Saturday, September 5, 2020

ముల్లు కొన మీద మూడు మడుగులు - పురందర దాసుని పాట

 ముల్లు కొన మీద మూడు మడుగులు

రెండు నింపలేము ఒకటి నింపలేదు


నింపని దానిలో ముగ్గురు పనివాళ్ళు

కుంటివాళ్ళు ఇద్దరు కాళ్ళు లేనిదొకడు


కాళ్ళు లేని వాడివద్ద మూడు నల్ల గేదెలు

గొడ్డు గేదెలు రెండు దూడలేనిదొకటి


దూడలేని గేదెవద్ద మూడు బంగరు మూటలు

రెండు ఎప్పుడూ మిగలలేదు ఒకటి ఎప్పుడూ వాడలేదు


వాడని మూటకు ముగ్గురు సాక్షులు

ఇద్దరు గుడ్డివాళ్ళు ఒకరికి కళ్ళే లేవు


కళ్ళు లేనివాడికి మూడు రాజ్యాలు

బంజరు భూములవి రెండు జనాలు లేనిది ఒకటి


జనాలు లేని ఊరుకొచ్చె కుమ్మరివాళ్ళు ముగ్గురు

వంకర చేతులదిద్దరు చేతులే లేవు ఒకరికి


చేతుల్లేని కుమ్మరి చేసె మూడు కుండలు

కన్నాల కుండలు రెండు అడుగే లేదు ఇంకొకటికి


అడుగులేని కుండలో ఉండె మూడు గింజలు

ఉడకబడనివి రెండు ఉడికించనిది ఒకటి


ఉడికించనిదానికోసం వచ్చె ముగ్గురు చుట్టాలు

ఇద్దరు ఎప్పుడూ తినరు ఒకరికేమో ఆకలి లేదు


ఆకల్లేనివాడికి మూడు కర్ర దెబ్బలు

రెండు దెబ్బలు తగల్లేవు ఒకటేమో తగలదు

తగలని దెబ్బ తగలనివ్వు విఠ్ఠలా

మోక్షానికి దారిచూపు పురందరదాస విఠ్ఠలా !


పురందర దాసుని పాట, మీకేం అర్థం అయ్యిందొ చెప్పండి. నాకర్థమయ్యింది కింద రాసా, వీలయ్యింత అర్థమయ్యెలా బొమ్మలతో వివరించడానికి ప్రయత్నించా, భావంలో అక్షరంలో దోషాలుంటే మన్నించి మార్పు చెప్పమని ప్రార్థన ! 

                                                          ---XXX---XXX---

ముక్తి సాధన మనలోనే మన నుండే మన వల్లే మనం కోసమే పుడుతుంది, దానికి శోకం నుండి పుట్టిన ఆర్తి కావాలి. 
మనిషిగా ముక్తి సాధించడానికి చాలా మార్గాలున్నాయి, కాని ప్రాపంచిక పరిమితుల వల్ల మనం వాటిని అనుసరించలేము. 
వాటిని వివరిస్తూ చివరికి జ్ఞాన వైరాగ్య భక్తుల ద్వారా ముక్తినివ్వమని విఠ్ఠలుని కోరడమే ఈ పాట అంతరార్ధం ! 

1. ఉపమానాలన్నీ ":"  తో వివరించా. 
    ఉదా : సూది మొన : జీవి కి చిహ్నం

2. సంబంధాలన్నీ "->" తో కలిపా 
    ఉదా : స్థూల శరీరానికి 3 అవస్థలు - కౌమార, యవ్వన, వృద్ధాప్య. అందులో ముక్తి సాధనకు      అనువైనది యవ్వన శరీరం, అందుకే స్థూల శరీరానికి దానిని కలిపా.
    



పైన బొమ్మ ఒక సారి చూసి, క్రింది వివరణలోకి వెళ్ళండి, తరువాత మళ్ళీ బొమ్మ చూస్తే సంపూర్ణం గా అవగతమవుతుంది.

 ముల్లు కొన మీద మూడు మడుగులు, రెండు నింపలేము ఒకటి నింపలేదు
    

ఒక గుర్రపు వెంట్రుక తీసుకుని అందులో 10000 వంతు కొలిస్తే ఎంత ఉంటుందో, వేదాల ప్రకారం ఒక జీవి అంత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముల్లు కొన మనలో ఉన్న జీవానికి ప్రతీక.

చెరువు అంటే భూమి+నీరు+మొక్కలు+జల చరాలు ఇలా చాలా చెప్పొచ్చు, మానవ శరీరం కూడా అంతే.

సూది మొన అంత జీవం పై మూడు మడుగులు (చెరువులు), అంటే ఆ జీవాన్ని అంచెలంచెలుగా వ్యక్త పరుస్తూ, ఉల్లిపొరల్లా కప్పి ఉన్న కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు.

స్థూల శరీరం లేకుండా, మోక్షం పొందని జీవానికి, విముక్తి కోసం సాధన చేసే అవకాశం లేదు. స్థూల శరీరం ఉన్న జీవేమో ప్రాపంచిక విషయాల్లో కొట్టుకుపోతూ సాధన చెయ్యక విముక్తి పొందటం లేదు. అందుకే రెండు చెరువులు నిండలేవు ఒక దానిలో నీరు నింపలేదు అని పురందరదాసు అంటున్నారు. 




* నింపని దానిలో ముగ్గురు పనివాళ్ళు, కుంటివాళ్ళు ఇద్దరు కాళ్ళు లేనిదొకడు
స్థూల శరీరం మూడు అవస్థలలో పడుతుంది. కౌమార, యవ్వన, వృధాప్య.
కౌమార దశ లో ఎం చెయ్యాలో తెలీదు, ఆటలు పాటలు తో గడిచిపోతుంది.
వృద్ధాప్యం శుష్కించి వ్యాధి మయం అయిన శరీరంతో ఏం చెయ్యలేక గడిచి పోతుంది.
ఇక యవ్వనం ప్రాపంచిక సుఖాలలో మునిగి తేలుతూ సాధన చెయ్యక గడుస్తుంది.
అందుకే పురందర దాసు కౌమార, వృద్ధ అవస్థలను కుంటి వారి గాను, ప్రయత్నమే లేని యవ్వన దశ ను కాలు లేని వాని గాను వర్ణించారు.

* కాళ్ళు లేని వాడివద్ద మూడు నల్ల గేదెలు, గొడ్డు గేదెలు రెండు దూడలేనిదొకటి


* దూడలేని గేదెవద్ద మూడు బంగరు మూటలు, రెండు ఎప్పుడూ మిగలలేదు ఒకటి ఎప్పుడూ వాడలేదు


* వాడని మూటకు ముగ్గురు సాక్షులు, ఇద్దరు గుడ్డివాళ్ళు ఒకరికి కళ్ళే లేవు


* కళ్ళు లేనివాడికి మూడు రాజ్యాలు, బంజరు భూములవి రెండు జనాలు లేనిది ఒకటి


* జనాలు లేని ఊరుకొచ్చె కుమ్మరివాళ్ళు ముగ్గురు, వంకర చేతులదిద్దరు చేతులే లేవు ఒకరికి


* చేతుల్లేని కుమ్మరి చేసె మూడు కుండలు, కన్నాల కుండలు రెండు అడుగే లేదు ఇంకొకటికి


* అడుగులేని కుండలో ఉండె మూడు గింజలు, ఉడకబడనివి రెండు ఉడికించనిది ఒకటి


* ఉడికించనిదానికోసం వచ్చె ముగ్గురు చుట్టాలు, ఇద్దరు ఎప్పుడూ తినరు ఒకరికేమో ఆకలి లేదు


* ఆకల్లేనివాడికి మూడు కర్ర దెబ్బలు, రెండు దెబ్బలు తగల్లేవు ఒకటేమో తగలదు


ఇంకా చాలా ఉంది... వీలయ్యినప్పుడల్లా రాస్తుంటా !

-- ఇప్పుడు ఈ పాట చూసి ఆనందించండి



స్థూల, సూక్ష్మ, కారణశరీరాలు అంటే ఏమిటి?

గరుడపురాణం ప్రకారం మనిషి = ఆత్మ + 3 శరీరాలు + పంచకోశాలు + 3 అవస్థలు

స్థూలశరీరం:
పంచభూతాలతో నిర్మించబడినది ఈ భౌతిక శరీరంనే స్థూల శరీరం లేదా అన్నమయ శరీరం అంటాం.
స్థూల శరీరం=ఆకాశం+ వాయువు+ అగ్ని+ జలము+ పృథ్వి
ఇది ఆరు రకాల వికారాలు పొందుతుంది: పుట్టుక, ఉండడం, పెరగడం, మార్పు చెందడం, తరగడం, నశించడం

సూక్ష్మ/లింగ శరీరం: స్థూల శరీరాన్ని కదిలించేది ఈ సూక్ష్మ శరీరం.

సూక్ష్మ శరీరం=పంచప్రాణాలు + పంచ జ్ఞానేంద్రియాలు + పంచ కర్మేంద్రియాలు + మనస్సు + బుద్ధి

ప్రాణ పంచకం= ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు

జ్ఞానేంద్రియ పంచకం = త్వక్కు(చర్మం:వాయువు) + చక్షువు(కన్ను:అగ్ని)+రసన (నాలుక+జలం) + శ్రోతం(చెవి:ఆకాశం) + ఘ్రాణం(ముక్కు:భూమి)

కర్మేంద్రియ పంచకం = వాక్కు(ఆకాశం) + పాణి(వాయువు)+ పాదం (అగ్ని) + విసర్జకం/పాయువు (జలం), ఉపస్థ/జ్ఞానేంద్రియ (భూమి)

ఈ 17 మన విషయజ్ఞాన సముపార్జనకు తోడ్పడతాయి.

స్థూల శరీరాన్ని పట్టుకుని ఉండే ప్రాణశక్తి వలన మనం వాయువు పీల్చుకోవడం, ఆరగించడం, తిన్నది అరిగించుకోవడం, కదలికలు, వాహకం, నరాల శక్తి, ఎముకల కదలిక, మాంస, మజ్జ, ఇతరత్రా అన్నీ కూడా జరుగుతాయి.

అంత్యేష్టి సంస్కారం అయ్యాక స్థూలశరీరం పంచభూతాలలో కలిసిపోతుంది, జీవుడు మాత్రం ఈ లింగశరీరాన్ని ఆశ్రయించి ఉంటాడు.  ఉపనిషత్తుల వర్ణన ప్రకారం అంగుష్ఠమాత్రంగా హృదయంలో ఉన్న దీనిని లింగశరీరం అంటాము.

కారణ శరీరం: ఇది అనిర్వచనీయమైన శరీరం. మిగిలిన రెండు శరీరాలకు కారణభూతమైనది.

ఈ కారణశరీరం వల్లనే జీవునికి మరల వచ్చే జన్మలు ఆ జన్మల కారణాలు వాటిలో వచ్చే సుఖదుఃఖాలు నిర్ణయించేది. ఈ శరీరంలో మనస్సు బుద్ధి లేనందువలన కేవలం ఆనందం నివసిస్తుంది. సమాధి స్థితి, ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం ఈ కారణ శరీరం. మన సంస్కారాలు, పూర్వ జన్మ వాసనలు అన్నీ నిబిడీకృతమై ఉంటాయి ఇక్కడ. 

జాగ్రదావస్థ యందు ఇంద్రియములతో చేసే కర్మల ఫలితాలను, వాసనారూపంలో కారణ శరీరంలో పొందు పరచబడి ఉంటాయి. ఇవి మరు జన్మకు కారణమవుతాయి. అలా మరుజన్మకు కారణమయ్యే వాసనలు దీన్లో ఉండటం వల్ల దీన్ని, కారణ శరీరమంటారు. కాని ఇది ఆత్మ కాదు. 

సుషుప్త్యావస్థలో (గాఢ నిద్రలో) ఇంద్రియాలు మనస్సులో లీనమై ఉంటాయి. అంచేత అవి పనిచెయ్యక, బాహ్య అనుభవాలు మనకు రావు. ప్రాణ శక్తులు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ ప్రాణమే  గాఢనిద్రలో శరీరం యొక్క సమస్త వ్యాపారాలనూ నడిపిస్తుంది. 

మనస్సు 

ఇంద్రియవృత్తులు, మనస్సూ తనలో (ఆత్మలో) లీనమై ఉంటాయి. అలాంటి సుషుప్తిలో ఈ కారణ శరీరం మాత్రమే భాసిస్తుంది/ ఉంటుంది. సుషుప్తిలో ఏమీ తెలియదు. సుషుప్తి నుంచి లేచాక నేను బాగా నిద్రపోయాను అని తెలుసుకొనేది మనస్సు. 

ఆత్మ

ఈ మూడు శరీరాలకూ ఆత్మే సాక్షి. దేనితోనూ తాదాత్మ్యం చెందదు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు భిన్నంగా; స్వప్రకాశ రూపమై కర్తగా గాని , భోక్తగా గాని కాకుండా అన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చే ఆత్మయే మహాకారణ శరీరం. ఇది గాఢనిద్రలో అనుభవంలోకి వచ్చే స్థితి. 
ఇదే తురీయావస్థ. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తీ స్థూలశరీర ధర్మాలు. స్థూలశరీరం- క్రియాశాక్తికీ , సూక్ష్మశరీరం- ఇచ్ఛాశక్తికీ , కారణశరీరం- జ్ఞానశక్తికీ ఆశ్రయాలుగా చెప్పబడ్డాయి. 

పుట్టుక ముందు, ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ, కారణ శరీరాలతో ఉంటుంది. మరణం తరువాత కూడా అది అవ్యక్త స్థితి లో ఉంటుంది. ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది.


మరణసమయంలో ఈ కారణ లింగ శరీరాలు స్థూల శరీరాన్ని విడిచి పెట్టి పోతాయి. గురువు దయ వుంటే మరల వెనుకకు రాకుండా పరమాత్మ వద్దకు పోగల మోక్షం లభిస్తుంది.




Referred and will add more from the below links:
1. http://andhrabhoomi.net/content/others-3426
2. https://www.mymandir.com/p/clp9n
4. http://ourreligionandculture.blogspot.com/2019/01/blog-post_31.html
5. http://sahitinandanam.blogspot.com/2017/01/blog-post_69.html



1 comment: