Sunday, November 19, 2023

వేదాలే రాసిచ్చేసాయి, అవని అంతా ఆమేనట అతనేమో ఆకాశం !

 వేదాలే రాసిచ్చేసాయి,

అవని అంతా ఆమేనట

అతనేమో ఆకాశం !

.

పుట్టినా గిట్టినా అంతా ఆమె ఒడికే

ఆకాశానికేం గిట్టింది?

వర్షం కురిపించడం

ఉరుములు ఉరమడమన్న బాధ్యత తప్ప !

.

నాగరికత పేరు చెప్పి

ఆమే చుట్టూ కాపు గా ఉండమని

కాపాడే కోటగా మారమని

*

కుంటి, గుడ్డీ, చెముడూ, మూగా

వెర్రీ, మొర్రీ సమస్య ఏదైనా కాని

ఉద్యోగం పురుష లక్షణమని చెప్పి

సంపాదన కోసం వీధిలోకి పొమ్మనీ

*

యుద్ధాలకు పంపి, సరిహద్దుల్లో నిలిపీ

పోయిన ప్రాణాలకు

వీరుడనీ ధీరుడనీ పదాల కానుకిచ్చీ

*

ఇంట గెలిచి వీధిన గెలవమని

ఇంటా బయటా గెలుపు కోసం పాకులాడమనీ

ఇంట్లో ఇత్తడి చెంబు గొడవనుండి

ఇలపై పడే ఉల్కల సమస్య దాకా అన్నిటికీ

మగవారినే తప్పు పట్టినా


మనిషి తెలివి, మగాడిని

వీధిలో వెలిగే దీపం చేసినా 

బాధ్యత అంతా భుజస్కందాలపై వేసుకుని

ఏమీ సమస్య లేనట్టు

పడక్కుర్చిలో , కాలు మీద కాలు వేసుకుని

రాజసంగా కూర్చునే కేసరులందరికీ

అంతర్జాతీయ మగాళ్ళ దినోత్సవ శుభాకాంక్షలు !


#InternationalMensDay