిపించాలని. 



ఇలా ఆలోచించుకుంటుండగానే 11:59 అయ్యిందని తెలుపుతూ మేము పెట్టుకున్న అలారం మోగింది.
అంత నిశ్శభ్దంలో అది చెసిన చప్పుడుకి ఒక్క సారిగా అందరూ ఉలిక్కి పడి మళ్ళీ తేరుకున్నాం !
ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే నా మిత్రుడి ఆత్మను ఆహ్వానించడానికి సిద్ధమయ్యాం !

బోర్డుపై ఉన్న రాగినాణెం పై నేను వేలు పెట్టి కళ్ళు మూసుకున్నా, మంద్ర స్తాయిలో వణుకుతున్న కంఠంతో 

మరణించిన మిత్రమా 'సురేష్ రా', 

'సురేష్ రా',

మిత్రమా 'సురేష్' రా,

'సురేష్ రా' అని అంటున్నా.

నా గొంతు నన్నే భయపెడుతోంది.

ఒక నిముషం గడిచిపోయింది... 12:00 అయ్యింది సరిగ్గా.
చిన్నగా ఒక శబ్దం వినిపించింది. గది తలుపు దెగ్గర ఏదో కదులుతున్నట్టు, తలుపు తియ్యడానికి ప్రయత్నిస్తున్నట్టు.





సినిమాలు మరియూ విన్న కధల ప్రకారం ఆత్మలు వస్తువులని తాకలేవు ! పొలాల్లో దెయ్యాలు వచ్చేసాయా? తలుపు శబ్దం చెయ్యగలిగినవి నా పీక కుడా పట్టుకోగలవుగా? హమ్మో.
గుండె ఝల్లుమంది, వెన్నులో వణుకు మెదడుదాకా పాకింది.
అందరం తలుపువైపు చూస్తూ ఉండిపోయాం, ఎమి చెయ్యాలో తెలీక. నా వేలు ఇంకా రాగి నాణెం పైనే ఉంది.

తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది, వరండాలోంచి ఒక అయిదు నల్లని ఆకారాలు లోపలికి వచ్చాయి.
గదిలో లైట్లు అన్ని వెలిగాయ్, చీకటికి అలవాటు పడిన కళ్ళు ఆ వెలుగును తట్టుకోడానికి కాస్త సమయం పట్టింది.
కళ్ళు తెరిచి చుద్దునా ఎదురుగా మా స్కూల్ డైరెక్టర్, వార్డెన్ ఇంకా కొంత మంది టీచర్లు. అందరి మొహాల్లో తీవ్రమైన కోపం కనిపిస్తోంది, లేడీ టీచర్ల మొహంలో ఆశ్చర్యం, భయం కోవకు చెందిన అభినయాలు కనిపిస్తున్నాయి.
నా వేలు ఇంకా బోర్డు పైనే ఉన్న విషయం గుర్తుకు వచ్చి చెయ్యి వెనక్కి తీసుకున్నా. 
మా డైరక్టర్! మిలటరి రిటైరెడ్ ఆఫీసర్,  క్రమ శిక్షణకు , తప్పినప్పుడు వేసే శిక్షలకు పెట్టింది పేరు. ఆయనను చూడగానే ముచ్చెమటలు పోసేసాయి, ఒక్క సారిగా స్తబ్దు అయ్యిపొయింది నా మెదడు.

దెయ్యం వస్తుందనుకుంటే, స్కూలు డైరక్టరు వచ్చాడెమిటి? మతిపోయింది నాకు.

ఆయన బయటకు నడవమని చేసిన సైగతో అందరూ పరుగులాంటి నడకతో గది నుంచి వరండాలోకి వచ్చాం. వచ్చీ రాగానే నా పిక్కల మీద ఒక దెబ్బ, పేక బెత్తంతో.
వరండాలో ఒక యాభై మంది ఉన్నారు,అమ్మాయిలు అందరూ ఏడ్పులు, భయంతో బిక్క చచ్చిపోయిన మొహాలతో మా వైపే చుస్తున్నారు.. రోజూ దెయ్యాలను తమపై ఉసిగొల్పుతున్నందుకు కోపంగా.

ఒక దెబ్బ పడటంతో నేను తేరుకున్నా. ఆ మొదటి దెబ్బే కష్టం, ఒకటి తిన్నాకా మిగతావన్ని లెక్కుండవు, కానీ నటిస్తాం ఎక్కువ పడకుండా.
గతంలో మాతోపాటు ప్రేతాత్మ ప్రయోగం చెయ్యాలనుకుని, భయపడి ఆగిపోయిన అబ్బాయిలు కూడా ఉన్నారు, తల దించుకుని.
మా వార్డెన్ హాస్టల్ లో ఉన్న కుర్రాళ్ళందరి హాజరు తీసుకున్నారు.

అమ్మాయిల్ని చూడగానే కాస్త హీరోలా అయ్యిపోయా, దెబ్బ లెక్కలేనట్లు, చిన్నగా వచ్చే చిరునవ్వును ఆపుకుంటున్నట్లు వాళ్ళకు కనిపించాలని ఆత్రం. నా పక్కన నలుగురికీ పడి మళ్ళీ నా దాకా వచ్చింది దెబ్బల పర్వం. నా వాటా రెండు అరచేతుల్లో కలిపి ఒక పది దెబ్బలు, ఇస్ ఇస్ అని అరచేతుల్లో పేక బెత్తం వాతలు పెట్టింది. నిజం చెప్పాలంటే విపరీత మైన నొప్పి, అయినా ఒప్పుకోను అనే అహం, మొండితనం.

మాకు కాసేపు తిట్ల పురాణం వినిపించాక ఎవరి రూంకి వారిని వెళ్ళిపొమ్మని చెప్పి డైరక్టర్ వెళ్ళిపోయాడు. నేను నా మంచం ఎక్కి దుప్పటి ముసుగు పెట్టేసుకున్నా. నేను పడిన భయానికి రెండు రోజుల దాకా నిద్ర పట్టదు. ఆలోచిస్తున్నా ఎక్కడ తేడా వచ్చింది? ఈ భయపడిన కుర్రాళ్ళు డైరక్టర్ కి చెప్పి ఉంటారా. కాని అమ్మాయిలు ఎందుకు ఏడుస్తున్నారు? మళ్ళీ దెయ్యాలు వచ్చాయా వాళ్ళ రూము దెగ్గరకు? నా వల్లనేనా?

ఒంటిగంట అయ్యింది. బయటకు వెళ్ళిన నలుగురు జాగ్రత్తగా తిరిగి వచ్చారు, నా మంచం కిటికీ దెగ్గర కావడంతో నన్ను లేపి లోపల నుంది గడియ పెట్టిన తలుపు తీయించి లోపలి వచ్చి పడుక్కున్నారు వాళ్ళందరూ. హమ్మయ్యా అనుకున్నా, కనీసం వీరికి ఏమీ కాలేదు. నాకు మాత్రం నిద్ర పట్టలేదు, రేపు ఎలా కొడతారో అని అలోచనలు, ఎంతమంది చూస్తారో, అమ్మాయిలు నవ్వుతారు పరువు పోతుంది. టీచర్లు చిరాగ్గా చూస్తారు. ఇవే ఆలోచనలు..

తెల్లారింది.

5:00 కి జాగింగ్, తరువాత యోగా, స్టడి హవర్స్, టిఫిన్ ఒక దాని తరువాత ఒకటి. నేను ఎవ్వరితో మాట్లాడలేదు. నాతో మట్లాడితే వాళ్ళను కూడా అనుమానిస్తారని వాళ్ళూ మాట్లాడలేదు.

9:00 అయ్యింది స్కూలు టైం అయ్యింది, క్లాసుకు వెళ్ళి కుర్చున్నా. తెలుగు మాష్టారిది మొదటి క్లాసు, కానీ ఆయన చెప్పదలుచుకోలేదు, స్టాఫు రూములో టాపిక్ లో నిజం పాళ్ళు తెలుసుకోవాలని నిశ్చయించుకుని, యక్ష ప్రశ్నలు వేస్తున్నాడు, గోడలా ఒక నిర్ఝీవమైన అభినయం తో నేను నిశ్శబ్దంగా నుంచున్నా.

ఈ లోపు ప్రిన్సిపల్ రూము నుంచి పిలుపు వచ్చింది. నేను దానికోసమె ఎదురు చూస్తున్నా, వెళ్ళి దెబ్బలు తినేస్తే ఇంక భయపడక్కర్లేదని. నాతో పాటు ఉన్న ఆరుగురు కూడా ప్రిన్సిపల్ గదిలోకి వచ్చారు. ప్రిన్సిపల్  రౌండ్స్ కి వేళ్ళారు, మేము మాటల్లో పడ్డం, అప్పుడు తేలిసిన విషయం ఏంటి అంటే, భయపడిన ఇద్దరు అబ్బాయిలు అంతకు మునుపే వాళ్ళ  'గర్ల్ ఫ్రెండ్స్' కి ఓజా బోర్డు విషయం చెప్పేసారు.. గొప్పగా.

అమ్మాయిలకు దెయ్యాలు కనిపించాయి నిన్న రాత్రి కూడా, దానితో వాళ్ళు భయపడిపోయి ఈ సారి డైరక్టరుకి దెగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసారు ఆ అర్ధరాత్రి, భయపడిన అబ్బాయిలేమో వార్డెన్ కి చెప్పారు.
అందరూ కలిసి మా గది దెగ్గరకు వచ్చి, మా ప్రేతాత్మ కై పిలుపులు విన్నాకా లొపలికి వచ్చారన్నమాట !
మేము ఏడుగురం నవ్వుకుంటున్నాం, దెయ్యమనుకుంటే డైరక్టరు వచ్చాడని !

తలుపుకు దెగ్గరగా నుంచున్న మాలో ఒకడు ప్రిన్సిపల్ వస్తున్నాడని సిగ్నల్ ఇవ్వడంతో సైలంటయ్యాం. ప్రిన్సిపల్  రాగానే  జరిగింది తెలుసుకున్నాడు.
ఒక్కొక్కడిని టేబుల్ మీద మోచేతులు పెట్టి ఒంగుని నుంచోమని, సీటు మీద కనీసం ఒక పది దెబ్బలు వేసారు.
కళ్ళలో నీళ్ళు కాదు రక్తం వచ్చెంత నొప్పి, కాని మొండితనం, సిగ్గు, అహం... మొత్తం బాధని పంటి బిగువునే భరించేలా చేసాయి. 
ఎవరి కోటా వారికి పడ్డాకా మమ్మల్ని మా క్లాసులకి పంపించేసారు.

ఈ దెయ్యాల విషయమే తెలియట్లా, నా ప్రేతాత్మల ప్రయోగాల వల్ల దెయ్యాలు రోజూ స్కూలు చుట్టూ తిరిగుతున్నాయి, వాటిని వదిలించుకోడం ఎలా? మళ్ళీ ఇంకొక రోజు ఓజా బోర్డు ప్రయోగం చేసి వాటినే అడగాలి. నిర్ణయించుకున్నా.

వెళ్ళి క్లాసులో బెంచి మీద ఏమి నొప్పి లేనట్టు కుర్చున్నా, విపరీత మైన నొప్పి భరిస్తూ. అలా కుర్చున్నానో లేదో మళ్ళీ పిలుపు వచ్చింది. ఇది ఊహించని పరిణామం. టీచర్ నా వైపు జాలిగా చూస్తుంటే మళ్ళి వెళ్ళా ప్రిన్సిపల్ రూముకి.
అక్కడ వార్డన్ నిన్న సినిమాకు వెళ్ళిన నలుగురిని ఉతుకుతున్నాడు. అవును నిన్నరాత్రి హాజరు తీసుకున్నాడుగా. నన్ను మళ్ళీ అదే రకంగా నుంచోమన్నాడు, ఈ సారి వార్డెన్ అయిదు దెబ్బలతో సరిపెట్టాడు. సినిమాకు వెళ్ళి వచ్చే వాళ్ళకు తలుపు తీసి సాయం చేస్తున్నందుకు ఇది.

మళ్ళీ వాళ్ళ ను కొట్టడం మొదలు పెట్తాడు వార్డన్ , ఇది సిగరెట్లు కాలుస్తున్నందుకుట!
వాళ్ళలో ఒకడు చెప్తున్నాడు, సిగరెట్టు అలవాటు లేదు కేవలం దెయ్యాలకు భయపడి సిగరెట్టు అంటించా అని. అంటే వీళ్ళు నిన్నరాత్రే దొరికిపోయారా? మరి నాకు చెప్పలేదూ???! దుర్మార్గులు, అనుకున్నా. నిన్న అసలే తెల్ల డ్రస్సులు కనిపించేసి ఉంటారు, చీకట్లో కూడా, అనుకున్నా.

ఒక్క సారిగా స్పురించింది, చిక్కుముడి విడిపోవడంతో ఫక్కున నవ్వు బయటకు వచ్చేసింది. నవ్వుతున్న నన్ను చూసి ప్రిన్సిపల్ టేబుల్ దెగ్గరకు రమ్మన్నాడు. 
వెళ్ళా.
ఎందుకు నవ్వుతున్నావ్ అని అడిగాడు. 


అప్పుడు చెప్పా,
గోడ మీద దెయ్యాలు మన కుర్రాళ్ళే, లైటు కలరు చొక్కాలు వెన్నెల వెలుతురులో, పొల్లాల్లో కనిపించీ కనిపించకుండా దెయ్యాల్లా అనిపించారు కనిపించారు. మన కుర్రాళ్ళే దెయ్యాలకు భయపడి సిగరెట్టు వెలిగించినప్పుడు కొరివి దెయ్యాలయ్యారని.  హ హ హ్హా !!

ప్రిన్సిపల్ మొహం లో చిన్న నవ్వు ఆపుకుంటూ, నన్ను వెళ్ళిపొమ్మమన్నడు. దెబ్బలు తప్పించుకున్నందుకు ఆనందపడుతూ వెనుదిరిగా.
వెనుదిరిగానో లేదో నన్ను మళ్ళీ పిలిచాడు, ' సరే అయితే ముందు రోజు గోడ దూకి సినిమాకి వెళ్ళిన వారి పేర్లు చెప్పు ' అన్నాడు.
మతిపోయింది నాకు, ఇంత గోలలో వాడికి ఈ పాయింటు ఎలా తట్టింది, చా చా అనుకున్నా. తలదించుకున్నా చెప్పలేదు.
మళ్ళీ టేబుల్ దెగ్గరకు పిలిచాడు !!! ఈ సారి వదల్లేదు !!!

జింతాత జింత జింత జింతాతత....



(సమాప్తం)

--(గుర్తులేని చోట కాస్త నాటకీయంగా రాసినా, స్తూలం గా జరిగింది మాత్రం ఇదే ;-) )