ఆలమూరు శాంతి సినిమా హాల్లో పిల్ల దెయ్యం – 2 రెండో ఆటకి నేను, శాస్త్రీ వచ్చాం. నాకు దెయ్యం సినిమా అంటే చచ్చేంత భయం. భయం దెయ్యం గురించి కాదు, సినిమా లో లీనమైపోయి భయ పడతానేమో అని భయం. పల్లెటూరు కావడం వల్ల మాకు ఈ థీయేటర్ తప్ప వేరే దిక్కులేదు. వద్దు వద్దు అంటున్నా వినకుండా శాస్త్రి ఈ సినీమాకి తీసుకువచ్చాడు.
సినిమా మొదలు అయ్యింది...
కెమెరా ఒక నల్లని కాకి తోక దెగ్గర మొదలు పెట్టి నెమ్మదిగా కాకి మొహం వైపు తిరిగింది (ఎంట్రి మ్యూసిక్ బాగుంది, దేవి అనుకుంటా).
జనాల ఈలలతో హాల్ నిండిపోయింది. "కాకి కాకి కాకి.. నా కవాసాకి" అని అరుస్తున్నారు.
ఒకడు యెవడొ చొక్కా చింపేసుకున్నాడు. వీపు మీద కాకి పచ్చ బొట్టు కూడా ఉంది.
ఆనందంతో ఒక కుర్రాడు పక్కన ఉన్న అమ్మాయిని ముద్దుపెట్టుకున్నాడు.
చిన్నపాప ... బొమ్మ వెతుక్కుంటూ స్టోర్ రూం లోకి వెళ్తోంది. లోపల అంతా చిమ్మ చీకటి.
మసక వెలుతురులో చిందర వందరగా పడేసిన సామన్లు కనిపిస్తున్నాయ్. పిల్ల స్కూల్లొ నేర్చుకున్న పద్యం పాడుకుంటూ నడుస్తోంది.
ఒక్కసారిగా కమెరా మెట్ల వైపు తిరిగింది.
హుప్ ! జడుసుకున్నా. అక్కడ ఒక పిల్ల దెయ్యం కూర్చుని ఉంది.
చిన్నపిల్ల మెట్లు యెక్కడం మొదలు పెట్టింది.
అదేదొ నేను అదే గదిలో ఉన్నట్టు, పిల్లను పట్టుకుని గదిలొంచి పారిపొవాలని అనిపిస్తొంది.
చిన్నపిల్ల ఒక్కసారిగా వెనక్కి తిరిగింది !
హుప్ ! మళ్ళీ జడుసుకున్నా. ఆ పిల్ల కూడా దెయ్యమే.
ఇంటెర్వెల్లో పాచిపోయిన పకోడి అమ్మే పిల్లాడి దగ్గరనుండి పక్క సీట్లో కూర్చున్న 10 ఏళ్ళ పిల్ల దాకా అందరూ దెయ్యాలేమో అని భయం పట్టుకుంది.
నా అవస్త చూసి పకా పకా నవ్వుతున్న శాస్త్రిగాడు, దెయ్యాల్ని ఆవాహన చేసే కపాల మాంత్రికుడేమో అని అనుమానం కలిగింది. ఎందుకు మాష్టారు భయపడతారు, సినిమానేగా? అని శాస్త్రి పళ్ళికిలిస్తుంటే, డ్రాకులా పక్కన కూర్చున్నానేమో అని భయం వేసింది.
ఈ డైరెక్టర్లకి బుద్ధి లేదు దెయ్యం ఉన్న గదిలోకి పిల్లల్ని పంపే బదులు రాజకీయ నాయకుల్నో, తీవ్రవాదుల్నో, సీరియల్స్ డైరెక్టర్లనొ, ఓం కార్ గాడినో పంపొచ్చుగా.. పీడా విరగడ అవుతుంది?
కళ్ళు, చెవులు మూసుకుని, కాళ్ళు సీట్లో పెట్టుకుని (దెయ్యం కుర్చీ కింద ఉంటుందేమో అని) కూర్చున్నా.
ఉన్నట్టుండి నా కుర్చీ వెనక ఏదో పాకుతున్నట్టు అనిపించింది. భయంతో గుండె జాతర డప్పులా విపరీతంగా కొట్టుకుంటొంది.
మళ్ళీ ఎదో పాకుతున్నట్టు అనిపించింది. ఈ సారి పైకి కదులుతున్నట్టు తెలుస్తోంది.
భయం గుండెల్లొంచి, గొంతు దాటి తలలొ బ్రహ్మ రంధ్రాన్ని చేరుకుంది.
కెవ్వుమని నేను పెట్టిన పొలి కేక దెబ్బకి, సినిమా తెర రెండుగా చీలి పొయింది.
అప్పటికే భయంతో బిక్కచచ్చిపోయిన ఓ పది మంది వంతులవారిగా కెవ్వుమన్నారు.
ఇంకో పది మంది కంగారుపడి సీట్లోంచి కింద పడిపోయారు. ఒక పాతిక మంది చెతిలో ఉన్న కూల్ డ్రింక్ లు, పాప్ కార్న్ ఒలకబోసేసుకున్నారు. దొరికిందే సందు అని ఒక కుర్ర పిల్ల పక్కన ఉన్న కుర్రడిని వాటేసుకుంది.
లైట్లు వెలిగాయి.
వెనక సీట్లో అబ్బాయి బిత్తరపోయి (ముందు సీట్లో ఉన్నది అమ్మాయి అనుకున్నాడు) కాళ్ళు వెనక్కి తీసేసుకుని అమాయకుడి మొహం పెట్టాడు. ఓరి దుర్మార్గుడా అనుకుంటూ ముందుకు తిరిగా. నా ముందు సీట్లో కూర్చున్న ప్రేమ జంట తపస్సు భగ్నమైన రుషుల్లా నా వైపు కోపంగా చూస్తున్నారు. పక్క సీట్లో పిల్ల ఏడుపు లంఘించుకుంది. నావైపు పేలవంగా చూస్తూ పిల్ల తండ్రి "ఇంకా పెళ్ళి కాలేదనుకుంటా" అన్నాడు. ఆ అసందర్భ ప్రేలాపన అర్థం కాక బుర్ర గొక్కుంటూ అతని పక్కనే ఉన్న అతని భార్య వైపు చూసా. సూర్పణకకి సిస్టర్లా ఉన్న ఆవిడని చూస్తే అర్థం అయ్యింది ఆయన ఎందుకు అలా అన్నాడో.
హాల్లొ జనాల చిరాకు చూపులు తట్టుకోలేక, థీయేటర్ వాడు వచ్చి తెర చింపినందుకు డబ్బులు అడుగుతాడేమో అన్న భయంతోను హాల్ బయటకు పారిపోయి వచ్చేసాం. సైకిల్ తీసుకుని త్వరగా థీయేటర్లోంచి బయట పడ్డాం.
పురాణాల్లోంచి పట్టుకువచ్చిన హీరో సైకిల్ మీద ఇంటికి బయలుదేరాం.
చరిత్ర ఎక్కువ ఉండడం వల్ల, సైకిల్ కి దానికి సంభందించిన భాగాలు పెద్దగా లేవు. అరిగిపోయిన టైర్లు, తుప్పు పట్టి ఏ నిముషమైనా విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఊసలు, బ్రేకులు లేని హాండిల్, కిర్రు కిర్రు మనే లెదర్ సీట్, తుప్పుతో గోధుమ రంగులోకి మారిన వెనక సీట్... ఇంతకు మించి యే ఆచ్చాదనా లేకుండా చాలా నిరాడంబరంగా ఉంది.
వెనక సీట్ మీద కూర్చుంటే అది ఎక్కడ విరిగి మడ్ గార్డ్ లేని టైర్ మీద పడుతుందో అని ఒక సారి పరిస్తితిని ఊహించుకుని, భయపడి ముందు అడ్డ రాడ్ మీద కూర్చున్నా.
ఈలేస్తూ శాస్త్రి ఎగిరి ఎగిరి తొక్కుతుంటే, గతుకుల్లో పడినప్పుడల్లా అడ్డ రాడ్ గుచ్చుకుని నరకం నాలుగించుల దూరంలో కనిపిస్తోంది.
ముందు కూర్చున్నానే కానీ భయం భయం గానే ఉంది. ఇది దెయ్యం గురించి భయం కాదు అంత కన్నా భయంకరమైనది. పుంత గట్టు మీద బ్రేకుల్లేని సైకిల్, దారికటూ ఇటూ ముసుగు వీరులు చెంబు పట్టుకుని యుద్దం చేస్తుంటే.. వారి మధ్య నుంచి మేము మహారాజుల్లా వెళ్తున్నాం. ఎదురుగా వేరే వాహనం వచ్చి మమ్మల్ని ఢీ కొని మేము ఒక పక్కకి పడిపోతే?
ఇలాంటి విపరీత ఆలోచనల నడుమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎలాంటి అవాంతరాలు లేకుండా మా ఇంటికి చేరాం.
సరే ఇక శాస్త్రిని సాగనంపి దొడ్లో నూతి దెగ్గరకు వెళ్ళి కాళ్ళు, చేతులు, మొహం కడుక్కుని వీధి వసారాలో మడత మంచం వాల్చుకు పడుకున్నా. నిద్ర సమయం దాటడం వల్ల, అతిగా కంగారు పడడం వల్ల అనుకుంటా పొడి కళ్ళు పడిపోయి నిద్ర రావట్లా.
అంజనేయస్వామి బొట్టు పెట్టుకుని వసారాలో పడుతున్న పున్నమి వెన్నెల చూస్తూ నిద్దురపోయా.
ఒరై బాబు లేరా అని నాన్నమ్మ అరుస్తున్న అరుపులకి మెళకువ వచ్చింది. 6:00 ఆయ్యింది. సూర్యుడు ఇప్పుడే మబ్బుల వెనక ఒళ్ళు విరుచుకుంటున్నాడు.
"ఇవాళ సంపూర్ణ సూర్య గ్రహణం అంట శాస్త్రిగారింటికి వెళ్ళి దర్భలు తీసుకురారా ఇంటి మీదా, డేగిసా నీళ్ళళ్ళోనూ వెయ్యాలి." ఈ వాక్యాన్ని నేను లేచేలోపు ఒక ఐదు సార్లు చెప్పింది. ఇక వినే ఓపిక లేక నిద్ర కళ్ళ తోనే శాస్త్రి ఇంటికి బయలుదేరా, తాత బండి మీద.
శాస్త్రి ఇంటి దెగ్గర మంచి కోలాహలంగా ఉంది, దర్భల గురించి అనుకుంటా.
బండి బయట గోడకు వాల్చి (స్టాండ్ లేదు) లోపలికి వెళ్ళా. లోపల అంతా హడావిడిగా ఉంది. ఒక మూల భూతాల రాజుగారు ఏదో పూజ చేస్తున్నారు, సాంబ్రాణి, వేప మండలాలు పట్టుకుని ఓం హ్రీం క్రీం అని అరుస్తూ పసుపునీళ్ళు జల్లుతున్నారు.
నేరుగా శాస్త్రి గదిలోకి నడిచా. శాస్త్రి ఒక చిన్న పసుపు తువ్వాలు కట్టుని, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, వరిపిండితో వేసిన ముగ్గు మద్యలో కూర్చుని ఉన్నాడు.
శాస్త్రికి మేనమామగారి వియ్యంకుడి పెదనాయనగారి అత్తగారి తోటికోడలి మేనత్తగారి పెళ్ళికావలసిన మనుమరాలు మరియు ఆమె దూరపు చుట్టాలైన ఓ ఇద్దరు ఆడాళ్ళు ముగ్గు పక్కన కూర్చుని యెవరో కొట్టి నట్టు ఏడుస్తున్నారు.
ఇదేమీ పట్టనట్టు శాస్త్రి ముగ్గు మధ్యలో బాసింపీట వేసుకు కూర్చుని ముందుకు వెనకకి ఊగుతున్నాడు. కళ్ళు గెట్టిగా మూసుకుని ఉన్నాడు.
శాస్త్రి పక్కకు వెళ్ళి అలవాటు ప్రకారం "ఒరై శాస్త్రీ" అంటూ టెంకి మీద ఒకటిచ్చుకున్నా. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని శాస్త్రి ముందుకు పడిపోయి ముగ్గు మొహానికి అంటుకుంది. దెబ్బకి ముక్కులోకి నోట్లోకి ముగ్గు వెళ్ళి ఉక్కిరిబిక్కిరి అయ్యిపోయాడు. కాస్త తేరుకున్నాక నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసాడు.
పక్కన ఉన్న ఏడుపు సంఘాన్ని బయటకి పొమ్మని సైగ చేసాడు. శాస్త్రిలో మార్పు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. చంద్రముఖి సినీమాలో రజనీకాంత్ ని చూసినట్టు నాకు ఒక నాటకీయమైన చూపు విసిరి బయటకు వెళ్ళారు.
వాళ్ళు అలా బయటకు వెళ్ళగానే బయట కోలాహల్మ్ మొదలయ్యింది, మద్యలో భూతాల రాజు మాటలు వినిపిస్తున్నాయ్... "అతను సామాన్యుడు కాదు, గొప్ప మనిషి మహా మేధావి, ఆయన ప్రయత్నం అయనను చెయ్యనివ్వండి, నా పని నెను చెస్తా" ఇవేవో చంద్రముఖి సినిమాలో డైలాగ్ లా అనిపించినా, దెయ్యం వదిలిపోయింది అంటే తనకు డబ్బులు ముట్టవు అని దెయ్యాల రాజు గారు ఇలా పధకం వేసారని అర్థం అయ్యింది.
శాస్త్రి జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.
రాత్రి నిన్ను మీ ఇంటి దెగ్గర దింపి బయలుదేరానా? దారిలో సర్వారాయుడు తోట దెగ్గర ఆగా, ఒంటేలుకొచ్చి. దెయ్యం సినిమా వల్లనో ఏమిటో చికటిలో కొంచెం భయంగానే ఉంది. అదేంటో తోట కంచె దెగ్గర ఈత చెట్టు ని చూడగానే నేను అప్రయత్నంగా ఆగిపోతా. ఈత చెట్టు మొదల్లో ఒక పాట పాడందే నా సైకిల్ ముందుకు కదలదు. నారు పెట్టినవాడే నీరు పోస్తాడంటారు. నారు పెట్టిన సర్వారాయుడు హైదరాబాదులో కూర్చుంటే నేను రోజూ ఇలా నీరు పెడుతున్నా. అది మొక్కగా ఉన్నప్పట్నుంచి ఈ రోజుదాకా దాని పోషణ భారం మొత్తం నాదే. సూర్యుడు సినిమాలో రాజషేకర్లా మొహం పెట్టి 'నీకేం పర్లేదు, నేనున్నా ! చుట్టుపక్కల 40 గ్రామాలు ఎండి పోయినా నిన్ను నేను కాపాడుకుంటా' అని కన్నీళ్ళుపెట్టుకుంటూ.. చెట్టుకి 'నీళ్ళు ' పెట్టా.
ఈల వేసుకుంటూ పైకి చూద్దునా చెట్టుకి రెండు పెద్ద ముగ్గిన గెలలు ఉన్నాయి. ఈత పళ్ళు బాగా ముగ్గి మంచి సువాసన వస్తున్నాయి. పొయ్యడం త్వరగా ముగించి చేతులు జేబులో ఒక సారి తుడుచుకుని బాగా ముగ్గిన పండు ఒకటి అందుకుని నోట్లో వెసుకున్నా. ఆహా ఈత చెట్టుకూడ హంస అంత గొప్పది. పాలు నీళ్ళు కలిపేసినా హంస కేవలం పాలు తాగి నీళ్ళు వదిలేస్తుందిట. ఈత చెట్టు అంతకన్న గొప్పది ! ఉప్ప నీరు లో ఉప్పు వదిలేసి కేవలం నీరు తేసుకుని తియ్యని పళ్ళు ఇవ్వగలదు. రెండు గెలలు కోసి సైకిల్ స్టాండుకి తాడుతో కట్టెసా. పక్కన ఉన్న ఈత చెట్టుకి కట్టి ఉన్న ఈత కల్లు కుండ దింపి ఒక గుటక వేసా. అటు ఇటు ఒక సారి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక మళ్ళి ఇంకో గుటక వేసా, మళ్ళి కుండ యధాస్థానంలో ఉంచి సైకిల్ మీద ఇంటికి బయలుదేరా.
తోట దాటగానే శ్మసానం, ఎప్పుడూ లేనిది ఎందుకో కొంచెం బెరుకుగా ఉంది. ఊహే భయపెడుతోంది. చీకట్లో జాగ్రత్తగా వెన్నల వెలుగులో వెళ్తున్నా. తోట దాటి శ్మసానం దెగ్గరకు వచ్చా.
దూరంగా రోడ్డుకి పక్కన ఏదో తెల్లగా కదులుతోంది. దెగ్గరవుతున్న కొద్దీ పెద్దదవుతోంది. నాకు గుండె దడ పెరుగుతూ పోతోంది. శ్మసానంలో కొరివి దెయ్యాలు ఇలాగే తెల్లగా ఉంటాయి అని చాలామంది 'చూసినవాళ్ళు ' చెప్పారు. నిప్పు దెగ్గర ఉన్నవాళ్ళని, ధైర్యంగా ఉన్నవాళ్ళని ఏమి చెయ్యవుట కొరివి దెయ్యాలు, రైతులు అందుకే రాత్రి పూట పొలాలకి వెళ్ళేటప్పుడు చుట్ట వెలిగించుకుని నోట్లో పెట్టుకుంటారు. నాకెమో చుట్ట అలవాటు లేదాయె. భయపడి వెనక్కి తిరిగి పోతే వెంటపడి కొడతాయని యెవరో చెప్పగా గుర్తుంది, అందుకే ఇంక వెనక్కి తిరిగి వెళ్ళిపోయే ఆలోచన మానుకున్నా.
దెగ్గర పడుతున్న కొద్దీ గుండె, చేతుల్లో కొట్టుకోడం మొదలు పెట్టింది. వేళ్ళళ్ళో గుండె నాడి కొట్టుకోవడం తెలుస్తోంది. చేతులు విపరీతంగా వణుకుతున్నాయి. దెయ్యం వైపు చూడటం మానేసి మానేసి తిన్నగా ద్రోవ వంక చూడటం మొదలుపెట్టా. దెయ్యనికి నేను ధైర్యంగా లేను, భయపడుతున్నా అని తెలిస్తే?? దెయ్యాలికి మంత్రాలు వస్తాయిగా కనిపెట్టేస్తుందేమో?? భయం రెట్టింపయ్యింది. సైకిల్ విమాన వేగంతో నడపడం మొదలు పెట్టా. దెయ్యం దెగ్గరకి వచ్చేటప్పటికి వేగం ఇంకా పెంచా.
అనుకున్నంత పనీ జరిగింది... దెయ్యం నా వీపు మీద కొట్టడం మొదలు పెట్టింది, మొదట చిన్న శబ్దంతో మొదలు పెట్టి పెద్ద పెద్ద శబ్దాలు చెయ్యడం పెట్టింది. దానితో పాటు నడ్డి మీద గెట్టిగా మొదలు పెట్టింది. నా వేగం పెరిగే కొద్ది, దాని కోపం పెరిగి పొతున్నట్టుంది. ఇంకా వేగంతో కొడుతోంది. నేను దాదాపు ఎగురుతున్నంత వేగంతో ఇంటి దెగ్గరకు చేరా. అదే వేగంతో వెళ్లి మా తడికెలా గోడని గుద్ది ఇంటి అరుగుమేద పడ్డా. అరుగుమేద పడుక్కున్న గుడ్డి మామ్మ టక్కుమని లేచి నడ్డి మేద ఒకటి వేసింది దొంగాడనుకుని. ముసల్దేకాని చాలా గెట్టిగా కొట్టింది. తాత అలాగేపోయాడేమో. నేను స్ప్రుహ తప్పి పడిపోయా. నేను భయంతో మ్రాంపడిపోయేటప్పటికి, భూతాల రాజుని రప్పించి ఇలా పోజలు చేయిస్తున్నారు నాకు దెయ్యం కని పట్టిందేమొ అని.
మరి దెయ్యం లేదు గియ్యం లేదు నేను బాగానే ఉన్నా, ఊరికే దెయ్యాల రాజుకి డబ్బులు దండగ చెయ్యొద్దు అని చెప్పు అన్నా.
శాస్త్రి ఏమి మాట్లాడలేదు.
సరే నేను బయలుదేరుతున్నా ఏమినా తిని కాస్త నిద్రపో అన్నీ తగ్గుతాయి అని చెప్పి పక్కన ఉన్నా దర్భలు తీసుకుని గదిలోంచి బయట పడ్డా. నన్ను చూడగానే దెయ్యాల రాజు "కపాలి... మొండీ.. సిఖండి... చాముండి..." అంటు అరవడం మొదలు పెట్టాడు. వాడు చెస్తున్న హడావిడికి నాలో నేనే నవ్వుకుంటూ ఇంటి బయటకు చేరుకున్నా. అక్కడి జనాలు మాత్రం నా నవ్వుని వేరేలా అర్థం చేసుకున్నారు. మళ్ళీ చంద్రముఖి.బయట తడికెల ప్రహరీ గోడలో శాస్త్రి సైకిల్ ఇంక అలాగే ఉంది. ముందు చక్రం మొత్తం తడికెల్లో ఇరుక్కు పోయింది. వెనక్కాల రెండు ఈత గెలలు ఒక్క పండు లేకుండా ఖాలీ అయ్యిపోయాయి. జనాలు శాస్త్రి కోసం వచ్చారా.. ఈత పళ్ల కోసం వచ్చారా??
బండి మీద ఇంటి దారి పట్టా. వచ్చేటప్పుడ్ గమనించలేదుకానీ దారి అంతా ఈత పళ్ళు పడున్నాయి. శ్మశానం దెగ్గరయ్యింది, కాస్త ఒళ్ళు జలదరించడం మొదలు పెత్తింది. ఇప్పుడే శాస్త్రి ని చూసి వస్తున్నానుగా అందుకేమో.
రోడ్డుకి అటు ఇటూ చూసుకుంటూ వెళ్తున్నా. ఎందుకో అనుమానం వచ్చి ఆగిపోయా ! ఈత పళ్ళు రోడ్డు మీద ఇంక లేవు. రోడ్డు పక్కన పెద్ద మైలు రాయి కొత్తగా పెట్టారు, ఇంకా పేరు కూడా రాయకుండా తెల్లగా మెరిసిపోతోంది.
యురేకా ! గెట్టిగా అరిచా. పక్కనే రోడ్డుమీద వెళ్తున్న అమ్మాయి. ఒక్కసారిగా ఆగిపోయింది. అవును నేను రేఖనే.. అరవడం మొదలు పెట్టింది. అయితే ఏంటంటా? మొన్న వేరన్న తోటలో బుజ్జితో ఉన్నది నేనే, మేము ప్రేమించుకుంటున్నాం, నీకేంటంట? మా ఇష్టం.
బండిని మళ్ళి పరిగెత్తించా ఈసారి భయంతో కాదు పైపెచ్చు ఒక చిన్న నవ్వుతో. ఈ నవ్వు మాత్రం చంద్రముఖిలో దెయ్యాన్ని కనిపెట్టిన తరువాత రజనీ లాగే.....
నిన్న రాత్రి శాస్త్రికి ఏమి జరిగిందో కళ్లముందు సినిమాలా కనపడసాగింది.
శాస్త్రి రాత్రి కల్లు తాగి శ్మశానం దెగ్గరికి వచ్చేటప్పటికి కాస్త మత్తు తలకెక్కింది. అసలే చీకటి, ఆపై కల్లు, మసక వెన్నెల్లో కొత్త మైలు రాయి దెయ్యంలా కనిపించింది. వేగంగా సైకిల్ తొక్కేటప్పటికి ఈత గెలలు సైకిల్ చెక్రంలో పడి మడ్ గార్డ్ లేకపోవడం వల్ల ఈత పళ్ళు పైకి లేచి శాస్త్రి నడ్డికి తగలడం మొదలు పెట్టాయి. దెయ్యం కొడుతోంది అనుకున్న శాస్త్రి వేగం పెంచడంతొ, మరింత వేగంగా ఈత పళ్ళు తగలడం మొదలుపెట్టాయి.
హి హి హి .. దెయ్యంకన్నా భయం మా చెడ్డది !
సంపూర్ణం.
కధ కంచికి, నేను, చెన్నైకి.
(ట్రైన్లో చెన్నై వెళ్తూ వ్రాసిన కధ)