నా లాంటి వాళ్లకు పిడుగులాంటి వార్త !
అయినా ఈ కేరళాలో రోజు రోజుకి దౌర్జన్యం పెరిగిపోతోంది,
లేకపోతె లాస్ట్ బెంచిలు తీసెయ్యడం ఏంటి చెప్పండి,
పిల్లల్ని రాచి రంపాన పెట్టెయ్యక పోవడం తప్ప ?
.
మా లాస్ట్ బెంచు !!
స్కూలుకి అందరూ ఫస్టు రేంకు తెచ్చేసుకుందామనే వస్తారా?
.
ఎదో బర్త్ సెటిఫికేట్ లా ఉపయోగ పడుతుందనో ,
ఇంట్లో తిడతారని భయపడో, ఎదురుచెప్పలేకో..
అందరూ స్కూలుకు పోతున్నారు ఒక్కళ్ళమే ఇంట్లో ఏమి చేస్తామనో,
పక్క బెంచులో అమ్మాయిలో, పక్క క్లాసులో అమ్మాయిలో బాగున్నారనో,
ఆడుకోవచ్చనో , పాడుకోవచ్చనో..
స్కూలుకు వెళ్తున్నాం అని చెప్పి
సినిమాలకు , తిరునాళ్ళకు , విహారయాత్రలకు వెళ్ళొచ్చనో,
గ్రూపులుగా తయారు అయ్యి రాజకీయాలు చెయ్యొచ్చనో,
గొడవలు పడి రాటుదేలచ్చనో,
అసలు ఎందుకు వెళ్లాలో తెలీకనో ,
రకరకాల కారణాలతో స్కూలుకు వస్తారు పిల్లలు !
చదువుకోసమే వెళ్ళాలి కాబట్టి నేను స్కూలుకు వెళ్లను అంటే ,
ఈ సంఘం బతకనిస్తుందా ?
.
తీరా బడికి వెళ్ళాక ,
ఇలాంటి పిల్లలందరినీ నేర్పుగా చదువు వైపు తిప్పే
ఓపిక , సహనం , నైపుణ్యం అందరు గురువులకు ఉంటుందా ?
నీ ఇష్టం ఏమిటి అని
నీ సమస్య ఏమిటి అని
పలు మార్లు ప్రతి పిల్లాడిని అడిగి తెలుసుకుని
మొక్కగా ఉన్నప్పుడే వంచే అంత సమయం "లెసన్ ప్లాన్" కల్పిస్తుందా ?
ఒక్కొక్కరికి ఒక్కో గురువు ..
ఆ గురువు మీద గురి కుదురుతుంది
అప్పుడే చెప్పిన ప్రతి అక్షరం విస్ఫోటనమై పరుగుపెట్టిస్తుంది
ఆ రోజు వచ్చేదాకా ఎంత గొప్ప గురువైనా మార్చలేరు !
కాలం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నను
బడి ఇవాళే పరిష్కరిద్దామనుకుంటే ఎలా ?
.
ఏదోలా నెట్టుకొచ్చేద్దాం అని బయలుదేరుతారు బడికి ..
ఆలా ఎదో విధంగా బడి చేరిన పిల్లలకు,
ఆశ్రయం కల్పించే శరణాలయం "మా లాస్ట్ బెంచు " !
పాఠాల ఉదృతి తగ్గేదాకా కాస్త కనిపించకుండా
చివరి బెంచులో తలదాచుకుని
చివరి బెల్లు మోగి బతుకు జీవుడా అని బయటపడే దాకా
కడుపులో పెట్టుకు కాపాడే కడపటి బెంచు...
.
టీచరు
హోమ్ వర్కులు చూస్తుంటే ,
చివరి బెంచు దగ్గరకు వచ్చేటప్పటికి బెల్లు మోగేస్తుంది,
ప్రశ్నలు అడుగుతుంటే చివరి బెంచు చేతులెత్తక్కర్లేదు,
తలలు ముందువారి వెనుక దాచేసుకుంటే చాలు,
టీచరు విసిరిన చాక్ పీసు డస్టర్ , మా దాకా రావు
తిక్కరేగితే కానీ కొట్టడానికి టీచరూ రారు
పరీక్షలో జవాబులు రాకపోతే
స్లిప్పులు పెట్టుకో , ఫార్ములాలు రాసుకో ,
ముందు వాడి పేపరు చూసి రాసుకో అని
పాసయ్యే మార్గాలు చూపించే గూగుల్ కదా లాస్ట్ బెంచు !
పొద్దున్నే తిన్న చద్దన్నం , సాంబార్ ఇడ్లి
నిద్రపొమ్మని ఆజ్ఞాపిస్తే..
నీకెందుకు నేనున్నాను అని తనపై తలవాల్చుకు
పాఠాన్నే జోల పాట ఆనుకుని
పడుకొమ్మనే మంచి మనసు కలది "మా చివరి బెంచు"
గురువుగారు చెప్పేదాని మీద ఆసక్తి కన్నా
అయన మీద భయం ఎక్కువ ఉండడం వల్లనో
విషయ జ్ఞానం లేక చెప్పేది అర్థంకాకనో
పాఠం విసుకుపుట్టిస్తుంటే..
బుర్రలో ఆలోచనలు ఎన్ని కధలు కలలు కళలు సృజిస్తాయో తెలుసా ?
చేతిలో పెన్ను
ఎన్ని కాగితాల మీద కవితలు రాస్తుందో తెలుసా ?
ఎన్ని బొమ్మలు వేస్తుందో తెలుసా ?
పిల్లల సృజనాత్మకతను పచ్చబొట్టుల్లా మోసే
ఆ చివరి బెంచుల్ని అడగండి .. ఎన్ని కబుర్లు చెప్తుందో !
.
సరదాల సంబరాల తిరునాళ్ళు
మా చివరి బెంచు..
క్లాసులో ఒక్కొక్కరికి ఒక్కక్కరి విషయం తెలుసు
అందరి గురించి అన్ని విషయాలు తెలిసిన వారు లాస్ట్ బెంచులో ఉంటారు ,
ముందు బెంచు వాళ్ళ చెప్పులు షూలు పుస్తకాలూ పెన్నులు
చివరి బెంచు దగ్గరే తేలుతాయి !
ముందు పిల్లల చొక్కాలమీద ఇంకులు
పేంటు కింద బబ్బులు గమ్ములు
బాగ్గులకు స్టిక్కర్లు
టీచర్లకు , పిల్లలకు పెట్టిన నిక్నేమ్ లు
ఏడిపిస్తూ రాసిన పాటలు
అల్లరి చెయ్యడానికీ
తెలివి తేటలు , సృజనాత్మకత కావాలి తెలుసా ?
అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకర్స్ కి నిలయం,
విప్లవాలు , ఉద్యమాలకు పుట్టినిల్లు కదా ఇది ?
.
ముందస్తు రుతుపవనాలు, ముందస్తు బెయిలు , ముందస్తు ఎన్నికల్లా
లంచ్ టైం కన్నా ముందే ముందస్తు ఆకలి వేస్తే,
పప్పుండలు , చాకోలెట్లు, బిస్కట్లు
నాలుగు లంచు బాక్సులు రుచి చూసే అవకాశం ఇస్తుంది
ఈ ఫైవ్ స్టార్ హోటల్ !
.
బాటా షూలు కాళ్ళు కొరికేస్తుంటే ,
బెల్టులు బొజ్జను నొక్కేస్తుంటే,
టైలు ఉక్కబెట్టేస్తుంటే,
నువ్వు కనబడవులే
ఇప్పి పక్కన పడేసేయ్యమని
అభయహస్త మిస్తుందీ ఆఖరి బెంచు !
.
స్నేహాలు ప్రేమలు ఆత్మీయతలు అన్నీ
ఈ వెనుక బెంచులకు తెలిసినంత
ముందు బెంచులకు ఏమి తెలుసు మొదటి రేంకు తెచ్చుకోవడం తప్ప !
రుజువు కావాలంటే
పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను పెట్టండి !
హాజరు చూడండి , పలకరింపులు వినండి
చివరిగా నీ బెంచు ఏంటి అని అడగండి !
చివరి బెంచు ఒక కులం , ఒక మతం ,
ఒక కుటుంబం అని మీకే అర్థం అవుతుంది !!
.
మీరూ చేసారా అల్లరి ? లాస్ట్ బెంచులో కూర్చుని ?