Monday, December 2, 2024

పిల్లలు - టెక్నాలజీ - AI - వోకిజం

 పిల్లలు - టెక్నాలజీ - ఏ అయ్ - వోకిజం

.

* 14 ఏళ్ల పిల్లాడు AI chat App తో ప్రేమలో పడి, దాని వల్ల ఆత్మ హత్య చేసుకున్నాడు.

* నీ వల్ల లోకానికి ఉపయోగం లేదు చచ్చిపో, అని చెప్పిన గూగుల్ జెమిని.

* 10 ఏళ్ల పిల్లాడు గన్ తో 5 గురు తోటి విద్యార్థులను కాల్చి చంపాడు.

* 2 ఏళ్లలో ౩౦ కోట్లు , 32 సర్జరీలు చేయించుకుని -> మొదట బ్రిటిష్ అబ్బాయి నుండి కొరియన్ అబ్బాయిగా , తరువాత కొరియన్ అమ్మాయిగా , తరువాత మళ్ళీ కొత్త అబ్బాయిలా మారిన 30 ఏళ్ల కుర్రాడు.

* అమెరికా లో 72 జెండర్స్. వోకిజం వల్ల ఆడ - మగ మధ్యలో 70 రకాలుగా గందరగోళానికి గురవుతున్న చిన్న పిల్లలు / యువత. వోకిజం ఆధారంగా సినిమాలు .

.

పై మూడు విషయాల్లో అంతర్లీనంగా ఉన్న అసలైన సమస్య ఏమిటో తెలుసా ?

AI కాదు, గన్స్ కాదు, వోకిజం కాదు ... చిన్న/పెద్ద మానసిక రుగ్మతలు, కొన్ని సార్లు ఐడెంటిటీ క్రైసిస్.

చిన్న పిల్లల్లకు మానసిక సమస్యలా? అని అనుమానం వద్దు. వస్తున్నాయి అందరికీ.


పూనకాలు, దెయ్యాలు, గాలి, ధూళి ఇలా రకరకాల మానసిక సమస్యలు బోలెడు మనకు.

ఒకప్పుడు భారత దేశంలో అన్నీ పెద్ద కుటుంబాలే ఉండేవి కాబట్టి చుట్టూ చాలామంది.


తల్లి తండ్రులకు చెప్పుకోలేక పొతే/లేదా వాళ్ళు పని వల్ల దొరకక పోతుంటే,

ముత్తమ్మమ్మ  తాత మామ్మ అమ్మమ్మ

పెద్ద నాన్న చిన్నాన్న పెద్దమ్మ చిన్నమ్మ

అత్త మావ అక్క బావ చెల్లి 

ఇలా ఇంట్లో చెప్పుకోడానికి చాలా మంది చెప్పుకోడానికి ఉండేవారు !

సగం సమస్యలు చెప్పుకుంటేనే పోతాయి,

మిగతా సమస్యలు డాక్టర్లను సంప్రదించాలి !

.

డాక్టర్ల దెగ్గరకు వెళ్ళక్కరలేనంత చిన్న సమస్యలు, చెప్పుకోడానికి ఎవరూ లేక పెద్ద సమస్యలు అవుతాయి.


ఉద్యోగానికి రోజుకి 8 గంటలు ఎలా కేటాయిస్తారో, అలానే 

తల్లి తండ్రి అనే జీవితకాల ఉద్యోగంలో,

పిల్లలతో మాట్లాడటం అనే పనికి కనీసం 1-2 గంటలు కేటాయించాలి.

రిటైరైన తాతలు మామ్మలు సెల్లులు చూసుకుంటూ/లేదా ఆశ్రమంలో ఉంటుంటే,

లేదా వారికే మానసిక సమస్యలు ఉంటె ?

పిల్లలు సెల్లు టీవీ కి అతుక్కుపోతుంటే, వారి పరిస్థితి ఏంటి ?

.

మానసిక సమస్య ఉంది కాబట్టి 14 పిల్లాడు AI తో చెప్పుకున్నాడు

ప్రియురాలిని ఊహించుకున్నాడు, డిప్రషన్తో ఆత్మహత్య చేసుకున్నాడు  ! ప్రేమలా అనిపించిన డిప్రషన్.


వీడియో గేమ్స్ లో చేసింది , సినిమాల్లో చూసింది బాగా నచ్చింది,

బయట చెయ్యాలనుకున్నాడు, చేసేసాడు ! క్రూరత్వంలా బయటపడిన మెంటల్ సమస్య .


వయసు తో పాటు శరీరంలో మార్పులు వస్తాయి,

చెప్పేందుకు పెద్దలు లేరు, ఇంటర్నెట్టే శరణ్యం,

72 రకాల అనుమానాలు పిల్లలకు.

ఆ అవకాశం వాడుకుని,

సంఘ సంస్కర్తలు అయ్యిపోదాం అనుకునే అవకాశవాదులు

తమకు అర్థంకాకపోయినా, వోక్ ఉద్యమాలు తలకెత్తుకుని

పిల్లల్ని బలి పశువులు చెయ్యడం ! ఐడెంటిటీ క్రైసిస్ + చెత్త ఉద్యమాలు.

.

ఏతా వాతా చెప్పేదేంటంటే,

వెబ్ సిరీస్ల బదులు పిల్లల తో సమయం గడపాలి.

 ఒంటి కాయ శొంఠి కొమ్ముల్లా ఉండకుండా కాస్త జనాలతో పిల్లల్ని కలవనిస్తే ,

మీడియా & నెట్ అదుపులో ఉంచితే మానవాళికి మంచిది !

 



 






 



Wednesday, October 23, 2024

ఏ మతం ఎలా ఉపయోగపడింది?

 దాడికి గురైన ప్రతి ఊరూ నా స్వంత ఊరే

అది ఇజ్రాయెలు అయినా పాలస్తెనా అయినా !


దాడికి గురైన ప్రతివారూ నా స్వంత వారే

అది యూదులయినా ముస్లిమయినా 

వారిది మరే మతమయినా !



చని పోయిన ప్రతి బిడ్డా

శోకంలో ఉన్న ప్రతి తల్లీ

విలపించే ప్రతి తండ్రీ

కూలి పోయిన ప్రతి ఇల్లూ

నా సొంత ఇల్లే !

 

తిరిగిరాని చెల్లెలి కోసం 

వేచి ఉన్న ప్రతి అక్కా

భుజంపై తమ్ముడి శవం మోస్తూ 

నడిచి వెళ్ళే ప్రతి అన్నా

అంతా నా వాళ్ళే !


ఆకలితో అలమటించే ప్రతి శిశువూ

పోషణ లేక పాలివ్వలేని ప్రతి బాలింత

కన్నీరింకిపోయిన ప్రతి మగాడు

యుద్దానికి బలైపోయిన ప్రతి సైనికుడు

...

పోయినవాళ్ళందరూ మనవాళ్ళే

మనమూ వాళ్ళకు అయిన వాళ్ళమే 

మనుషులుగా ఆలోచిస్తే !


ఏ యుద్ధం, ఎప్పుడు ఉపయోగపడింది?

మనమెంత రాక్షసులమో రుజువు చెయ్యడానికి తప్ప?


ఏ జ్ఞానం, ఎంత ఉపయోగపడింది?

మనమింకా మృగాలమని గుర్తుచెయ్యడానికి తప్ప?


ఏ మతం, ఎలా ఉపయోగపడింది? 

మన స్వార్ధానికి బలైపోవడానికి తప్ప?


ఏ స్థలం, ఎవరితో ఉండిపోయింది?

పోయాకా శవాన్ని పూడ్చిపెట్టటానికి తప్ప?

.

ఆ కన్నీటి పొరల వెనుక నీకు ఏ మతం కనిపిస్తోంది?

ఆ విషణ్ణ వదనాల వెనుక నీకే ప్రాంతం అనిపిస్తోంది?

ఆ భీకర రోదనల వెనుక నీకే కారణం వినిపిస్తోంది?

ఏ నవజాత శిశువు నీకే అన్యాయం చేసింది?

.

అవసరమా ఈ ఆలోచనా శక్తి మనకు?

అవసరమా ప్రేమించే మనసు మనకు?

అవసరమా ఏ స్వంత్రం మనకు?

అవసరమా అసలీ లోకం మనకు?


ఈ వ్యధలు బాధలూ నాకెందుకులే అనుకుంటున్నావా?

సాటి మనిషికోసం ఒక కన్నీటి బొట్టు రాల్చలేవా?

ఒక్క క్షణం

ఆ తినే తిండి ఆపు

ఆ వినే పాటనాపు

ఆ చేసే పనిని ఆపు

ఆ వేసే వోటు నాపు


కోడి పిల్లై పుట్టినందుకు పలావులో పడినట్టు

మనిషికి పుట్టినందుకు ఆ పసిపిల్లలు 

యుద్దానికి బలి కావల్సిందేనా?

వారి విలువా కోడి పిల్లంతేనా?


ఒక్క నిమిషం ఆలోచించు,

అభం శుభం తెలియని ఆ పిల్లల

శోకం నీకు కంట తడి తెప్పించలేదా?

వారిని పావులుగా అడ్డూగోడల్లా వాడుకునే

వారి మీద నీ రక్తం మరగలేదా?

అయితే నీ గురించి నువ్వే ఆలోచించుకో !


.
ఎందుకంటే,
మన గొంతులు వినపడితేనే
ఆ యుద్ధం ఆగుతుంది,
మన చేతులు కలిస్తేనే
మరో ప్రపంచం సాకారమవుతుంది !