Friday, September 14, 2018

సహస్ర పూర్ణ చంద్రోదయ దర్శనం

80 ఏళ్ళు - రమా రమి సహస్ర పూర్ణ చంద్రోదయ దర్శనం
అంటే 1000 పున్నములు చూసిన వారు అని అర్థం

1000 పున్నములు అని చెప్పడం ఎందుకు
29,000 వేల రోజు అని చెప్తే ఇంకా గొప్పగా ఉంటుంది అనుకోవచ్చు, కానీ

పున్నమి అంటే ఆనందం, జీవితంలో ఉచ్చ స్థితికి చిహ్నం,
అసలు మనిషి జీవితాన్ని ప్రతిబింబించాలంటే చంద్రుడిని మించిన చిహ్నం ఏముంటుంది
అందుకే కదా మనం చంద్రమానం అని ఒక పంచాంగమే తయారు చేసుకున్నాం

1000 పున్నములు చూసిన వారు అంటే
1000 అమావాస్యలు, రమారమి 180 చంద్ర గ్రహణాలు,180 సూర్య గ్రహణాలు కూడా చూసిన వారు అని
కూడా అర్థం.
1000 పున్నాలు జీవితంలో ఆనందాలు అయితే,
అమావాస్యలు గ్రహణాలు జీవితంలో కష్టాలు నష్టాలు
అన్నీ చూసిన వారు అని అర్థం.

80 వసంతాల మా మావయ్యగారు ,
స్థితప్రజ్ఞులు
ఆనంద సార్ధక నామధేయులు
నిత్య ఆనందోద్భాసిత నగుమోము ధరులు



ఆయన సంపూర్ణ ఆయుర్ధాయంతో
ఆరోగ్య ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ ...

                               -కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మరియూ శ్రేయోభిలాషులు !







Saturday, September 1, 2018

స్నేహ సముద్రంలో కలుద్దాం

సముద్రంలోని నీరు మబ్బులై విడిపోయినట్లు
కాలం అనే కళ్ళెం లేని గుర్రం వెనకాల
అలుపెరుగని పరుగులు తీస్తూ
పెనవేసుకున్న జీవితాలు విడిపోయాయి

పొద్దున్నే పుస్తకాలు పట్టుకుని
అరై ఒరై అనుకుంటూ
చదువులు, స్నేహాలు, ప్రేమలు..
గొడవలు, సినిమాలు, పరీక్షలు
అన్నిట్లోను మనం కలిసున్నాం
కొత్త రెక్కలు రాగానే
స్తిరత్వం వెతుక్కుంటూ చెరో దిక్కుకీ విడిపోయాం
పండగకో, పుట్టిన రోజుకో
ఆనందాలకో, అవసరాలకో పలకరించుకునేంత
దూరం వెళ్ళిపోయాం !

కాలం ఆగదు కాని
దానిని క్షణ కాలం వెనకకు తిప్పగలిగేది
ఏంటో తెలుసా?

జ్ఞాపకం !

మనం కలిసి గడిపిన రోజులు జ్ఞప్తి తెచ్చుకుంటే
మాళ్ళీ ఆ క్షణాలు జీవించినట్టే
అందులో మనం అందరం ఉంటే ఆ రోజులు నిజంగా తిరిగి వచ్చినట్టే

మబ్బులన్ని కలిసి
వర్షమై
కాలువలై
నదులై
మళ్ళీ సముద్రంలో కలిసినట్టు
మనం అందరం మరో సారి స్నేహ సముద్రంలో కలుద్దాం



మళ్ళీ మబ్బులవ్వుతాం అని తెలిసినా
నదులై మళ్ళీ కలుస్తాం అని ఆనందిద్దాం !