ఇయ్యాల రంజాన్ శెలవు, అక్షయ తృతియ, పరశురామ జయంతీ కలిపొచ్చాయండీ.
ఐతే మాకు ఓ ఎగస్త్రా పండగ కూడొచ్చేసిందండీ బాబు, ఆవకాయ పండగ.
.
ఆవకాయంటే ఆషామాషీ కాదండే.
ఆవకాయంటే సంవత్సరం మొత్తానికి ఇన్స్యూరెన్సు.
మొన్న వాట్సప్పు లో సూసానండీ,ఈ రాకెట్టుల్లో పైకెళ్ళే ఓళ్ళూ బూమ్మిదున్నప్పుడే పళ్ళు, కూరలు, కక్క ముక్క అన్నీ ఎండబెట్టేసేసి డబ్బాల్లో ఉప్పేసి ఊరగాయల్లా ఆడకట్టుపోతారంటండీ.
అక్కడ పంటలుండవు కదండీ, ఈ డబ్బాల్లో తిండేండీ మరి ఆళ్ళకి.
.
మరి మన తాతల్నాడే ఇయ్యన్నీ కనిపెట్టేసారు కదండే ?
కరువులొచ్చినా, గోదారికి వరదలొచ్చినా,
యుద్ధాలొచ్చినా, ఇంటికి ఏళ కాని ఏళ సుట్టాలొచ్చినా,
రోజుల తరబడి ప్రయాణాలొచ్చినా
కరోనా కొత్త రకాలతో లాక్డవున్ వచ్చినా
ఊరగాయ జాడిలుంటే కొండంత దైర్నం కదండే?
.
ఉప్పేత్తావాండి, కారవండే, ఆవాలు , పప్పు నూనె , మాడి కాయలు .. ఇంతకన్నా కష్ట కాలం పొయ్యేదాక బలం ఇచ్చే తిండేవుంది సెప్పండి?
ఏడేడి అన్నవ్లా ఆవకాయి లాగించేసి, తరవాత ఓ నాలుగు ముద్దలు పెరుగన్నం తినేహేత్తే తిరుగుంటదాండీ?
ఏదో ఉప్పు కాయే కదా అంటారేమో, ఆవకాయ కుదరాలంటే సెయ్యి తిరిగుండాలండే.
.
ఇయ్యాల పొద్దునే ఆరింటికల్లా మార్కెట్ కెల్లి, పుల్లని పీసున్న సిన్న రసాలు ఎతుక్కుని బేరవాడెవండీ.
ఆడూ కాయోటీ 30/- అన్నాడండి.
నేను అంతయితే కష్టం ఇంకో కొట్టు సూసి ఒత్తా అన్నానండి.
ఆడు మా ఇంటీకి వచ్చాక ఇంకో ఇంటీకి బోజన వెట్టకుండా ఎలా పంపేత్తావండీ, మీరెంతంటారూ అన్నాడండి.
సరే ముక్క కొట్టిచ్చేలా బేరవాడి టోకున డబ్బులిచానండె.
మాంచి ఎటకారాలాడుతున్నావ్ ఏవూరేటీ నీది? అన్నానండి
తీరా సూత్తే ఆడు మన భిమారం ఓడు.
సరిపోయింది.. మాది సింతలూరే అన్నానండి.
ఆడు అవిసయిపోయి సింతలూర్లో ఎక్కడా అన్నాడండి.
మన పెద్ద రావి సెట్టు పక్కనిల్లు, నీకు తెలుసేటి అన్నానండీ.
ఆడు అయ్ బాబో తెలీపోటవేటండి పెతి సంస్రం తీర్తానికి కజురం బండి ఎడతావండి , రావి సెట్టు దెగ్గర పైపు లోనే నీళ్ళు తీసుకెల్తావండీ అన్నాడు.
పొద్దెక్కి పోతందని పనిలో పడ్డావండి.
.
మా అత్తోరికి కూసింత సుబ్రం ఎక్కువండి బాబూ, డబ్బులుపోతే పోయాయని నాలుగు కిన్లే బాటిళ్ళు, ఓ మంచి బకిట్టూ అట్టుకేళ్ళానండీ.
సరే ఆడితో కబుర్లు సెప్తూ వంద కాయలూ సుబ్బరంగా కడీగేసి మంచి పంచీ ముక్కతో తుడిసేసానండి.
ఆడేమో ఆవకాయ కత్తి పీటేసి, కాయికి 12 ముక్కలు కొట్టేహేడండీ.
చాలా మంచి పనోడండి ఆడు, వందలో ఒక్క ముక్కా నలగిపోలేదండి.
పైనో యాబై ఇచ్చా టీ తాగమన్నానండి. ఉండిపోయిన కిన్లే బాటిళ్ళు ఆడి కిచ్చి, ఎండన పడున్నావ్అ, ని తాగెయ్ మన్నానండి.
.
ఆడించిన రాళ్ళుప్పూ, ఆవ పిండీ, ఏ ఎస్ బ్రాండు పప్పు నూనె, తెనాలి పాలింగువ కొనుక్కుని ఇంటి కొచ్చేహేవండీ.
కరోనా కదండీ, ఇంటి కొచ్చి స్నానం చేసి టిఫిన్ తిని, పని మొదలేట్టావండి.
.
ముక్కలన్నీ ఆరబోసి, చీర ముక్కతో శుభ్రం గా తుడిసేసి, తౌడు గిన్నితో కొలిసేసామండి.
ఒక తౌడు గుండకి, తౌడున్నర ముక్కల సొప్పున ముందు గుండ కలిపేసుకున్నావండి.
గుండ లెక్కేమో ఒక కారానికి ఒక ఆవ పిండీ, అర ఉప్పూ కలపామండి. కూసింత మెంతులు , రెండు సిటికెడులు ఇంగువండీ.
పెద్ద ఆవాకాయ టబ్బులో గుండ కొలిసి పోసేసి, నూనెలో ముక్కలు తడిపి గుండలో కలిపేసేనండీ. పైన ఒక లీటరు నూనె పోసేత్తే ఎర్రగా నిగనిగ లాడిపోతూ మంచి ఆవకాయ ఓసనండి.
.
అదే కారం సేత్తో ఓ సారి దేవుల్లందరికీ సూపించేసి,
ఆవకాయ ముక్కలు కలిపిన గిన్నిలో ఓ నాలుగు చెంచాలు పప్పు నూనె పోసి
నా కారం సేతులతో ఏడేడి అన్నం కలిపి మళ్ళీ దేవుడికి సూపించేసి,
అందరం తలో ముద్దా తిన్నావండి.
అమృతం వంటే కారం గా కూడా ఉండొచ్చు కదా అని డౌటనుమానం ఒచ్చేహిందండీ బాబు.
మూత శుబ్రంగా చీరేసి పురుకోసతో కట్టేహేనండి.
మూడు నిద్రలయ్యాకా తీసి మళ్ళీ కలిపి ఉప్పు సూసుకుంటే సరిపోద్దండి. ఆడించిన ఉప్పూ అటూ ఇటు అవ్వుద్దికదండీ.
.
ఈడేంటీ ఆవకాయకి ఇంత కధ సెప్పేడు అనుకుంటారేమో,
సూత్తూ ఉండండీ ఆడు ఎలన్ మస్కోడు
అమెరికా ఆవకాయనో,
మస్కు మాగాయనో కంపెనీ ఎట్టేసేసి,
ఆకాశం లో తిరిగేటోళ్ళకి జాడీలూ పంపేసేత్తాడు.
మీరో కంపెనీ ఎట్టి ఆడు కొనే దాకా ఎయిటు సెయ్యండీ.
తర్వాత ఇంక కాలు మీద కాలేసుకునీ కూసోడమే.
రోళ్లు బద్దలయినా , రాళ్ళు కరిగిపోయినా అవకాయ పెట్టనిదే ఎండాకాలం అవ్వదు