Monday, August 4, 2014

వివాహ రజతోత్సవ ఆహ్వానం

మా బంధువుల వివాహ రజతోత్సవానికి నే రాసిన కవిత....

వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయే
జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

వైవాహిక జీవితం ఒక కళ, దేవుడి సృజనకు ధన్యోస్మి అనే సంస్కారం.
----------*-----------
వివాహ రజతోత్సవ ఆహ్వానం
ఆర్భాటం కాదిది
ఆచరణీయానికి సంబరం, ఆదర్శానికి అభిషేకం
----------*-----------
రాముడేమో రమణుడు
సీతేమో సత్యవతి
రాబోయే వివాహ వజ్రోత్సవ సంబరానికి
ఈ రజతోత్సవమొక తీపి సంగతి
----------*-----------
ఆది దంపతుల తత్వానికి
మన సీతా రాముల ఆదర్శానికి
వీరువురూ ప్రతీకలని తెలపడానికి
మనం మోసే సరదాల పల్లకీ
----------*-----------
శ్రీ పతి పాదాల చెంత సిరి
అలకల సత్యభామ పాదాల చెంత శ్రీపతి
నరకునితో కయ్యానికి దిగినా
తులసీదళానికే తూగిపోయినా
అంతా శ్రీకరమే
----------*-----------
మీరిన్నాళ్ళు కలిసున్నందుకు కిటుకు ఏమిటి అంటే చిరునవ్వుతో,
మేము వేరె అన్న స్పృహ లేకపోవడమే అంటారీ యువ దంపతులు
అందరికీ తెలియాల్సిన మంచి సంగతులు
----------*-----------
ధన్వంతిరి విద్యా దర్శకత్వం
శ్రీ సూర్యుని ఆశిర్బలం
సీతమ్మ పుణ్య ఫలం
అనంతవెంకటేశ్వరుని దీవెనలే సకలం
----------*-----------
వీరిరువురికీ
వెలుగు ధీశాలుడు ఆదిత్యుడు
జిలుగు సద్గుణ రూపవతి లోక హర్షిత
రమణుని మంచితనానికి జగమంతా కుటుంబం
సత్యవతి సౌశీల్యం లోక వందనీయం
----------*-----------
వసంతాన చిగురుకి కోకిల గానం సంబరం
మరి మన ఈ పండుగకి మీ రాక సుందరం
పెద్దల ఆశీస్సులు శ్రీకరం పిల్లల కేరింతలు శుభకరం
సనాతన ధర్మప్రవాహంలో బిందువులం అందరం

Sunday, July 20, 2014

పిల్ల జమిందార్, జ్యాదా జులుందార్

పిల్ల జమిందార్, జ్యాదా జులుందార్

అవసారలకడిగే ఆనవాయితీలేదు
అరుపులతో అన్నీ అమరవలసిందే
ఏడ్పుతో ఎడారిలో నీరయినా పుట్టు
నవ్వుతో నాల్గులోకాలనొక్కమారు మోహించు
పిల్ల జమిందార్, జ్యాదా జులుందార్

నిద్దురలేస్తూనే నరవాహనం
పరిచర్యలు చేసే పలు దాసీ జనం
అనుక్షణం వెంటుండే ఆంతరంగిక రక్షాదళం
కాలు కందకుండా ఇల్లంతా మెత్తలు
పిల్ల జమిందార్, జ్యాదా జులుందార్

మొహమైనా కడగడు మొదట పాలు తాగాలి
నలుగు పెట్టకుండా స్నానమేమొ చెయ్యడు
అగులు బొట్టు పెట్టాలి రాత్రి దిష్టి తియ్యాలి
అంతా రాజసమే అన్నిటా తన ఇష్టమే
పిల్ల జమిందార్, జ్యాదా జులుందార్

బంగారు కడియాలా? వెండి మొలతాడా?
ఏది లెక్కచెయ్యని జల్సారాయుడు
ఆడుకోడానికి అక్కరలేనిదేమీలేదు
నిజంగా కావాల్సినదేదిలేదు
పిల్ల జమిందార్, జ్యాదా జులుందార్

కాలి బొటనివేలు అలవోకగా నోటిలోకి చేర్చే
ఆసనాలు నేర్చిన బాలయోగి
ఆకలికి తప్ప అన్య సమయాలలో
ఆనందమే తప్ప వేరు యెరుగని ఆనంద యోగి
పిల్ల జమిందార్, జ్యాదా జులుందార్

ఆ బాలక్రిష్ణుని నోటిలో ఆనంత విశ్వం
అందుకే కాబోలు 
ఆన్నీ నోట్లోపెట్టే విశ్వ ప్రయత్నం

అమ్మ చీర కొంగు, అత్త చీర కుచ్చు
నాన్న టీ షర్టు, మామ్మ జాకెట్టు
ఆడుకునే బొమ్మ ఉయ్యాల కమ్మ
ఏదైనా నోట్లోకే 
పిల్ల జమిందార్, జ్యాదా జులుందార్

ఆస్తులందరికీ అబ్బు అవేమి లెక్క?
అడకుండానే
అమ్మ అమ్మమ్మ నాన్న నానమ్మ
ఎన్ని ముద్దులో ... లెక్కలేని సిరి
బుగ్గ గిల్లి ముద్దివ్వని కన్నెలుండునా?
18000 గోపికల కొదువ ఉండునా?
పిల్ల జమిందార్, జ్యాదా జులుందార్

నీ భాష ఏదైనా నీ దేశమేదైనా
వాడి భాషేకాని నిను లెక్కచేయడు
పుట్టుకతోనే ప్రముఖుడు (సెలబ్రిటీ)
పిల్ల జమిందార్, జ్యాదా జులుందార్