Saturday, July 1, 2023

ఊరి గాయం - శీర్షిక : ఇంద్రప్రస్థం

 ప్రతిదినం పద/వాక్య కవిత్వ పోటీకి

అంశం : ఊరి గాయం
శీర్షిక : ఇంద్రప్రస్థం
.
ద్రౌపదికి జరిగిన అవమానానికి,
దుర్యోధననుని దురభిమానానికి
దుశ్శాసనుని దుష్కర్మకు,
కర్ణుని దుర్నీతికీ కర్మఫలంగా
కురు వంశ పతనానికి సాక్షి,
ఈ ఇంద్రప్రస్థం !
ధర్మం వైపు నువ్వుంటే, దైవం నీ వెంటే, అని దారి చూపి,
బతకుమార్గాన్ని గీతలు గీసి చూపించిన
శ్రీ కృష్ణుడి పాదాలు మోసిన పట్టణం,
ఈ ఇంద్రప్రస్థం !
ఆనాటి నుండి ఈనాటి దాకా,
ఎంతో మంది వీరులు,
ఎన్నెన్నో గాధలు వీక్షించిన విజయ కేతనమీ రాజ్యం !
*
అంతటి మహోన్నత ఊరికి గాయమయ్యింది
చీర లాగినందుకే కురు వంశాన్ని చెరిపేసిన రోజులనుండి,
చెరచి చంపేస్తే,
చిన్నవాడని చెప్పి
చీరలు కుట్టుకొమ్మని కుట్టు మిషనులు ఇచ్చే
పరిస్థితులు వచ్చినందుకు,
ఊరి గుండెకు గాయమయ్యింది

ఏ నేలపై కృష్ణుడు తిరుగాడాడో
ఏ ఊరి వీరుడు కీచకుడిని వధించాడో
ఆ ఊరి వీధులలో తిప్పుతూ
ఆమెను వికృతంగా వేధించి కడతేర్చారని
ఊరి మనసు ముక్కలై రోధించింది
*
ఒక పిల్లవాడిని పెంచడం, ఒక ఊరి బాధ్యత
ఈ కీచకులను పెంచిన నేరం నాదేనంటూ
మూగ సాక్ష్యంగా మిగిలిపోవడం
తప్ప మరేమి చెయ్యలేని
ఇంద్రుని నగరం కూలబడిపోయింది



ఏ ఇంద్రజిత్తుని జిత్తులు తగిలెనో
ఏ కలి పురుషుని నీడబడెనో
ధర్మం వైపు నిలబడలేని నిస్సహాయతతో
నిర్జీవమైపోయిన నిర్భయ ముందు తలవంచుకుంది
అటువంటి కీచకులను కన్న,
ప్రతి ఊరి గాయానికి ప్రతీకగా !

No comments:

Post a Comment