మనం అవలంబించే వివాహ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది.
పెళ్ళంటే ఎదో అమ్మాయి అత్తారింటికి వెళ్ళి అక్కడ వాళ్ళకనుగుణంగా సర్దుకుపోవడం కాదు.
కాని పెళ్లి అంటే సర్దుకు పోవడమే !
వీటన్నిటిని కలిపి ఉంచే గ్లాసే ప్రేమ !!
పంచదార కలిసేలా చెయ్యడం చెంచా బాధ్యత.
ఒక సారి కలిసాకా,
పంచదారా మునుపటిలా ఉండదు,
పాలూ మునుపటిలా ఉండవు,
చెంచాకి పనీ ఉండదు
.
అబ్బాయి తన కొత్త కుటుంబాన్ని (అమ్మాయి)
తన పాత కుటుంబాన్ని (తల్లి తండ్రులు, తోబుట్టువులు, చుట్టాలు) లో
కలిపే బాధ్యత తెలియ కుండానే నెత్తిన వేసుకుంటాడు.
తనని నమ్మి ఒక అమ్మాయి తన ఇంటికి ఒంటరిగా వచ్చిందీ
ఆమె బాధ్యత తనదే అని అని గుర్తించుకోవాలి,
అప్పటిదాకా అల్లరిచిల్లరిగా తిరిగిన వాడు
పెదరాయుడిలా పెద్ద మొగాడు అయ్యిపోవాలి,
తక్కెడ మధ్యన ఇరుసులా,
న్యాయస్థానం లో న్యాయమూర్తిలా మధ్యలో నిలబడాలి,
ఇరు కుటుంబాల ఆశలు, ఆశయాలు, కోరికలు
కోపాలు, తాపాలు అర్థం చేసుకుని
నొప్పినంపక, తానొవ్వక, తప్పించుకోకుండా నేర్పుగా మెలగాలి
ఈ ప్రయత్నంలో అమ్మాయే కాదు
తన కుటుంబం కూడా మారాలి
తానూ పరిపక్వత చెంది పరిపూర్ణ పురుషుడిగా మార్పు చెందాలి !
అవసరమయితే, తాను ఇరు పక్షాలకీ శతృవుగా నటించి అయినా వారిని ఒక్క తాటిపై నడిపించాలి.
.
తాతలనాడు తన్ని నోర్మూయించారు
తండ్రులనాడు తిట్టి నోర్మూయించారు
లాంటి తొప్పాసి మాటలు బుర్రకెక్కించుకోకుండా
ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లే
సమస్యలు తీరతాయని గుర్తించాలి
అప్పుడే అటు అమ్మాయి, ఇటు కుటుంబం
వెరసి అబ్బాయి...
అంతా గెలుస్తారు !
.
తన కోసం తపస్సు చేసిన పార్వతే అయినా
లోకువగా చూడలేదు శివుడు
కాలితో తన్నించుకు మరీ శాంతింపచేసాడు !
భర్త అంటే అలానే ఉండాలి !
.
ఇక అమ్మాయి విషయం చెప్పక్కర్లేదు,
చిన్నప్పటి నుండి తన చుట్టూ ఉన్న
అమ్మ, నాన్నా, తాబుట్టువులూ బంధువులూ అనే కోటను వదిలి
ఒక్కతే, తెలియని కొత్త ఇంటిలో అడుగుపెట్టాలి,
ఆ ఇంటినే తన కొత్త కోట చేసుకోవాలి,
తనను నమ్మి తనను తన ఇంటికి తీసుకువెళ్ళిన
తన భర్తకు అతని కుటుంబం కూడా ముఖ్యమే అని ఆమె గుర్తించాలి,
అబ్బాయిలాగే అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి,
ఒక్క సారిగా సైకాలజిస్టు అయ్యిపోవాలి
అందరి మనసులూ అర్థం చేసేసుకోవాలి
"ఏమిచ్చారు?" "ఏం తెచ్చారు" "మా కాలంలో ఇలా కాదు"
"చిరిగిపోయిన చీర పెట్టారు" "అవమానించారు" "మీ వాళ్ళు అంతే"
"మాది పరువుగల కుటుంబం" ... ఇవన్నీ విన్నా, విననట్టు వదిలేసే
భూదేవంత సహనం,
సన్యాసులకున్నంత సంమ్యమనం (బదులు చెప్పకుండా ఉండడానికి),
దుర్గా దేవికున్నంత ధైర్యం (తన వారిని వదిలి, కొత్తవారిని భరించడానికి) ఉండాలి,
ఒక చెట్టులా ఆ కొత్త వారూ తనవారే అని అనుకోవాలి
అహం (అహం చెడ్డదనుకునేరు, అహం మితి మీరనంత సేపు చాలా అవసరం) తగ్గించుకుని సర్దుకుపోవాలి...
ఇలా చెప్పుకు పోతే ఇదో పెద్ద చిట్టా !
.
మరి ఇరు కుటుంబాలకీ బాధ్యతలేదా?
ఉంది!
అగ్నికి ఆజ్యం పొయ్యకుండా,
తాము ఆదర్శంగా మెలగి వారికి దారి చూపడం !
అడ్డ కత్తెరలో పోకచెక్కలా తమ పిల్లలు నలిగిపోకూడదు అని గుర్తించాలి !
వారికి సలహాలు సూచనలూ మాత్రమే ఇచ్చి
నిర్ణయాలు తీసుకునే బాధ్యత వారికే ఇచ్చి
వారు ఎదిగేలా చెయ్యాలి !
మా పిల్ల కాలు కందిపోతోంది,
మా అబ్బాయి మారిపోయాడు
అని కధలు పడకుండా,
వారికొక కొత్త సమస్య కాకుండా పెద్దరికం నిలబెట్టుకోవాలి.
వందల వేల సంవత్సరాల నుండీ
తరాల మధ్య అంతరాలు ఉండడం సహజం అని గుర్తించాలి,
పాలూ పంచదారా కలిసినప్పుడు
పాల రుచి మారుతుందనీ
పంచదార రూపు మారుతుందనీ,
అది సహజమనీ, గుర్తించాలి.
ఇక బంధువులు, వేడుక చూసినట్టు చూడకుండా
అవసరమైనప్పుడు సాయం చేస్తూ,
అవసరం లేనప్పుడు తప్పించుకుంటూ ఉండాలి !
ఈ మొత్తం ప్రక్రియలో సమస్యలేమైనా వస్తే అవి పెద్దవవకుండా కాపాడేవి ప్రేమ, స్వతంత్రం,కుటుంబ వ్యవస్త పట్ల గౌరవం.
.
మంచి కుటుంబానికి కొలమానం
అందరూ కలసి ఉండడం ఒక్కటే కాదు !
కలసిమెలసి ఉండడం, ప్రేమభిమానాలు, నమ్మకం, స్వతంత్రం, త్యాగం, ఓర్పు సహనం.. ఇవి కూడా కొలమానాలే !
ఏమంటారు??