Monday, October 14, 2013

రాజ్యం దోపిడీదారుల భోజ్యం - జాహ్నవి

ప్రతి దోపిడీ వెనుక రాజ్యం, లేదా రాజ్యాన్ని ఆసరా చేసుకుని బ్రతికే శక్తులే ఉంటాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం దోపిడీ కాదు. ఈ విషయాల్లో తప్పుడు మార్క్సిస్టు అవగాహనల నుంచి బయటపడితే తప్ప దోపిడీ మూలాలను గుర్తించడం, వర్గ చైతన్యం పెంచుకుని, దోపిడీకి వ్యతిరేకంగా జతకట్టి పోరాడడం సాధ్యం కాదు. ప్రజలు కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీల్లాంటి కృత్రిమ విభజనలకు లోనై తమలో తాము కలహించుకుంటూ అసలు దొంగైన రాజ్యాన్నే ఆశ్రయించి న్యాయం కోరడం, తీర్పు చెప్పమనడం హాస్యాస్పద విషాదం.
డబ్బు సంపాదించడానికి రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి, కష్టపడాలి, సంపాదించాలి, కొంత వాడుకుని మిగతాది పొదుపు చెయ్యాలి, దాన్ని మదుపు చెయ్యాలి (పెట్టుబడి పెట్టాలి), వచ్చిన లాభంలో కొంత వాడుకుని మిగతాది పొదుపు, మదుపు.. ఇలా. అటువంటివారు సంపద సృష్టికర్తలు. ఇతరులె వరినీ నష్టపెట్టకుండా యాంత్రీకరణ, పని విభజన, కొత్త సాంకేతిక ఆవిష్కరణల ద్వారా సంపద సృష్టించి లోక కళ్యాణానికి కారకులవుతారు. రెండో మార్గం-పైవన్నీ చేసి సంపాదించిన వాళ్ళ దగ్గర్నుంచి లాక్కోవడం. మానవజాతికి రెండు మార్గాలు సాధ్యమే. సంపద సృష్టించేవారు చిన్న స్థాయి మొదలుకుని, వ్యాపార, ఉత్పత్తి సంస్థలుగా, బహుళజాతి కంపెనీలుగా విస్తరిస్తారు. అలాగే లాక్కుని తినేవాళ్ళు కూడా దొంగల ముఠాలుగా, రాజకీయ పార్టీలుగా, ప్రభుత్వాలుగా, రాజ్యాలుగా ఏర్పడి ఎవరూ కన్నెత్తి చూడలేనంత పెద్ద పెద్ద సంస్థలుగా రూపొందుతారు.
అవి క్రమేపీ తమ పరిధులను విస్తరించుకుని, ఊడలు తీరిన మహావృక్షాలవుతాయి. ఈ వాస్తవిక కోణం నుంచి చూస్తే చరిత్ర అంతా కష్టపడి సంపాదించే వర్గం ఒకవైపు, వారిని దోచుకుని తినే పాలక వర్గం రెండోవైపు ఉండి, ఈ రెండు వర్గాల మధ్య జరిగిన సంగ్రామాల సమాహారంగా కనిపిస్తుంది. కాబట్టి, చరిత్రను వివరించడానికి వివిధ కాలాల్లో ఉన్న స్వేచ్ఛ, దోపిడీ పాళ్ళు, పరాన్నజీవితాలు, ఆర్థిక అణచివేత, ఆస్తి హక్కులు, వాటిని కాలరాసిన తీరు లేదా రక్షించిన సంస్కృతి-ఇవే ప్రధానాంశాలు కావాలి. అలా కాకుండా చరిత్రను రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, కట్టడాల రూపంలో వివరిస్తే, అది సారంలేని విశ్లేషణ, వృథా ప్రయాస అవుతుంది.
కొద్దిమందితో కూడిన పాలక వర్గం అసంఖ్యాక ప్రజా శ్రేణుల్ని శాసిస్తూ, దోపిడీ చెయ్యాలంటే, ప్రజల్లో వర్గ చైతన్యం చాలా నిమ్న స్థాయిలో ఉంచాలి. అంటే తాము దోపిడీకి గురవుతున్నామన్న విషయం, అది ఏ విధంగా జరుగుతోంది అన్న వివరాలు ప్రజలకు తెలియకూడదు, వాటిపై ప్రజల్లో విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయం రాకూడదు. వస్తే పాలకవర్గం పట్ల వ్యతిరేకతకు, విప్లవానికి దారితీస్తుంది, కొంపమునుగుతుంది. వర్గ చైతన్యం ప్రబలకుండా తీసుకునే జాగ్రత్తల్లో మొదటిది ఒక రాజ్యంగా, వివిధ చట్ట సంస్థలు, చ ట్టాలు ఏర్పరచడం. దాని ద్వారా సమాజంలో శాంతి, సుస్థిరతలు ఏర్పడతాయని బయటకు చెబుతారు. నిజానికి సుస్థిరమయ్యేది పాలకవర్గం, వారి ప్రత్యేక స్థానం, వారి విశేష అధికారాలు. ప్రజాదరణ కలిగిన సమానత్వం, స్వేచ్ఛ, ఆస్తి హక్కు లాంటి భావాలను పొందుపరుస్తూనే, పాలకవర్గాల ప్రత్యేక అధికారాలను, పాలితుల పరిమితులను చట్రాల్లో బిగించేస్తారు. ఉదాహరణకు పేరుకు ఆస్తి హక్కు ఉంటుంది, కానీ ప్రభుత్వం దానిమీద ఇష్టమొచ్చిన పన్నులు వేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు జాతీయం చెయ్యొచ్చు. అందరూ సమానమే కానీ మంత్రులు, అధికారులు, రాష్ట్రపతి, గవర్నర్లు, జడ్జీలు ఎవరూ ప్రశ్నించలేనంత ప్రత్యేక రక్షణలు కలిగి ఉంటారు.
స్వేచ్ఛ ఉంటుంది, కానీ ప్రభుత్వం ఎప్పుటికప్పుడు నిర్ణయించే పరిమితుల మధ్య మాత్రమే అనుభవించగలం. పాలితుల విషయంలో అమలయ్యే చట్టాలు, విధానాలు తమకు వర్తించకుండా చూసుకుంటారు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, పాలకవర్గ ప్రయోజనాలకు మధ్య పేచీ వస్తే పాలకవర్గమే గెలిచేలా చట్టాలు రాసుకుంటారు. ప్రజల కష్టఫలం నుంచి కావలసినంత భాగం పన్నులు, సెస్సుల రూపాల్లో లాక్కోవడానికి ప్రశ్నించజాలని విశేషాధికారాలు కల్పిస్తారు. ఆ విధంగా కష్టపడే వారికి వారి కష్టఫలం మీద, వ్యక్తులకు వారి శరీరాల మీద హక్కు లేకుండా చేస్తారు. అదే అసలైన దోపిడీ. మార్క్సు దీన్ని ఎత్తి చూపకుండా, అదనపు విలువ, అదనపు శ్రమ సిద్ధాంతాల భ్రమలో కొట్టుకుపోయాడు. ఆస్తి హక్కులను చట్టపరంగా గుర్తించడం ద్వారా దోపిడీ వర్గాలు వర్గ న్యాయాన్ని (ఇజ్చూటట ఒఠట్టజీఛ్ఛి) అనుసరిస్తాయన్న మార్క్సు వివరణ శుద్ధ తప్పు. పాలకవర్గం తన వర్గ న్యాయాన్ని నిజానికి ఎలా అమలు చేస్తుందంటే - తాము కష్టపడకుండా తిని కూర్చోవడానికి వసూలు చేసే దాన్ని పన్నులంటుంది. అదే పని ప్రైవేటు వ్యక్తులు చేస్తే దాన్ని దొంగతనంగా జమకడుతుంది. ఈ వైరుధ్యం ద్వారా మాత్రమే పాలకవర్గ న్యాయం అమలవుతుంది.
దోపిడీ విధానాన్ని గుర్తించి, వివరించడంలో విఫలమైనా, రాజ్యం యొక్క మౌలికమైన దోపిడీ స్వభావాన్ని మార్క్సు సరిగానే గుర్తించాడు. సంక్షేమం పేరుతో సంపద పునఃపంపిణీ వ్యూహాల ప్రాముఖ్యతను, వాటి వెనుక ఉండే అసలు ఉద్దేశాలను కూడా సరిగానే గుర్తించాడు. సంక్షేమ పథకాలను కార్మిక వర్గానికి విసిరే రొట్టెముక్కలుగా అభివర్ణిస్తూ, వాటి కోసం ఆశపడి, విప్లవ అవసరాన్ని మరువవద్దని తన కరపత్రాల ద్వారా బోధించాడు. నిజానికి సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశం పాలిత ప్రజల్లో వర్గచైతన్యం పెరక్కుండా చూసుకోవడం, ప్రజల్లో రకరకాల విభజనలు తెచ్చి, అందరూ కలిసిపోకుండా, దోపిడీ వర్గానికి ఎదురు తిరగకుండా నిలువరించడం. ఈ వ్యూహపు ఫలితాలు కళ్ళెదుటే ఉన్నాయి. 'తింటే తిన్నాడు, మనక్కూడా కొంచెం పెట్టాడు కదా!' అనే ఆలోచనలు దీనికి రుజువు. పాలకవర్గ పదవులను ప్రజాస్వామీకరించి, తలా ఒక పదవి పడెయ్యడం కూడా ప్రజల్లో వర్గచైతన్యాన్ని తగ్గించి, విభజనలు సృష్టించే వ్యూహంలో భాగమే. అందుకే కొత్త పదవుల సృష్టి జరుగుతూనే ఉంటుంది. మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, శాసనమండలి పునఃప్రతిష్ట, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, చివరికి ఆదర్శ రైతులు - ఇవన్నీ ఆ ప్రయత్నాలకు సాక్ష్యాలే.
మార్క్స్ కూడా సరిగ్గానే గుర్తించినట్లుగా ప్రచారం, ప్రాపగాండా, మభ్యపెట్టే కళల్లో రాజ్యం ఆరితేరింది. దోపిడీని నిజమైన స్వేచ్ఛగా నమ్మిస్తుంది. అవి నిర్బంధ పన్నులు కావు, స్వచ్ఛంద విరాళాలంటుంది. అది పౌర బాధ్యత అంటుంది. ఎవరూ ఎవరినీ పాలించడం లేదు, మనల్ని మనమే పాలించుకుంటున్నామని నమ్మబలుకుతుంది. వీటన్నిటికీ అంతులేని నిధుల్ని, తన శక్తియుక్తుల్ని వెచ్చిస్తుంది. రూ.500 కోట్లతో భారత్ నిర్మాణ్ ప్రచార భేరి ఇందులో భాగమే. ప్రాథమిక స్థాయి నుంచి పాఠ్యాంశాలను రాజ్యమే నిర్దేశించడానికి కారణమిదే. తద్వారా పాలకవర్గ సర్వసత్తాకతకు ఎక్కడా భంగం కలగకుండా, ఎటువంటి విరుద్ధ భావనలూ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పుడన్నా ఏదన్నా సంక్షోభం ఎదురైతే, సంపాదించేవారి స్వార్థాన్ని ఎత్తిచూపి, సరిపడా పన్నులు కట్టడం లేదని ఆడిపోసుకుంటారు. అంతేగానీ, పార్లమెంటు సభ్యులకు మూడొందల కోట్ల మార్కెట్ విలువ గలిగి, ఎకరం భూమిలో కట్టిన బంగ్లాలు, రాష్ట్రపతికి మూడొందల యాభై ఎకరాల ఎస్టేటు ఎందుకు అవసరమో పొరపాటును కూడా చర్చలోకి రానీయరు.
చివరగా, రాజ్యానికి, వ్యాపారస్తులకు - ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మార్క్సు ఎత్తిచూపడం సరైనదే. కానీ దాన్ని వివరించడంలో తప్పుడు అవగాహన చూపాడు. రాజ్యం ఆస్తి హక్కుల్ని కాపాడుతుంది కాబట్టి వ్యాపార వర్గాలు రాజ్యం మీద ఆధారపడుతున్నాయన్నాడు. అది శుద్ధ తప్పు. వాస్తవం దానికి పూర్తి విరుద్ధం. నిజానికి రాజ్యం రకరకాల రాజ్యాంగ అధికరణలు, చట్టాలు, పన్నుల వ్యవస్థల ద్వారా ఆస్తి హక్కులను కాలరాస్తుంది కాబట్టే వ్యాపార వర్గాలు రాజ్యం పంచన చేరతాయి. కొందరేమో తమ ఆస్తులను రాజ్యం లాక్కోకుండా చూసుకునేందుకు, కొందరేమో లైసెన్సులు తెచ్చుకుని లాభపడేందుకు, మరికొందరు రాజ్యం అండతో తమకు పోటీ లేకుండా చూసుకునేందుకు ఆశ్రిత పెట్టుబడిదారులవుతారు. కొన్ని దశాబ్దాల పాటు బజాజ్ స్కూటర్లు, అంబాసిడర్ కార్లు పోటీ అనేదే లేకుండా బ్లాకులో అమ్ముడయ్యేవి. తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ వాతావరణం 'అనుమతించే' సరికి అవేమయ్యాయి? కనుమరుగయ్యాయి.
ఒక రంగంలో గుత్తాధిపత్యాలు పోయి, పోటీ వాతావరణం వచ్చినా, రాజ్యం తన దోపిడీని వేరే రంగాలకు మళ్ళించింది. జలయజ్ఞం, స్పెక్ట్రమ్, బొగ్గు బ్లాకులు, కేజీ బేసిన్ కట్టబెట్టడాల ద్వారా ఊహాతీతమైన స్థాయిలో దోపిడీకి పాల్పడింది. అది బయటపడి వివాదాస్పదమైంది కాబట్టి ఇప్పుడు దోపిడీ ఇంకో రంగానికి మళ్ళుతుంది. మనకు తెలిసే లోగా గుటకాయ స్వాహా అయిపోతుంది. అందుకే వ్యాపార రంగం రాజ్యాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి ఆశ్రిత పెట్టుబడిదారీతనం ఒక నిరంతర వాస్తవం. రిజర్వు బ్యాంకు ఆధీనంలో బ్యాంకింగ్ రంగం వ్యాపార వర్గాలకు కృత్రిమమైన తక్కువ వడ్డీకి రుణాలందిస్తుంది. ప్రభుత్వానికి అవసరమైనన్ని నోట్లు ముద్రిస్తుంది. నగదు నిష్పత్తుల నిరంతర సవరణల ద్వారా బ్యాంకులు గాల్లోంచి డబ్బు సృష్టించే వెసులుబాటు కల్పిస్తుంది. ప్రజలు ఈ విష వలయం నుంచి తప్పించుకునే వీలు లేకుండా ఆదాయ పన్ను చట్టాలు, బంగారం మీద నియంత్రణ చట్రాలు గట్టిగా బిగిస్తుంది. అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలంటుంది. దాంతో ప్రతి లావాదేవీ పైనా రాజ్యం పెత్తనం ఉండి, ఎక్కడ కావాలంటే అక్కడ పన్ను విధించి దోచుకోవచ్చు.
ఇదీ అసలు దోపిడీ జరుగుతున్న విధానం. దోపిడీ శక్తుల వివరణ. ప్రతి దోపిడీ వెనుక రాజ్యం, లేదా రాజ్యాన్ని ఆసరా చేసుకుని బ్రతికే శక్తులే ఉంటాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం దోపిడీ కాదు. ఈ విషయాల్లో తప్పుడు మార్క్సిస్టు అవగాహనల నుంచి బయటపడితే తప్ప దోపిడీ మూలాలను గుర్తించడం, వర్గ చైతన్యం పెంచుకుని, దోపిడీకి వ్యతిరేకంగా జతకట్టి పోరాడడం సాధ్యం కాదు. ప్రజలు కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీల్లాంటి కృత్రిమ విభజనలకు లోనై తమలో తాము కలహించుకుంటూ అసలు దొంగైన రాజ్యాన్నే ఆశ్రయించి న్యాయం కోరడం, తీర్పు చెప్పమనడం హాస్యాస్పద విషాదం. మనం ఇరుక్కుపోయిన ఈ సాలెగూడు నుంచి తప్పించుకోవడమెలానో వచ్చేసారి చూద్దాం.
- జాహ్నవి

విభజన ప్రక్రియ, విపరీత రాజకీయాలు - ఆర్కే

తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అందులో న్యాయం ఉందని భావించారు. అందుకే తెలంగాణకు అనుకూలంగా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం రగలడంతో ఆయా పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. అయితే బాధ్యతగల రాజకీయ పార్టీలు వైఖరులు మార్చుకోకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలి. విభజనను కొంతకాలం అడ్డుకోగలరు గానీ ఎంతో కాలం కాదని అందరికీ తెలుసు. అయినా ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారు. ఎంతకాలం ఇలా? కేంద్ర ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరించకుండా సీమాంధ్రకు చెందిన నాయకులతో సమస్యలపై చర్చల ప్రక్రియ ప్రారంభిస్తే పరిస్థితులు శాంతిస్తాయి.

రాష్ట్ర విభజన 2014 ఎన్నికలలోపు జరుగుతుందా? లేదా? ఇదే ఇప్పుడు తెలుగు ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు మాత్రం "మీ ఇష్టం. మీరు ఎలాగైనా ఊహించుకోండి'' అన్నట్టుగా భిన్న ప్రకటనలు చేస్తూ, ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ హడావుడిగా విభజన ప్రకటన చేయడమే తప్పు అనుకుంటే సీమాంధ్ర ప్రజల ఆందోళనను ఖాతరు చేయకుండా, వారిని సంతృప్తిపరచకుండా ఎన్నికలలోపే విభజన ప్రక్రియ పూర్తిచేయాలనుకోవడం రెండో తప్పు. వాస్తవానికి తెలంగాణవాదులు సైతం ఎన్నికలలోపే రాష్ట్రం ఏర్పడుతుందని భావించలేదు. తెలంగాణ ఇవ్వబోతున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటిస్తే చాలు అని ఆశించారు. అయితే రాష్ట్రంలోని ఉభయ ప్రాంతాలలో రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో తెలంగాణలోనైనా రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ విభజన ప్రకటన చేసింది.
దీంతో సీమాంధ్ర ప్రజలలో మా పరిస్థితి ఏమిటన్న ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితులలో ప్రజలను సంతృప్తిపరచవలసిన కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు పూటకో మాట చెబుతూ మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్ర నాయకులకు కూడా రుచించడం లేదు. ఇటీవల జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని బి.జె.పి. అగ్ర నేత ఎల్.కె.ఆడ్వాణీ పలకరించి "ఇదేమిటి- విభజన విషయంలో మీ పార్టీ ఇంత గందరగోళంగా వ్యవహరించింది'' అని అడిగారు. ఆడ్వాణీ మాత్రమే కాదు చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. విభజనకు సంబంధించిన అంశం శాసనసభ ముందుకు రెండుసార్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ ప్రకటించగా, అదేమీ లేదు ముసాయిదా బిల్లు మాత్రమే పంపుతామని హోం మంత్రి షిండే ప్రకటించారు. ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రకటనలు సీమాంధ్ర ప్రజలను బాధిస్తున్నాయి. తెలంగాణ కోసం ఇంతకాలంగా పరితపించిన తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచినట్టుగానే సమైక్యంగా ఉండాలని ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజలను కూడా సంతృప్తిపరచడానికి చర్చలు జరపవలసిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది.
అయితే అదేమీ చేయకుండా "మీ గురించి మేం ఆలోచిస్తాం'' అని అనడంలో ఔచిత్యం ఏమిటి? అదే సమయంలో విభజన ప్రక్రియకు గడువు లేదనీ, 2014 ఎన్నికలలోపు లేదా తర్వాత కూడా జరగవచ్చునని ఒకరు ప్రకటిస్తే, డిసెంబర్ లోపు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే 'గడువు' అనే పదాన్ని తొలగించామని మరొకరు అంటారు. అంటే మరో నెలన్నరలోపు విభజనతో ముడిపడి ఉన్న అన్ని అంశాలనూ పరిష్కరిస్తారని భావించాలి. శీతాకాల సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టాలంటే నవంబర్ చివరి నాటికి బిల్లుకు తుది రూపం ఇవ్వాలి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అంటున్నారని కాదు కానీ, విభజనకు సంబంధించి సంక్లిష్టమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ఢిల్లీలో కూర్చుని వాటిని పరిష్కరించాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. హైదరాబాద్ విషయంలో సీమాంధ్ర ప్రజల మానసిక అనుబంధాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.
హైదరాబాద్ భౌగోళికంగా తెలంగాణలోనే ఉండవచ్చు గానీ, 'ఈ నగరం మా రాజధాని' అని సీమాంధ్రులు ఇంతకాలంగా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు మీది కాదనడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో తెలంగాణవాదులు కొందరు సూటి పోటి మాటలు అంటున్నారు. హైదరాబాద్‌లోనే కాదు- తెలంగాణ జిల్లాలలో ఉంటున్న సీమాంధ్రులను అక్కడి తెలంగాణ ప్రజలు తెలిసో తెలియకో "మీరు ఎప్పుడు వెళ్లిపోతున్నారు'' అని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారిలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి. విభజన విషయంలో వెనక్కి వెళ్లేది లేదని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు, ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాలలో ఉన్న సీమాంధ్రుల ఆస్తులకు, జీవితాలకు భరోసా కల్పించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటే సమస్యను సాఫీగా పరిష్కరించవచ్చు. "మాకు హైదరాబాద్‌లో రెండు పోర్షన్ల ఇల్లు ఉంది.
అందులో ఒక పోర్షన్‌లో తెలంగాణ వ్యక్తి అద్దెకు ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన ప్రకటన చేసిన తర్వాత అద్దె ఇవ్వడానికి ఆయన నిరాకరిస్తున్నారు. మీరు ఎలాగూ మీ రాష్ట్రానికి వెళ్లిపోతారు కనుక ఈ ఇల్లు నాదే అవుతుందని సదరు తెలంగాణ వ్యక్తి వాదిస్తున్నారు'' అని సీమాంధ్రకు చెందిన ఒక వ్యక్తి వాపోయారు. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సీమాంధ్రులలో నెలకొన్న ఈ అభద్రతా భావాన్ని తొలగించడానికి ఏమి చర్యలు తీసుకోబోతున్నారో లీకుల రూపంలోనైనా కేంద్ర పెద్దలు వెల్లడిస్తే సీమాంధ్రలో పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉంది.
- ఆశ.. భయం.. ఉద్యమం!
వాస్తవానికి విభజన వల్ల తెలంగాణ ప్రజలకు ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. అదే సమయంలో సీమాంధ్రులు భయపడుతున్నట్టు వారికి జరిగే నష్టం కూడా అంతగా ఏమీ ఉండదు. మనుషులకు ఉండే బలహీనతలలో ప్రధానమైనవి ఆశ- భయం. ఈ రెండింటినీ ఆసరాగా చేసుకునే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ప్రజలలో అంతులేని ఆశలు కల్పించారు. మొదట్లో అన్యాయానికి, దోపిడీకి గురవుతున్నారని తెలంగాణ ప్రజలను భయపెట్టిన కె.సి.ఆర్., తర్వాత క్రమంలో ఆశలు కల్పించి పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకున్నారు. 2004 ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే ప్రజలను భయపెట్టారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు మళ్లీ పెంచేస్తారని భయపెట్టి అధికారంలోకి వచ్చారు. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే తెలంగాణను అమ్మాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటుకు ఆయన చేసిన పోరాటం కారణం కావచ్చు గానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన పాత్ర ఏమిటనేది ప్రశ్నార్థకం.
అది తెలిసి కూడా ఆయన నోరు పట్టకుండా హామీలు గుప్పిస్తూ ఉంటారు. ప్రజలు అమాయకంగా వాటిని నమ్ముతున్నారు కూడా. "మా తెలంగాణ మాకు ఇవ్వండి'' అని చంద్రబాబునాయుడిని ముఖం మీదే అడగడం ద్వారా అప్పట్లో సంచలనం సృష్టించిన ఫణికర మల్లయ్యను, తెలంగాణ వస్తే నీకు కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించగా, 14వ తరగతి అంటే డిగ్రీ చదువుతున్న తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని బదులిచ్చారు. డిగ్రీ చదివినంత మాత్రాన సర్కారీ కొలువు ఎలా వస్తుందనుకుంటున్నావు అని అడిగితే "గంతేనా! వాళ్లు గట్లనే చెబుతున్నారు. అందుకే నమ్ముతున్నాను'' అని ఆయన అన్నారు. మల్లయ్య ఉదంతాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే ఆయనను ఉద్యమ నాయకులు వాడుకున్నారే గానీ, ఆయనకు ఉపయోగపడలేదు. మల్లయ్యకు రెండు ఎకరాల భూమి కొని ఇస్తానని రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీని కె.సి.ఆర్. ఇంతవరకు నిలబెట్టుకోలేదు. తెలంగాణ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మల్లయ్యను వాడుకున్నారు. ఆయన చేతులతో పత్రికను ప్రారంభింపజేశారేగానీ జేబులో పది రూపాయలు కూడా పెట్టలేదు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా, విడిపోయినా పేదవాళ్ల జీవితాలు ఇలాగే ఉంటాయి.
దోపిడీ ఏదో రూపంలో, అది ఏ సమాజంలోనైనా ఉంటూనే ఉంటుంది. తెలంగాణ వాళ్లతో పోల్చితే ఆంధ్రావాళ్లకు ఎంటర్‌ప్రైజింగ్ నేచర్ ఎక్కువ. దీంతో అందుబాటులో ఉన్న అవకాశాలను వాళ్లు ముందుగా అందిపుచ్చుకున్నారు. రేపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందున్న వర్గాలవారు ఈ పనిచేస్తారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు హైదరాబాద్ విద్యార్థులతో ఉద్యోగాల కోసం పోటీ పడలేరు. పేదవాడి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. వెనుకబాటుతనంలో ఉన్నవాళ్లు వెనుకబడే ఉంటారు. వాస్తవం ఎలా ఉండబోతున్నా తెలంగాణ ప్రజలలో ఎన్నో ఆశలు కల్పించారు కనుక వారు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారు. అదే సమయంలో తమ సంపదను ఆంధ్రావాళ్లు దోచుకున్నారన్న అనుమానాన్ని కూడా వారిలో కల్పించారు. దీంతో రాష్ట్రం విడిపోతే సీమాంధ్రుల ఆస్తులు తమకు దక్కుతాయని తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్ముతున్నారు. అలా నమ్మేలా చేసింది కూడా కొంతమంది ఉద్యమ నాయకులే! తెలంగాణ ఏర్పడితే ఒకరికి ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది.
కొన్ని వందల మందికి ప్రభుత్వ పదవులు లభించవచ్చు! తెలంగాణ ఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రకటననే తీసుకుందాం. తెలంగాణ ఏర్పడ్డాక లక్ష ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. వాస్తవంలో అది జరిగే పనేనా! అన్ని ఖాళీలు లేనప్పుడు ఎలా భర్తీ చేస్తారు? తెలంగాణ వస్తే కాంట్రాక్టు కార్మికులనందరినీ పర్మినెంట్ చేస్తానని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని కె.సి.ఆర్. ప్రకటిస్తున్నారు. ఇలాంటివి ఎలా సాధ్యమని ఏ ఒక్కరూ ప్రశ్నించరు! ఎందుకంటే వారిలో ఏర్పడుతున్న ఆశే కారణం. తెలంగాణ ఏర్పడితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో పాటు ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్‌లో అవకాశాలు పెరుగుతాయి. చదివిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం లభించదు. సమర్థవంతమైన, నిబద్ధతగల నాయకత్వం చేతిలో తెలంగాణ ఉంటేనే అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇక సీమాంధ్ర ప్రాంతం వారిలో నెలకొన్న భయాందోళనల విషయానికి వద్దాం. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని అక్కడి వాళ్లను భయపెడుతున్నారు.
అందులో వాస్తవం ఎంత అని ఎవరూ ఆలోచించడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో వర్షాలు పడి నీరు సమృద్ధిగా ఉంటే తెలంగాణ వాళ్లు ఆ నీటిని ఆపలేరు కదా? వర్షాలు కురవకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు? భౌగోళికంగా చూస్తే తెలంగాణలో సాగునీటి వసతి కల్పించాలంటే ఎత్తిపోతల పథకాలే శరణ్యం. కృష్ణా నీటి ఆధారంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. అలా కాకుండా దిగువకు నీళ్లు వెళ్లకుండా ప్రాజెక్టులు కట్టాలంటే మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా భాగం ముంపునకు గురవుతుంది. గోదావరి నది విషయంలో కూడా పరిస్థితి ఇంతే! అందుకే ప్రాణహిత- చేవెళ్ల, దేవాదుల వంటి ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. ఉద్యోగాల విషయానికి వద్దాం. ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఒకప్పుడు ఎక్కువగా ఆధారపడేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రైవేటు ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఉపాధి అవకాశాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయనేది వాస్తవం. హైదరాబాద్‌లో ఉన్న ప్రైవేటు సంస్థలు తమకు అవసరమైన అర్హత ఉన్నవారినే ఉద్యోగాలలోకి తీసుకుంటాయి గానీ, ప్రాంతాలను బట్టి కాదు. ఏ ప్రాంతానికి చెందినవాళ్లు అయినా, తెలుగువాళ్లు మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఇప్పుడు వెళ్లడం లేదా? వాస్తవానికి రాష్ట్రం విడిపోతే కొత్త రాజధాని ఏర్పడే ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తమ ఆస్తులకు రక్షణ ఉంటుందా? అని సీమాంధ్రులు వ్యక్తంచేస్తున్న సందేహాల విషయానికి వద్దాం. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సీమాంధ్రకు చెందిన వారిపై దాడులు కూడా జరిగాయి. ఆ ఉద్యమం చల్లబడిన తర్వాత అందరూ అన్నీ మర్చిపోయి కలిసిమెలసి ఉంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అంతే! ఒక్కసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాధాన్యాలు మారిపోతాయి. తెలంగాణ ప్రజలలో కల్పించిన ఆశలను తీర్చలేక ప్రభుత్వాలు సతమతమవుతాయి. విద్వేషాలు రెచ్చగొడుతున్న నాయకులు అప్పుడు తెరమరుగయ్యే అవకాశం ఉంది. అయితే విభజన వల్ల సమస్యలే ఉండవా అంటే కొన్ని ఉంటాయి. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. పరస్పరం సహకరించుకోకుండా ఉభయ ప్రాంతాలూ మనుగడ సాగించలేవు. ఈ వాస్తవాన్ని చెప్పడానికి ఇటువాళ్లు గానీ, అటువాళ్లు గానీ ఇప్పుడు సిద్ధంగా లేరు. ఎందుకంటే వారికి ఇప్పుడు కావలసింది 2014 ఎన్నికలలో ప్రయోజనం పొందడమే! ఎవరైనా సాహసించి నిజం చెప్పాలని ప్రయత్నిస్తే తెలంగాణ ద్రోహి అనో, సమైక్యాంధ్ర ద్రోహి అనో ముద్ర వేయడం ఫ్యాషన్ అయిపోయింది.
కారణాలు ఏమైనప్పటికీ ఉభయ ప్రాంతాల ప్రజలలో ఇప్పుడు భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇందుకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు కేంద్రం కూడా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అందులో న్యాయం ఉందని భావించారు. అందుకే తెలంగాణకు అనుకూలంగా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం రగలడంతో ఆయా పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. అయితే బాధ్యతగల రాజకీయ పార్టీలు వైఖరులు మార్చుకోకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలి. విభజనను కొంతకాలం అడ్డుకోగలరు గానీ ఎంతో కాలం కాదని అందరికీ తెలుసు. అయినా ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారు.
ఎంతకాలం ఇలా? కేంద్ర ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరించకుండా సీమాంధ్రకు చెందిన నాయకులతో సమస్యలపై చర్చల ప్రక్రియ ప్రారంభిస్తే పరిస్థితులు శాంతిస్తాయి. హైదరాబాద్‌తో పాటు ఆదాయాన్ని పంచుకోవడానికి తెలంగాణ నాయకులు కూడా వ్యతిరేకించకపోవచ్చు. విభజన సాఫీగా జరగాలంటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ముందుగా సీమాంధ్ర ప్రజలలో కల్పించాలి. అయితే దురదృష్టవశాత్తూ కేంద్రంలోని పెద్దల చర్యలు ఈ దిశగా లేవు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్వయంగా సమైక్యవాదం వినిపించడంతో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. ఆయనను రాజీనామా చేయమని కోరదామా? అంటే సీమాంధ్రలో ఉద్యమం మరింత పెరిగే ప్రమాదం ఉంది. సమైక్యవాదానికి ఇప్పుడు ఆయన చాంపియన్‌గా ఉన్నారు.
- నేతలు.. కలలు!
రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశం లేదని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి సమైక్యవాదాన్ని అందిపుచ్చుకున్నారు. కేంద్రంలో ప్రధాన రాజకీయపక్షాలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రం ఎలా సాధ్యమో ఆయనకే తెలియాలి. సమైక్యవాదాన్ని జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకోవడంతో సీమాంధ్రలో తాము వెనకబడతామేమోనని భావించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 'సమ న్యాయం' సిద్ధాంతాన్ని బయటకు తీశారు. వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కలలోకి వస్తుంటే, చంద్రబాబుకు జగన్ కలలోకి వస్తున్నారు. దీంతో వారిద్దరి మధ్య ర్యాట్ రేసు ప్రారంభమైంది. లోటస్ పాండ్‌లో జగన్ దీక్ష చేసినా, ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేసినా ఇందులో భాగమే! సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతున్నది కనుక వై.సి.పి., తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. తెలంగాణలో పార్టీని రక్షించుకుంటూనే సీమాంధ్రలో ప్రయోజనం పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తుండగా, తెలంగాణలో పార్టీ ఎలాగూ ఎత్తిపోయింది కనుక సీమాంధ్రలోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జగన్ భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటే జగన్‌కు రాజకీయంగా నష్టం.
తెలంగాణలో బలం లేకుండా, కేవలం సీమాంధ్రలో వచ్చే సీట్లతోనే సమైక్య రాష్ట్రంలో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. చంద్రబాబు విషయానికి వస్తే రాష్ట్రం విడిపోయినా, తెలంగాణలో ఇప్పటికి ప్రతిపక్షానికే పరిమితమైనా భవిష్యత్తులో పార్టీని నిలబెట్టుకోవచ్చునన్నది ఆయన ఉద్దేశం. అదే సమయంలో సీమాంధ్రలో వై.సి.పి.పై పైచేయి సాధిస్తే అక్కడ తాను ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చునని ఆయన భావిస్తున్నారు. 2014 ఎన్నికలే జగన్మోహన్ రెడ్డికి మొదటి అవకాశం, చివరి అవకాశం కూడా! ఆ ఎన్నికలలో ఆయన అధికారంలోకి రాకపోతే వై.సి.పి.కి మనుగడే ఉండదు. అనంతపురం ఎం.పి. అనంత వెంకట్రామిరెడ్డి వంటి వాళ్లు ఇప్పుడు వై.సి.పి.లో చేరడానికి సిద్ధపడుతున్నారంటే మరో ప్రత్యామ్నాయం లేకే! సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పుట్టి ముంచింది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లలేరు. దీంతో అనంత వంటి వాళ్లు మనస్సు చంపుకొని జగన్‌ను ఆశ్రయిస్తున్నారు.
వచ్చే ఎన్నికలలో జగన్ అధికారంలోకి రాలేకపోతే ఇలాంటి వాళ్లు వెంటనే తిరుగుముఖం పడతారు. చంద్రబాబుకు కూడా ఇదే చివరి అవకాశం. ఇప్పుడు ఆయన అధికారంలోకి రాకపోతే ఆయన భవిష్యత్తే కాకుండా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఈ కారణంగానే ఆయన వయస్సును సైతం లెక్క చేయకుండా దీక్షల విషయంలో జగన్‌తో పోటీ పడుతున్నారు. బెయిల్‌పై జైలునుంచి విడుదల అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు ఆయనకు కలిసిరావడం లేదు. సమైక్యవాదం అంటూ ప్రారంభించిన దీక్షకు జనాదరణ లేకపోవడంతో ఫ్లాప్ అని ముద్ర పడింది. అదే సమయంలో బెయిల్ కోసం తాను కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డానని ప్రజలు అనుమానించడంతో అలాంటిది ఏమీ లేదని చెప్పడానికి నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తి విమర్శల పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకున్నప్పటికీ, ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితులు ఏర్పడితే నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వడానికి వెనుకాడకపోవచ్చు.
ఎందుకంటే తనపై ఉన్న కేసుల నుంచి బయటపడాలంటే ఆయనకు కేంద్ర ప్రభుత్వం అండదండలు అవసరం. సమ న్యాయం పేరిట ఢిల్లీలో దీక్ష చేసిన చంద్రబాబు నాయుడు, జగన్ గురించి ఆలోచించడం మానేసి న్యాయం జరిగిందన్న నమ్మకం సీమాంధ్రులలో కలిగించడానికై నిర్దుష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లడం వాంఛనీయం. చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల గానీ, మరే ఇతర కారణం వల్ల గానీ బి.జె.పి. అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా శుక్రవారంనాడు సమ న్యాయం జరగాలని కోరారు. 2014 ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పోటీ పడుతున్న యు.పి.ఎ., ఎన్.డి.ఎ.లకు లభించే సీట్ల మధ్య వ్యత్యాసం 20 నుంచి 30 మధ్యే ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటుకు బేషరతుగా సహకరించడం ద్వారా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, జగన్ పార్టీకి కలిపి 30 సీట్ల వరకు లబ్ధి చేకూర్చడానికి భారతీయ జనతా పార్టీ సహజంగానే సిద్ధపడదు. ఈ కారణంగానే 'సమ న్యాయం' అనే మాటను రాజ్‌నాథ్ సింగ్ వాడి ఉంటారు. వచ్చే ఎన్నికలలో బి.జె.పి.తో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నప్పటికీ, సీమాంధ్ర ప్రజలు సంతృప్తి చెందేలా బి.జె.పి. కృషి చేయని పక్షంలో, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తాము మునిగిపోతామన్న భావనతో తెలుగుదేశం నాయకులు ఉన్నారు.
సీమాంధ్ర ఉద్యమానికి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది కనుక భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడింది. కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తేవడం ద్వారా సీమాంధ్ర ప్రాంత ప్రజలకు న్యాయం జరిపించామన్న నమ్మకం కలిగిస్తే, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో జతకట్టి ఎన్నికలకు వెళితే లాభపడవచ్చునని ఆ పార్టీ జాతీయ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికావాలంటే ఇక రెండు మాసాల వ్యవధి మాత్రమే ఉంది కనుక, ఇంత తక్కువ వ్యవధిలో విభజన చేయడం సాధ్యం కాదని బి.జె.పి. అగ్ర నేత ఆడ్వాణీ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన తనను కలిసిన తెలుగుదేశం నాయకుల వద్ద రెండు రోజుల క్రితం ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్ర విభజన సాధ్యం కాదని ఆయన తనను కలిసిన వారి వద్ద ప్రస్తావిస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా బహుశా ఈ విషయం తెలిసే ఉంటుంది. అయినా తెలంగాణలో ప్రయోజనం పొందాలి కనుక విభజన విషయంలో వేగంగా వెళుతున్నట్టు తెలంగాణ ప్రజలు భావించేలా ప్రయత్నిస్తున్నారు. 2014లోపు విభజన జరగకపోతే పరిస్థితులు ఏమిటన్నదే ప్రశ్న! అదే నిజమైతే తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్‌లో విలీనం కాకపోవచ్చు. బహుశా ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేయవచ్చు. సీమాంధ్రలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ సమైక్యవాదం పేరిటే ఎన్నికల బరిలోకి దిగుతారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఎన్నికల నాటికి జగన్ పార్టీతో సి.పి.ఎం. జతకట్టే అవకాశం ఉంది. ఆ పార్టీ ముఖ్య నాయకుడు సీతారాం ఏచూరి శుక్రవారంనాడు స్వయంగా ఫోన్ చేసి ఆసుపత్రిలో ఉన్న జగన్‌ను పరామర్శించడం ఈ అనుమానాలకు ఊతం ఇస్తోంది. బి.జె.పి.తో జత కట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నా, జగన్‌తో స్నేహం చేయడానికి సి.పి.ఎం. ప్రయత్నించినా రాజకీయ ప్రయోజనం కోసం తీసుకునే నిర్ణయాలే అవుతాయి. రాజకీయాలలో అంటరానితనం ఉండదని అంటారు.
దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ అనుకూల పవనాలు వీస్తున్నందున బి.జె.పి.తో చేయి కలపడం వల్ల 1999 ఎన్నికలలో వలె తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో లాభపడే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటుకు సహకరించినా లేదా సమ న్యాయం జరిపించినా బి.జె.పి.కి రాష్ట్రంలో సొంతంగా ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకునే అవకాశం కనిపించడం లేదు కనుక తెలుగుదేశంతో పొత్తు ఆ పార్టీకి కూడా ఉభయకుశలోపరిగా ఉండవచ్చు. తెలుగుదేశంతో పొత్తును బి.జె.పి. రాష్ట్ర శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఏమి జరుగుతుందో చూడాలి. ఈ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా, 2014లోపు విభజన జరుగుతుందా? లేదా? అన్నదాన్ని బట్టి రాష్ట్రంలో ఆయా రాజకీయ పార్టీల తలరాతలు ఉంటాయి. మరో మూడు మాసాలు గడిస్తే గానీ ఈ రాష్ట్రం పరిస్థితి ఏమిటన్నది తేలదు. అంతవరకు విభజనవాదులు, సమైక్యవాదులు ఎవరి ఊహల్లో వారు విహరించవచ్చు. ఒక్కటి మాత్రం వాస్తవం. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధపడటం మేలు!

http://www.andhrajyothy.com/node/10469