అదేదో ఊరి నుండి మహా శిల్పి వచ్చాడు,
మరేదో ఊరినుండి పెద్ద బండ తెచ్చాడు,
ఆరడుగులు కొలతపెట్టి బండను ఖండించాడు,
మూడడుగుల ముక్కను పక్కకు తోసేసాడు !
ఆరడుగల బండేమో విగ్రహమై వెలిసింది,
మూడడుగుల బండేమో చాకిరేవు చేరింది,
కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి,
కంపుగొట్టు బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి !
గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిసాయి,
మురికి మరకల బట్టలన్ని నీటిలో మునిగాయి,
అర్థంగాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు,
చాకలి నోటివెంట హిస్సు హిస్సు శబ్దాలు !
శటగోపం పవిత్రంగా ప్రతి తలనూ తాకుతోంది,
పవిత్రతకై ప్రతిబట్ట బండను బాదుతోంది,
కడకు దేముడినుండి ప్రతి మనసూలన్నీ కంపుతోనే వెళ్ళాయి,
రేవునుండి బట్టలన్ని ఇంపుగానే వెళ్ళాయి !
బండలోని దేముడా, దేముడి లోని బండా !
ఎవరు దేముడు ? ఎవరు బండ ?
-Actor Ranganath