Friday, April 19, 2024

తక్కువ మార్కులు వస్తుంటే B /C/D అని కింది సెక్షన్లకు 'DEMOTE' చేస్తారుట

"నాన్నా ఫలానా స్కూల్లో, 15 రోజులకొక టెస్ట్ పెడతారుట, అందులో తక్కువ మార్కులు వస్తుంటే B /C/D అని కింది సెక్షన్లకు 'DEMOTE' చేస్తారుట. నిజంగా మొన్ననే ఒకబ్బాయిని అలా డిమోట్ చేసారుట" అన్నాడు విహారి.
C/D సెక్షన్ విద్యర్థి అయిన నాకు ఆ పద్ధతిలో అంత సమస్య/తక్కువతనం కనిపించక పోయినా, 'డిమోట్' అన్న పదం తప్పు అనిపించింది. అటువంటి ఆలోచన పిల్లల మనసులోకి వచ్చేలా చేసే పెద్దలు, టీచర్లు, స్కూలు, సంఘం తమ ధృక్పదం మార్చుకోవాలి అనిపించింది !
.
"అది స్టూడెంటుని డిమోట్ చెయ్యడం కాదు,
ఆ స్టూడెంటుకి అర్థం అయ్యేలా చెప్పడం ఆ సెక్షన్ టిచరుకి కుదరకపోవడమో,
అర్థం అయ్యేలా చెప్పేంత సమయం స్కూలు కేటాయించక పోవడమో వల్ల,
విడమరిచి చెప్పగలిగే వేరే సెక్షన్ టిచరుకి అప్పచెప్పుతారు" అని చెప్పా.
.
నిజానికి ఒక తరగతిలో ఒక్కొక్క విద్యార్థీ ఒక్కోరకం,
ఒక టీచర్ బోధనా పద్ధతి అందరికీ సరిపడుతుందని చెప్పలేము.
అదృష్టం కొద్ది కొంతమందికి తగిన గురువు ముందే తగులుతారు, కొంతమందికి ఎప్పటికో కుదురుతుంది. కాబట్టి ఈ 'లాటరీ' సమస్యని పిలల్ల చేతకాని తనం గా మనం మార్చకూడదు / మలచకూడదు.
పిల్లలకు చాలా జిజ్ఞాస, ఆశక్తి, తెలుసుకోవాలన్న తపన ఉంటుంది అయితే వారిని సరైన దారిలో నడిపే బాధ్యత మాత్రం సంఘానిదే.
.
పిల్లలకూ, బడి ఒక నమూనా ప్రపంచం !
వారు గౌరవంగా ధైర్యంగా ఆనందంగా బతకడం ఎలాగో నేర్చుకుంటూ జ్ఞాన సముపార్జన కూడా చేసుకోగలిగే ప్రదేశం అని నా ఉద్దేశం.
తమను తాము తెలుసుకోకుండా, అనుకరణతో, ఆత్మన్యూన్యతతో, బట్టీ కొడుతూ, స్వతంత్రం & సరదా లేకుండా బడిలో గడుపుతున్నారంటే, వారి బాల్యం పాడయినట్టే !
.
ముఖ్యంగా చదువు & మార్కుల విషయంలో 'డిమోట్ ' / 'తక్కువ' / 'వాడిని చూసి బుద్ధితెచ్చుకో ' లాంటివి అనవసరమైన సంభాషణలు.
మంచి మార్కులు , మంచి కాలేజీ అంటే ఎక్కువ విషయ జ్ఞానం & ఎక్కువ జీతం, అంతే తప్ప
మంచితనం, ఆనందం, సంతోషకరమైన జీవనం, క్రమశిక్షణలకు అవి గీటురాళ్ళు కాదు .
.
వచ్చే కాలమంతా కృత్రిమ మేధ ప్రధానంగా,
మనుషులే వనరులుగా ఉండే రోజులు,
బుర్రలో ఎంత GB జ్ఞానమున్నా ఉపయోగముండదు.
కాబట్టి , బట్టి పట్టమని కాకుండా
సృజనాత్మకత, కళాత్మకత, నిర్వహణ వంటివి,
చదువుతో పాటు, ఒక కళ , ఒక ఆట హాబీలు వంటివాటి పై
మక్కువ కలిగేలా చెయ్యడం మంచిది !