Thursday, August 22, 2013

యాస ఏదైనా తెలుగు ఒకటే

భాష ఏదైనా భావమొకటే
యాస ఏదైనా తెలుగు ఒకటే







ఆంధ్ర మహాభాగవతమన్న నాటి పోతన
తిమిరంతో సమరమన్న నేటి దాశరథి
కంచెర్ల గోపన్న లేకున్న యాడ మన రామన్న?
సినారే లేకున్న తెలుగు సిత్రమేమున్నది
కళోజీ జీవన గీత, సోమన్న బసవపురాణమన్నా
గోరేటి వెంకన్న, గోన బుద్ధా రెడ్డి,
తెలంగాణ తెలుగు కవుల తిరుగులేదన్నా
లెక్క చెప్పమన్న పెక్కు పేర్లు కలవురన్న

త్యాగరాజన్న తెలుగు రాజు
అన్నమయ్య లేకున్న తెలుగే అనమయా
వెంగమాంబ కన్న వేరె అంబ ఉన్నదా?
క్రిష్ణదేవరాయలి అష్ట దిగ్గజాలు,
నంది తిమ్మన, అల్లసాని పెద్దన్నకట్టమంచివారు, జిడ్డు క్రిష్ణ మూర్తి గారు
తెలుగు తారలు వీరు విశ్వధాభి రామ
మా రాయలసీమ రతనాలసీమ

నన్నయ్య తెలుగుకన్నయ్య
తిక్కన, యెల్లాప్రగడలవల్ల భారతం పూర్తయిందయా
చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి
వీరిరువురే కదా తెలుగు పద్యానికి జిలుగు తెస్తిరి
అవధానాలకు ఊపిరి పోస్తిరి
వీరేశలింగం సార్ధకనామధేయం
దేవులపల్లి కృష్ణ పక్షం, చలం మైదానం, గోపిచంద్ చీకటి గోడలు
ఆత్రేయగారు, విశ్వనాథవారు, వేటూరిగారుకొడవగంటి గారు,  చక్రపాణి గారు
ఎన్ని పేర్లని ఎనగలము గోదారి జిల్లాలు కవుల గోదాములు














యాస వేరని భాషేవేరనీ
తెలిసీ తెలియని వాళ్ళు తెలివితక్కువవాళ్ళూ
గొడవపెట్టువాళ్ళు, గోడపైపిల్లులూ 
ఎవరైనానీది తెలుగు కాదనీ అంటే..
నవ్వి ఊరుకోకు, నమ్మి మోసపోకు
తెలుగు కవుల చరిత తెరచి చూపించు
తెలుగు వాడిగ నువు వాడి చూపించు

స్వార్ధానికి, అపార్ధానికి తెలుగు తేడానేమోగానీ
భావానికి, భావుకత్వానికి, స్రుజనకు స్రుజించే కలానికి కాదు

తెలుగు మన భాష, తెలుగే మన శ్వాస
తెలుగు తెలుగోయని ఎలుగెత్తి పలుకు
తెలుగోడిగా నువు తల ఎత్తుకు బతుకు
                                                                                                   --    -కీర్తి

No comments:

Post a Comment