Friday, November 10, 2023

అబ్బాయి కుటుంబం పాలు అయితే, అమ్మాయి పంచదార

 మనం అవలంబించే వివాహ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది.

పెళ్ళంటే ఎదో అమ్మాయి అత్తారింటికి వెళ్ళి అక్కడ వాళ్ళకనుగుణంగా సర్దుకుపోవడం కాదు.
కాని పెళ్లి అంటే సర్దుకు పోవడమే !



అబ్బాయి కుటుంబం పాలు అయితే, అమ్మాయి పంచదార/హార్లిక్స్/బూస్ట్ లాంటిది.
అబ్బాయి వీళ్ళ మధ్య చెంచా 🙂
వీటన్నిటిని కలిపి ఉంచే గ్లాసే ప్రేమ !!
పంచదార కలిసేలా చెయ్యడం చెంచా బాధ్యత.
ఒక సారి కలిసాకా,
పంచదారా మునుపటిలా ఉండదు,
పాలూ మునుపటిలా ఉండవు,
చెంచాకి పనీ ఉండదు 🙂
.
అబ్బాయి తన కొత్త కుటుంబాన్ని (అమ్మాయి)
తన పాత కుటుంబాన్ని (తల్లి తండ్రులు, తోబుట్టువులు, చుట్టాలు) లో
కలిపే బాధ్యత తెలియ కుండానే నెత్తిన వేసుకుంటాడు.
తనని నమ్మి ఒక అమ్మాయి తన ఇంటికి ఒంటరిగా వచ్చిందీ
ఆమె బాధ్యత తనదే అని అని గుర్తించుకోవాలి,
అప్పటిదాకా అల్లరిచిల్లరిగా తిరిగిన వాడు
పెదరాయుడిలా పెద్ద మొగాడు అయ్యిపోవాలి,
తక్కెడ మధ్యన ఇరుసులా,
న్యాయస్థానం లో న్యాయమూర్తిలా మధ్యలో నిలబడాలి,
ఇరు కుటుంబాల ఆశలు, ఆశయాలు, కోరికలు
కోపాలు, తాపాలు అర్థం చేసుకుని
నొప్పినంపక, తానొవ్వక, తప్పించుకోకుండా నేర్పుగా మెలగాలి
ఈ ప్రయత్నంలో అమ్మాయే కాదు
తన కుటుంబం కూడా మారాలి
తానూ పరిపక్వత చెంది పరిపూర్ణ పురుషుడిగా మార్పు చెందాలి !
అవసరమయితే, తాను ఇరు పక్షాలకీ శతృవుగా నటించి అయినా వారిని ఒక్క తాటిపై నడిపించాలి.
.
తాతలనాడు తన్ని నోర్మూయించారు
తండ్రులనాడు తిట్టి నోర్మూయించారు
లాంటి తొప్పాసి మాటలు బుర్రకెక్కించుకోకుండా
ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లే
సమస్యలు తీరతాయని గుర్తించాలి
అప్పుడే అటు అమ్మాయి, ఇటు కుటుంబం
వెరసి అబ్బాయి...
అంతా గెలుస్తారు !
.
తన కోసం తపస్సు చేసిన పార్వతే అయినా
లోకువగా చూడలేదు శివుడు
కాలితో తన్నించుకు మరీ శాంతింపచేసాడు !
భర్త అంటే అలానే ఉండాలి !
.
ఇక అమ్మాయి విషయం చెప్పక్కర్లేదు,
చిన్నప్పటి నుండి తన చుట్టూ ఉన్న
అమ్మ, నాన్నా, తాబుట్టువులూ బంధువులూ అనే కోటను వదిలి
ఒక్కతే, తెలియని కొత్త ఇంటిలో అడుగుపెట్టాలి,
ఆ ఇంటినే తన కొత్త కోట చేసుకోవాలి,
తనను నమ్మి తనను తన ఇంటికి తీసుకువెళ్ళిన
తన భర్తకు అతని కుటుంబం కూడా ముఖ్యమే అని ఆమె గుర్తించాలి,
అబ్బాయిలాగే అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి,
ఒక్క సారిగా సైకాలజిస్టు అయ్యిపోవాలి
అందరి మనసులూ అర్థం చేసేసుకోవాలి
"ఏమిచ్చారు?" "ఏం తెచ్చారు" "మా కాలంలో ఇలా కాదు"
"చిరిగిపోయిన చీర పెట్టారు" "అవమానించారు" "మీ వాళ్ళు అంతే"
"మాది పరువుగల కుటుంబం" ... ఇవన్నీ విన్నా, విననట్టు వదిలేసే
భూదేవంత సహనం,
సన్యాసులకున్నంత సంమ్యమనం (బదులు చెప్పకుండా ఉండడానికి),
దుర్గా దేవికున్నంత ధైర్యం (తన వారిని వదిలి, కొత్తవారిని భరించడానికి) ఉండాలి,
ఒక చెట్టులా ఆ కొత్త వారూ తనవారే అని అనుకోవాలి
అహం (అహం చెడ్డదనుకునేరు, అహం మితి మీరనంత సేపు చాలా అవసరం) తగ్గించుకుని సర్దుకుపోవాలి...
ఇలా చెప్పుకు పోతే ఇదో పెద్ద చిట్టా !
.
మరి ఇరు కుటుంబాలకీ బాధ్యతలేదా?
ఉంది!
అగ్నికి ఆజ్యం పొయ్యకుండా,
తాము ఆదర్శంగా మెలగి వారికి దారి చూపడం !
అడ్డ కత్తెరలో పోకచెక్కలా తమ పిల్లలు నలిగిపోకూడదు అని గుర్తించాలి !
వారికి సలహాలు సూచనలూ మాత్రమే ఇచ్చి
నిర్ణయాలు తీసుకునే బాధ్యత వారికే ఇచ్చి
వారు ఎదిగేలా చెయ్యాలి !
మా పిల్ల కాలు కందిపోతోంది,
మా అబ్బాయి మారిపోయాడు
అని కధలు పడకుండా,
వారికొక కొత్త సమస్య కాకుండా పెద్దరికం నిలబెట్టుకోవాలి.
వందల వేల సంవత్సరాల నుండీ
తరాల మధ్య అంతరాలు ఉండడం సహజం అని గుర్తించాలి,
పాలూ పంచదారా కలిసినప్పుడు
పాల రుచి మారుతుందనీ
పంచదార రూపు మారుతుందనీ,
అది సహజమనీ, గుర్తించాలి.
ఇక బంధువులు, వేడుక చూసినట్టు చూడకుండా
అవసరమైనప్పుడు సాయం చేస్తూ,
అవసరం లేనప్పుడు తప్పించుకుంటూ ఉండాలి !
ఈ మొత్తం ప్రక్రియలో సమస్యలేమైనా వస్తే అవి పెద్దవవకుండా కాపాడేవి ప్రేమ, స్వతంత్రం,కుటుంబ వ్యవస్త పట్ల గౌరవం.
.
మంచి కుటుంబానికి కొలమానం
అందరూ కలసి ఉండడం ఒక్కటే కాదు !
కలసిమెలసి ఉండడం, ప్రేమభిమానాలు, నమ్మకం, స్వతంత్రం, త్యాగం, ఓర్పు సహనం.. ఇవి కూడా కొలమానాలే !
ఏమంటారు??

Sunday, October 15, 2023

Veg Vs Non-Veg Food??!

 కొన్నేళ్ళ క్రితం ఒక పనికిమాలినోడు నన్ను పెళ్ళికి పిలిచాడు. నేను అప్పట్లో థెర్మాకోల్ పై వధూ వరుల పేర్లు చెక్కి అందమైన బొమ్మలు వేసేవాడిని, వాడు నన్ను బతిమాలి మరీ ఒక పెళ్ళి బోర్డు చేయించుకున్నాడు.

భోజనాల దగ్గర ఒక మిత్రుడు వచ్చి, ఒరై ఇక్కడ కేవలం నాన్ వెజ్ ఉంది చూసుకో, ఇప్పుడే ఫలానా MADAM తింటూ అది NONVEG అని తెలిసి వాంతులు చేసుకున్నారు అని వారించాడు.
సదరు పెళ్ళి కొడుకు వచ్చి భోజనం చెయ్ అన్నాడు. నేను వద్దు అన్నాను. వాడు ముక్కలు తీయించేస్తా, ఉత్తి బిరియాని తిను వెజ్జే కదా అన్నాడు. నాకు కోపం వచ్చినా తమాయించున్నా, సర్లే మనం భోజనం చెయ్యాలి అనే మంచి ఉద్దేశం తో అడుగుతున్నాడు అనుకున్నా, తినేవాళ్ళకి తినని వాళ్ళ గురించి అర్థం కాదులే అని కోపం తమాయించుకున్నా.
.
కొన్నాళ్ళ తరువాత వాడి Hybrid Christian 'కులం' వాడే చెప్పినది ఏంటంటే, పెళ్ళి కొడుకు 'నేను పెళ్ళి భోజనం చెయ్యకపోవడం' అవమానం గా ఫీల్ అయ్యాడు, కులం గురించి అనుకున్నాడు. నాతో వెటకారంగా మాట్లాడేవాడు, లాబ్స్ లో నన్ను ఇబ్బంది పెట్టి తక్కువ మార్కులు వేసాడు కూడా (ఇందుకు పనికిమాలినోడు అన్నా).
.
నాకు అప్పుడు అర్థం అయ్యింది ఏంటి అంటే, మనకి తెలిసిన వాళ్ళే కదా, మనని సాయం అడిగారు కదా, మనని అర్థం చేసుకుంటారులే, మన అభిప్రాయాలకు గౌరవం ఇస్తారు లే అనుకుంటే తప్పు, విజ్ఞత అన్నది మనిషి మనిషికి మారిపోతుంది.
అందుకే మనం మొహమాటం లేకుండ మనకు కావాల్సింది చెప్పెయ్యాలి.
.
ఇన్నేళ్ళలో, నేనెప్పుడూ ఎవ్వరినీ నీ కులం/మతం ఏంటి అని అడగలేదు.
భోజనానికి పిలిస్తే మాత్రం, నాకు నాన్ వెజ్ గిన్నేల్లో వండినవి పెట్టొద్దు అని చెప్పేస్తా.
నా గురించి తెలిసిన వారు కాబట్టి ఎవరూ తప్పుగా తీసుకోలేదు.
నేను సౌది వెళ్ళినప్పుడు నా గిన్నెలు, గరిటెలు, బియ్యం, నూడిల్సూ కూడా పట్టుకెళ్ళా. (అక్కడ లులూ మార్కెట్టు చూసాకా ధైర్యం వచ్చింది అనుకోండి. )
వెజ్ అందరూ నా FLATలో తింటే , నాన్ వెజ్ పక్క FLATలో తినేవారు, తప్పేంటి?
.
చైనా లో కప్పలు బొద్దింకలు మిడతలు చెద పురుగులు తింటారు, వాటికి మీకు కలిపి ఒకే వంట పాత్రలు వాడితే మీకు నప్పుతుందా? కంచంలో బతికున్న పాము తిరుగుతుంటే మీరు తినగలరా? ఒక్కొక్కరికీ ఒక్కొక్క LEVEL OF EXPOSURE ఉంటుంది.
మా అమ్మమ్మ తింటుంటే, ఆవిడని ఏడిపించడానికి, మేము "కోడి" అనే వాళ్ళం, అవిడ తినడం ఆపేసేది.
మరి నేను సౌదీలో, పక్కన వాళ్ళు ఒంటె కాలు తింటుంటే, నా కూర ముక్కలు నేను ఎలాంటి ఇబ్బందీ పడకుండా తినేవాడిని.
.
ఒక సారి ఒక మిత్రుడు, సరే నిన్ను పిలిచి,
నాన్వెజ్ చేసిన గిన్నేల్లోనే చేసి
నాన్వెజ్ కంచంలో పెడితే నీకు తెలీదుగా అన్నాడు.
"నిన్ను మా ఇంటికి పిలిచి, మా కుక్క కంచంలో పెడితే, నీకూ తెలీదు గా? అలానే నాకూ తెలీదు" కాని, "నీ కర్మకు నువ్వే పోతావ్" అని చెప్పా.
.
మేమూ చిన్నప్పుడు అవమానాలు పడ్డాం. ఒకడు, ఆడు పప్పుగాడు రా అంటాడు, ఇంకొకడు బెల్టు బాచ్ అంటాడూ, ఇంకొకడు తైర్ సాదం అంటాడు. ఇవి కాస్టిస్తు మాటలంటే.
అల్లా అన్నీ తినడానికి ఇచ్చాడు నువ్వు మాంసం తినను అంటే నిన్ను నీ తల్లి తండ్రులు సరిగ్గా పెంచలేదు అన్నాడు ఒకడు Saudí McD lo. ఇదీ మత పిచ్చి అంటే.
"నాలో కూడా మాంసం ఉంది నన్ను తింటావా?" అని అడిగా వాడిని, దెబ్బకి రెచ్చిపోయి MUTTAVA ki ఫొన్ చేసాడు, నేను అక్కడ నుంచి పారిపోవల్సి వచ్చింది.
.
డిగ్రీ చదివాడు అనో, ఉద్యోగం వచ్చింది అనో "సంస్కారం" ఉంటుందిలే అనుకోవడం తప్పు. కొంతమందికి ఆ కుల మత పిచ్చి పోదు.
"వెజిటేరియన్" అంటే "కాస్టిస్టు" అనుకుంటే తింగరి తనం.
అలా అనే వారే కుల పిచ్చోళ్ళు, మత పిచ్చోళ్ళు లేదా గొడవలు పెట్టాలనుకునే కమ్యూనిష్టులు.
వాక్స్వతంత్రం, లింగస్వతంత్రం,వీధిలో ముద్దు స్వతంత్రం..
ఇలా అందరికీ అన్ని రకాల స్వతంత్రాలు కావాలి..
వెజిటేరియన్ కి మాత్రం తిండి స్వతంత్రం తప్పు. కాస్టిస్టు.
.
సుధామూర్తి గారు చాలా గొప్ప మనిషి, చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు.
ఆవిడని కాస్టిస్తు అన్నారు అంటే వారంత పనికి మాలిన వాళ్ళూ, పైత్యం ప్రకోపించిన వారింకెవరూ ఉండరు !