Wednesday, October 23, 2024

ఏ మతం ఎలా ఉపయోగపడింది?

 దాడికి గురైన ప్రతి ఊరూ నా స్వంత ఊరే

అది ఇజ్రాయెలు అయినా పాలస్తెనా అయినా !


దాడికి గురైన ప్రతివారూ నా స్వంత వారే

అది యూదులయినా ముస్లిమయినా 

వారిది మరే మతమయినా !



చని పోయిన ప్రతి బిడ్డా

శోకంలో ఉన్న ప్రతి తల్లీ

విలపించే ప్రతి తండ్రీ

కూలి పోయిన ప్రతి ఇల్లూ

నా సొంత ఇల్లే !

 

తిరిగిరాని చెల్లెలి కోసం 

వేచి ఉన్న ప్రతి అక్కా

భుజంపై తమ్ముడి శవం మోస్తూ 

నడిచి వెళ్ళే ప్రతి అన్నా

అంతా నా వాళ్ళే !


ఆకలితో అలమటించే ప్రతి శిశువూ

పోషణ లేక పాలివ్వలేని ప్రతి బాలింత

కన్నీరింకిపోయిన ప్రతి మగాడు

యుద్దానికి బలైపోయిన ప్రతి సైనికుడు

...

పోయినవాళ్ళందరూ మనవాళ్ళే

మనమూ వాళ్ళకు అయిన వాళ్ళమే 

మనుషులుగా ఆలోచిస్తే !


ఏ యుద్ధం, ఎప్పుడు ఉపయోగపడింది?

మనమెంత రాక్షసులమో రుజువు చెయ్యడానికి తప్ప?


ఏ జ్ఞానం, ఎంత ఉపయోగపడింది?

మనమింకా మృగాలమని గుర్తుచెయ్యడానికి తప్ప?


ఏ మతం, ఎలా ఉపయోగపడింది? 

మన స్వార్ధానికి బలైపోవడానికి తప్ప?


ఏ స్థలం, ఎవరితో ఉండిపోయింది?

పోయాకా శవాన్ని పూడ్చిపెట్టటానికి తప్ప?

.

ఆ కన్నీటి పొరల వెనుక నీకు ఏ మతం కనిపిస్తోంది?

ఆ విషణ్ణ వదనాల వెనుక నీకే ప్రాంతం అనిపిస్తోంది?

ఆ భీకర రోదనల వెనుక నీకే కారణం వినిపిస్తోంది?

ఏ నవజాత శిశువు నీకే అన్యాయం చేసింది?

.

అవసరమా ఈ ఆలోచనా శక్తి మనకు?

అవసరమా ప్రేమించే మనసు మనకు?

అవసరమా ఏ స్వంత్రం మనకు?

అవసరమా అసలీ లోకం మనకు?


ఈ వ్యధలు బాధలూ నాకెందుకులే అనుకుంటున్నావా?

సాటి మనిషికోసం ఒక కన్నీటి బొట్టు రాల్చలేవా?

ఒక్క క్షణం

ఆ తినే తిండి ఆపు

ఆ వినే పాటనాపు

ఆ చేసే పనిని ఆపు

ఆ వేసే వోటు నాపు


కోడి పిల్లై పుట్టినందుకు పలావులో పడినట్టు

మనిషికి పుట్టినందుకు ఆ పసిపిల్లలు 

యుద్దానికి బలి కావల్సిందేనా?

వారి విలువా కోడి పిల్లంతేనా?


ఒక్క నిమిషం ఆలోచించు,

అభం శుభం తెలియని ఆ పిల్లల

శోకం నీకు కంట తడి తెప్పించలేదా?

వారిని పావులుగా అడ్డూగోడల్లా వాడుకునే

వారి మీద నీ రక్తం మరగలేదా?

అయితే నీ గురించి నువ్వే ఆలోచించుకో !


.
ఎందుకంటే,
మన గొంతులు వినపడితేనే
ఆ యుద్ధం ఆగుతుంది,
మన చేతులు కలిస్తేనే
మరో ప్రపంచం సాకారమవుతుంది !


No comments:

Post a Comment