Saturday, July 1, 2023

నువ్వు రావని తెలిసి

అంశం : "నువ్వు రావని తెలిసి.."

శీర్షిక :-)
*
తిరిగి నువ్వు రావని తెలిసి
నీకై, నిరంతరం వగచి
నువ్వు లేవన్న సత్యం మదిలోనే దాచి
నలుగురిముందూ నటిస్తూ
ఎన్ని రోజులు గడిపానో నాకే తెలుసు.
*
తలపై పెట్టుకు నిన్ను చూసుకున్నందుకు
తలపులనే నాకు మిగిల్చావా?
అంతలా నిన్ను చూసుకున్నందుకు
నేలను తాకిన నల్ల మబ్బల్లే కరుణిస్తావనుకుంటే
ఏడారి మేఘమై నన్ను శపించావా?
*
నిన్ను తాకిన నా చేతుల పై
నీ మృదు స్పర్శ అనుభవం ఇంకా అలానే ఉంది
మునివేళ్ళతో నిను నిమురుతూ, నేను పోయిన వగలు
మది మరువనంటోంది
అరుణోదయ వేళ
గాలి తెమ్మెరలకు ఓలలాడుతున్న నిన్ను
మురిపెముగ ముద్దాడుతూ, "నీవెన్నటికీ నా దానివే"
అని మురిసిపోయిన నాకు
మరుగయిపోయి, మరిచిపొమ్మంటే..మనసున్నదా నీకు?
*
నువ్విక రావని తెలిసినా
మది నమ్మనంటోంది
నీ రాక కోసం, పరితపించి పోతోంది
నీ కోసం నేను మొక్కని దేవుడు లేడు
అడగని సలహాలూ లేవు...అయినా,




ఓ కేశమా నీవెక్కడ ?
నా ఈ బట్టతలపై నీ కరుణెక్కడ?
*
అంశం : "నువ్వు రావని తెలిసి.."
శీర్షిక : కొత్త బట్టతల (నిజమే కావాలంటే మళ్ళీ చదవండి)

Friday, June 23, 2023

అంశం: ఏమని చెప్పను? శీర్షిక: చతుర్ముఖ బ్రహ్మ

 అంశం: ఏమని చెప్పను?

శీర్షిక: చతుర్ముఖ బ్రహ్మ

*

ఏమని చెప్పను? ఎంతని వివరించను?

మూడు యూగాలుగా నే ముచ్చట పడి కట్టుకున్న

ఈ భువనాన్ని, మూణ్ణాళ్ళ ముచ్చట చెయ్యొద్దని?



*

యుగానికొక దేవుడిని దింపి

దారితప్పిన రాక్షసులను పైకి పంపి

యుక్తి కోసం వేదాలు కూర్చి

శక్తి కోసం మేధస్సు నిచ్చి

తల్లి తండ్రి తానై లాలించే

ప్రకృతి ఒడిలో ఉయ్యాలలూపితే..

-

దేవుడిని గుడిలో వదిలేసి

రాక్షసుల బాటలో అడుగేసి

వేదాలను త్యజించి

మేధస్సును దురాశకై వెచ్చించి

తల్లి తండ్రీ తానై పోషించిన ప్రకృతికి,

పేరాశతో పోట్లు పొడిచి,

సహోదరుల్లా బతకాల్సిన,

నా సృష్టిలో భాగాలు, నా పిల్లలు

ప్రాణి కోటికి హాని చేస్తూ,

తమలో తాము తన్నుకుంటుంటే

ఏమని చెప్పను? ఎంతని వివరించను?

-

ఏడు కలికాలాలు చూసినా ఏముంది మార్పు?

బ్రహ్మలు మారడమే కాని మనుషులు మారునా?

కలికాలం సత్యయుగమై విలసిల్లునా?

ఏమని చెప్పను? ఎంతని వివరించను?

అష్టమ బ్రహ్మ నీ కదా, అన్నీ కష్టాలే అనుకుంటా

తొమ్మిదో బ్రహ్మ హనుమంతులవారికైనా

కలికాలంలో కాస్త ఊరట కలగాలని కోరుకుంటా !