Saturday, February 23, 2013

బతకడమంటే బొందిలో ప్రాణముండటం కాదు, బుర్రలో బోళ్ళెడు భావోద్వేగాలు ఉండటం


హైదరాబాద్ JNTU రోడ్ లో బాగా రద్దీ ఉన్నప్పుడు బండిమీద వెళ్తున్నాం అనుకోండి, అంతా కిక్కిరిసి పోయి ఉంటుంది, చాల నెమ్మదిగా, ఒకరి పక్కన ఒకరు రాసుకుంటూ పూసుకుంటూ పోతుంటాం. మన ముందు చక్రం ముందు వాడి బండికి తగులుతూ ఉంటుంది, వాడు ఒక సారి వెనక్కి తిరిగి చూసి మళ్ళి ముందుకు తిరిగిపోతాడు, ఒక్కొక్కడు వెనక్కి తిరిగి కాస్త చిరాగ్గా చూస్తాడు, 'సారీ' అంటాం. బండి ఇంజిన్ ఆపేసి అటు ఇటు, పక్కన జనాల్ని వాహనాల్ని పరికిస్తూ ఉంటాం. ఎవరైనా పేదవాళ్ళు చేయి చాచి అర్థిస్తూ వస్తే ఒక రూపాయి వేస్తాం. బొమ్మలు, బండి తుడిచే గుడ్డలు అమ్మేవాళ్ళ దెగ్గర అవి కొంటే కొంటాం, లేదంటే పొమ్మంటాం. ఆ ముందున్న అందమైన అమ్మయి వైపు ఆనందంగా చూస్తాం, పక్కన ఉన్న పేదరాలి వైపు జాలిగా చూస్తాం, ఎదురుగా ఉన్న కొత్తరకం కారు వైపు వింతగా చూస్తాం, గాల్లొ నిండిన పెట్రోల్ పొగల వైపు చిరాగ్గా చూస్తాం, ట్రాఫిక్ నిభందనలు పాటించని వారి వైపు కోపంగా చూస్తాం.


అదే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నాం అనుకోండి. ఒక 70-80 కి.మి వేగంతో (అంతకన్నా వేగంగా వెళ్ళే వాళ్ళ గురించి వదిలెయ్యండి) మన లైన్ లో మనం దూసుకుపోతాం. ఎవరికి వాళ్ళు అవతలి వాళ్ళతో కనీసం 10మీ దూరం ఉండేలా చూసుకుంటూ వేగంగా వెళ్తాం. అవతలివాడు వేగం తగ్గించి మనకు దెగ్గర పడుతుంటే, ఎక్కడ ఢీ కొడతామో అని భయం, వేగం తగ్గించాలని చిరాకు.ఈ ట్రాఫిక్ గోల ఎమిటిరా అనుకుంటున్నారా?

ఇప్పుడు మనమున్నది స్పీడు యుగం, రోజు రోజుకి మన చుట్టూ అన్నీ చిన్నవి, వేగవంతమైనవి  అయ్యిపోతున్నాయ్. మనకి సన్నగా ఉండే సెల్, వేగంగా నడిచే బండి, కురచ లేదా ఖరీదైన బట్టలు కనీస అవసరాలు అవుతున్నాయ్. (ఇక్కడ స్పీడు తప్ప మిగతా అన్నీ నేను చెప్పాలనుకున్నదానికి అప్రస్తుతం అనుకోండి :-))

ఈ జీవితానికి అలవాటు పడినవాళ్ళ పరిస్తితి స్పీడు ప్రయాణంలానే ఉంటుంది.  ఎదుటవాడి ఉనికే నచ్చదు, ఒంటెద్దు సొంటికొమ్ము రకాలు, అది వాళ్ళ తప్పు కాదు. నిర్ధేసించిన గమ్యం త్వరగా చేరాలంటే  సమయాన్ని పక్కవా ళ్ళగురించి ఎలా కేటాయిస్తారు?? కాని ఇక్కడా అర్థం చేసుకోవలసింది ఒకటి ఉంది, మన సమయం కొంత మనవారికి కేటాయించలేకపోతుంటే మనం తిరోగమనంలో ఉన్నట్టే. బంధువులు, స్నేహితులు, ఇతరుల ఆప్యాయత, ప్రోత్సాహం లభించినప్పుడు శారీరక వ్యాధులనుంచి తేలికగా బైటపడటం సంభవిస్తుంది.మానవ సంబంధాలు చక్కగా ఏర్పడాలంటే ముఖ్యమైన అంశం - ఇతరులను అర్థం చేసుకోగలిగే గుణాన్ని కలిగి ఉండటం. ఇతరుల భావాలను అర్థం చేసుకుని వారికి అవసరాను గుణంగా ఓదార్పు, సహకారం అందించగలిగి నప్పుడు, తగిన రీతిలో స్పందించగలిగినప్పుడు సంఘంలో గౌరవం పొంది ఎదగగలుగుతారు.
మరి ఇతరులను అర్థం చేసునేందుకు సమయం కేటాయీంచలేకపోతే ఎలా?

 భావోద్వేగా మేథాశక్తి లోపిస్తున్న వ్యక్తులు తేలికగా మానసిక సమస్యలకు లోనవుతారు. ఒంటరితనం, వ్యాకులత, ఆందోళన, ఆహార సేవన రుగ్మతలు, హింసాత్మక ప్రవృత్తి, సంఘ వ్యతిరేకత మొదలైనవి వీరిలో అధికంగా చూస్తాం. వీరు తేలికగా మాదక ద్రవ్యాలకు బానిసల వుతారు. ఆత్మహత్యలకు, హత్యలకు పాల్ప డతారు. శారీరక సమస్యలు కలిగే అవకాశం కూడా వీరిలో ఎక్కువే.

పోనీ ఇది వారితోనే పోతుందా అంటే.. పోదు ! వారి ఆలోచనా సరళి, మానసిక స్తితి అన్ని అనుకరణ రూపంలోను, జన్యువుల రూపంలోను తరువాతి తరాలకు చేరతాయి. పెద్దలు చేసిన పాపాలు పిల్లల్లకు తగులుతాయి అంటే ఇదే.

బతకడమంటే బొందిలో ప్రాణముండటం కాదు, బుర్రలో బోళ్ళెడు భావోద్వేగాలు ఉండటం, వాటిని నియంత్రించుకుంటూ శారీరకంగా, మానసికంగా అభివ్రుద్ధిచెందడం.