Saturday, March 15, 2014

ఏమో ఎవరికి తెలుసు?

 
ఏమో ఎవరికి తెలుసు?
నీ గొంతే పెగలపోతే
నిత్యం నలిగిపోతున్న బతుకుల బాధలకు
తిరుగుబాటు పదాలు అర్థంకావేమో !

ఏమో ఎవరికి తెలుసు?
నీ పిడికిలే బిగుసుకోకపోతే
అన్యాయాన్ని అంతమొందించే
పోరు పలుగుకు పదును రాదేమో !

ఏమో ఎవరికి తెలుసు?
నీ అడుగే ముందుకు పడక పోతే
ప్రగతి బాటన నడిపించే నాయకుడు లేక
అభివ్రుద్ధి చతికిల పడిపోతుందేమో !

ఏమో ఎవరికి తెలుసు?
నువ్వు ఆశాజ్యోతివై వెలగకపోతే,
నడుస్తున్న నడిరాతిరిలో
రేపటి సూర్యోదయందాకా బతకలేరేమో?

ఏమో ఎవరికి తెలుసు?
నువ్వొక్కడివే ఆగిపోతే
గాంధీజీ కోరుకున్న గౌరవమైన దేశం
నేతాజి కలలు కన్న స్వంతంత్ర దేశం
నేతలెందరో నెగ్గుకొచ్చిన నేటి భారతం
నిర్వీర్యమై నైరాస్యాన మునిగిపోతుందేమో !!

అందుకే ..
నువ్వొక్కడివే అని నిరాశ చెందకు
నీ గొంతులో నిజాయితి ఉంటే,
అది కోటి గొంతుల కొలువై ధ్వనిస్తుంది
నీ పిడికిలి ప్రజలకై బిగిస్తే,
ఆ బలానికి కొండైనా పిండిగా మారుతుంది
నీ అడుగులో అభివ్రుద్ధి ఉంటే,
నీ అనుచరుల పదఘట్టనకు ఆకాశం దద్దరిల్లుతుంది
నీ ఊపిరి ప్రజా ఉద్యమమైతే
అది ఉప్పెనై అన్యాయాన్ని కాలరాస్తుంది

నువ్వే ఆగి పోకుండా ఉంటే...
నువ్వెంత వాడివో లోకానికన్నా ముందు నీకే తెలుస్తుంది,
దేశభక్తుల చిట్టాలో నీ పేరూ చేరుతుంది!!!

No comments:

Post a Comment