Sunday, April 28, 2013

అద్వైతం


మొదట్లో మొత్తం నేనే
నాలో నేనే

లోకాన్ని చూసాకా
కొంత నేను కొంత నువ్వు
ఆపై అప్పుడప్పుడు కొంత మనం

బాహ్య స్థూల పరిశీలనలో
అంతా భిన్నత్వమే

పైనేమో నీలి తెర
కిందంతా ధూళి పొర
మనసే మనిషి చెర

సత్యానికి ఒకటే దారి
అసత్యానికి..?  మనిషికో దారి

కనుచూపు మేర అంతా మనుష్యులే కానీ..
ఊర్ధ్వ ముఖం అధో ముఖం
అదో ముఖం ఏదో ముఖం

ఇది నా అభిమతం అది నీ అభిమతం
నా మతం నీకు అసమ్మతం

మూతి ముడుచుకుని
మళ్ళీ
నాలో నేనే
నాతో నేనే
యధేచ్చగా సంధ్యవారిస్తే
అక్కడా నేనే
రణ గొణ గణ గణ
వాడు వీడు అదీ ఇదీ

అంతా భౌతికమే..
మనం ఎంతో ఎదిగాం గగనానికి ఎగిసాం
కిందకి తొంగి చూస్తే..
సత్యం అగాధంలో కూరుకు పోయింది
మనసు ప్రకృతి నుండి వేరుపడి పోయింది

ఎప్పుడో సంధ్యలో గురి కుదురుతుంది
అప్పుడు చూడాలి

















మనసులో మంత్ర జపం
జరుగుతూనే ఉంటుంది
చేయి జపమాల తిప్పుతూనే ఉంటుంది
అవి కేవలం సాహిత్యం మాత్రమే
అసలు సత్యం ఇకపై ఉంది

కళ్ళు కలుసుకుని
నుదుటికెక్కుతాయి
కూర్చునిఉన్నా
దృష్టి దూరంగా నింగిలోకి పోతుంది

వెన్నులో వెన్న రంగులో
కాంతి రేఖలు
తలదాకా ప్రవహిస్తుంటాయి

తలలో అపారమైన శక్తి చేరగా
అంతర్ ధ్రుష్టి అనంత విశ్వంలోకి
దూసుకుపోతుంది
ఆపై అంతా అధ్వైతం
ప్రసాంతం
ఏకత్వం ఆసాంతం

ఎరుక..
ఉన్నదేదీ లేదని
ఎరుక

అంతా ఆ మహా ఎరుక రాశిలో భాగమే
భాగాలు కొన్ని కొన్నాళ్ళు విడిగా ఉన్నా
మళ్ళీ వెళ్ళి అనంతంలో మమేకమవుతాయి

సముద్రం లో నీటి బిందువుల్లా
ఆవిరై కొన్ని ఆకాసాన్ని చేరినా
చినుకై నేలకు రాలి
నదులలో కలసి
మళ్ళీ సముద్రాన్ని చేరవలసిందే

నది ఏదైనా గమ్యం అదే
చినుకేదైనా చివరకు నదే
కావలసింది ఎరుక కలిగిన మదే !


No comments:

Post a Comment