Monday, July 11, 2016

సెల్ఫీ రాజా కధ (డైలీ సీరియల్ లా, రోజూ కొంచెం కొంచెం కధ)(Selfie Raja Story - Blog Series)

ఇది ఒక కామెడి కధ రాయడానికి నేను చేసే ప్రయత్నం. అది ఫలించిందో లేదో కధ చివర్లో మీరే చెప్పాలి.

నేను రాసిన 2 కామెడి కధలు నచ్చాయని పాఠకులు చెప్పడం తో, ఇంకొక సారి మెప్పించే ప్రయత్నం.

కేవలం రాయాలన్న బలమైన కోరిక ఉంది కానీ సమయాభావం వల్ల ఒకే సారి రాయడం కుదరట్లేదు, అందుకని నేను డైలీ సీరియల్ లా(Selfie Raja Story - Blog Series), రోజూ కొంచెం కొంచెం కధ రాయాలని నిశ్చయించుకున్నా. 
కొత్త ప్రయోగం. 
నాకు హిట్స్ పెరుగుతాయి, మీకు కొంత సస్పెన్స్.
డైలీ సీరియల్ లా అన్నానని సాగతీస్తా అనుకోకండి, కధ చెప్పటంలో సాగతీత అస్సలు ఇష్టం ఉండదు నాకు. PART 1

10 July,2016 సమయం ఉదయం 6:00 AM :: Flat No: 113
సెల్ నుండి నోటిఫికేషన్ బీప్ శబ్దం, భయం భయంగా సెల్ అందుకోబోతున్న రాజా చేతులు వణుకున్నాయి, సరిగ్గా నిన్న రాత్రి 12:00 AM కి వణికినట్టే !
అంత భయంలోనూ అలవాటు పడిన అతని వేళ్ళు అలవోకగా అన్లోక్ సెక్యూరిటీ నంబర్ నొక్కాయి.
సిలిండెర్ లీక్ అయిన గదిలో అగ్గి పుల్ల కావాలని వెలిగించినట్టు,
రివాల్వర్ తలకు పెట్టుకుని ట్రిగ్గెర్ నొక్కుకున్నట్టు,
మంచు లక్ష్మి మాట్లాడుతుంటే టివీ MUTE Off చేసినట్టు...
ఒక రకమైన భయంతో కూడిన విరక్తి వల్ల వచ్చిన తెగింపుతో ఆ నోటిఫికేషన్ మీద నొక్కాడు, అంతే
'షిట్' అన్న పదం అతని గొంతు దాటలేదు, అతని చూపులు సెల్ స్క్రీన్ నుంచి మరలి వెర్రిగా అనంతంలోకి చూస్తూ అర్దిస్తున్నాయి...


10 July,2016  సమయం ఉదయం 6:01 AM :: Flat No: 420
సెల్ వైబ్రేట్ అవుతోంది ఆగకుండా...
టీపాయ్ మీద నుంచి జారి కిందకి పడిపోబోతున్న దానిని ఒడుపుగా పట్టుకున్నాడు క్రికటర్ సచిన్ (ఇతను టెండుల్కర్ కాదు),
అన్నోన్ నంబర్ నుంచి వచ్చిన కాల్ ని అన్యమనస్కంగా ఎత్తాడు,
అవతల వ్యక్తి "నా నంబర్ బ్లాక్ చేస్తే నాకు తెలీదనుకున్నావా? నాకు నీ గురించి అంతా తెలుసు రా ! " అన్నాడు
ఏడు పెంకులాటలో బంతిని విసిరినట్టు సెల్ ని విసిరాడు సచిన్ , అది ఏడు ముక్కలయ్యింది !!


10 July,2016  సమయం ఉదయం 6:03 AM :: House No: 2/3-4/5-33-4-56-3/2345
సుమ కి భక్తి ఎక్కువ పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటూ భక్తి చానల్ చూస్తే కాని ఇంకే పనీ చెయ్యదు.
బ్రష్ నోట్లొ పెట్టుకుని టివి ఆన్ చేసి భక్తి చానల్ పెట్టి కుర్చిలో కూర్చుంది,
కింద ఒక స్క్రోలింగ్  "సుమ_ఇన్ఫి, కీర్తి_ఒరాకిల్, సుబ్బు_టిసిఎస్ మీ భాద్యత మీరు నిర్వర్తించినంత కాలం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, గుర్తుంది గా BTech First Year freshers party లో ఏమి చేసారో?"
ఆమె పిడికిలి బిగిసింది, కోపంతో ఊగిపోతూ ఇస్స్ మంటూ నోటితో గాలి లోపలికి పీల్చింది, అంతే
బ్రుష్ మీద ఉన్న పేష్ట్ ఆమె శ్వాసకు అడ్డుపడి ఉక్కిరిబిక్కిరి అయ్యిపోయింది !

---------------------------------------*-*-*---------------------------------------

PART 2
ఒక్క రోజు వెనక్కి 9 July,2016  సమయం 10:07 AM
కోర్టులో టైపిస్టులాగ విపరీతమైన వేగంతో టైప్ చేస్తున్నాడు, శ్రీనివాస్ తన లాప్టాప్ మీద.
చంద్రముఖి ఆవహించిన చింపాంజీలా అతని మొహంలో ఒక వెలుగు కనిపిస్తోంది
ఏదో చెప్పడానికి వచ్చిన అతని బోస్, ఆ వెలుగు చూసి ఏదో అర్థం అయ్యిన వాడిలా వెళ్ళిపోయాడు, నెమ్మదిగా జాగ్రత్తగా చప్పుడు చెయ్యకుండా పిల్లిలా.
శ్రీనివాస్ ఒక పెళ్ళి సంబంధాల వెబ్ సైట్లో తన వివరాలు పెడుతున్నాడు, ఆ సమయంలో ఎవరు అతని దీక్ష భగ్నం చేసినా భస్మమే, నిద్రా భంగ మైన ముచికుందుని లా !

వెబ్ సైట్ లో పసుపు పచ్చని బాక్ గ్రౌండ్ పై, పెద్ద పెద్ద ఎర్రని అక్షరాలతో కనిపిస్తున్నాయి,
"3 నెలల్లో 3 ముళ్ళు గేరంటీ*"
"ఫ్రీ ఆట్టిట్యూడ్ ఆప్టిట్యూడ్ మాచింగ్, సైకో అనాలసిస్ మాచింగ్, హైట్ వెయిట్  & వైట్ మాచింగ్ మరియు బ్లడ్ గ్రూప్ మాచింగ్ "  
"మా ద్వారా జరిగిన అన్ని కొత్త పెళ్ళిళ్ళకు 2 లక్షల ఇన్సూరన్సు, 1 సంవత్సరం గేరంటి ఇంకా జీవితాంతం కౌన్సలింగ్ మరియు లా ఖర్చుల పై 20% తగ్గింపు."
"ప్రతి ఒక్కరికీ గేరంటీ అపోలో మెడికల్ స్టోర్ గిఫ్ట్ కూపన్**."
"5 సంవత్సరాలలో 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఒక పింగాణి డిన్నర్ సెట్ మరియు సింగపూర్ లో 3 డేస్ 2 నైట్స్ గడిపేందుకు తీసే డ్రా లో పాల్గొనే అద్భుతమైన అవకాశం."
"పాత పద్దతులు వదిలెయ్యంది, ఇక్కడ అన్ని పెళ్ళిళ్ళు పాశ్చత్య పద్దతుల్లొ తక్కువ ఖర్చులో అయ్యిపోతాయి.
పెళ్ళి చూపుల ఎందుకు? షాపులో సామాలు కొనుక్కోడం కాదుగా పెళ్ళి అంటే. ఆందుకే పెళ్ళి చూపుల బదులు 1 నెల డేటింగ్, ఒకరినొకరు అర్థం చేసుకోడానికి."
"నిశ్చయ తాంబూలాల ఎందుకు చుట్టాలకు భోజనాలు దండగ, దాని బదులు మా ఆఫీస్లో కనీసం 1 సంవత్సరానికి పెళ్ళి కాంట్రాక్ట్ సైన్ చెయ్యలి."
"పెళ్ళి హడావిడి బదులు మా ఆఫీస్లో ఎవరైన ఒక మూవీ సెలబ్రిటీ సన్నిది లో రిజిస్ట్రేషన్. మిగిలిన వన్నీ మీ ఇష్టం."
"24X7 కస్టమర్ కేర్ సపోర్ట్"
"అద్భుతమైన ఆన్ లైన్ గిఫ్ట్ స్టొర్ మరియు ఉచిత గిఫ్ట్ ఆయిడియాస్***"

Fair Usage Policy:
(*3 డేటింగ్స్ లోపు మీరు మళ్ళీ ఫీసు కట్టవలసి ఉంటుంది, రిజిస్ట్రేషన్ అవసరం లేదు)
(**కూపన్ కేవలం తలనొఫ్ఫి మాత్రలు, ఫుడ్ పాయిజన్, పిల్లల డైపర్ల కొనుగోలు పై మాత్రమె చెల్లుతుంది)
(***మేమిచ్చిన గిఫ్ట్ అయిడియాలకు బదులుగా గిఫ్ట్లు మా వద్దే కొనుగోలు చెయ్యవెలెను)

శ్రీనివాస్ పక్కింట్లో ఉన్న పంకజం గారి పెద్దమ్మాయికి కొత్తగా వచ్చిన కాల్ సెంటర్ ఉద్యోగం ఒక మారేజ్ బ్యూరో లో అని అవిడ శ్రీనివాస్ వాళ్ళమ్మకు చెప్పింది. ఎంప్లోయీ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే 5% డిస్కౌంట్ అని కూడా చెప్పి వాళ్ళమ్మాయి నంబర్ ఇచ్చింది (ఎంప్లోయీ కి 5000 రిఫరల్ బోనస్ మరి).
శ్రీనివాస్ పక్కింటావిడ ఇచ్చిన నంబెర్ కి కాల్ చేసాడు.

హలో
అటునుంచి కూడా "హలో"
మీ అమ్మగారు ఎంప్లోయీ నంబర్ పేరు కోసం రిజిస్త్రాషన్ చేసెటప్పుడు మీకు కాల్ చెయ్యమన్నారు
ఒకె సర్ , ఐడి నంబర్ 016 ... నేం: పరిమళ పిచ్చి.
పిచ్చి ఇంటి పేరా?
ఎస్ సార్, నీడ్ ఎని అదర్ అసిస్టన్సె సర్?
కాస్త త్వరగా మంచి సంభంధాలు చూసి పెట్టండి
షూర్ సర్
కాల్ డిస్కనక్ట్ అయ్యింది .

రిజిస్త్రేషన్ ఫోర్మ్ నింపి సబ్మిట్ చేసి, ఆలోచనలో పడ్డాడు శ్రీనివాస్.

---------------------------------------*-*-*---------------------------------------

PART 3

6 months క్రితం ఆ తప్పు చేసి ఉండకపోతే ఇవాళ ఇలాంటి కష్టం వచ్చేది కాదు..

అవి హైదరాబాద్ వచ్చిన రోజులు, పీర్స్ లో .NET కోర్సు చెస్తూ పక్కన కూర్చున్న పల్లవిని పడగొట్టాడు శ్రీనివాస్. ఒక రోజు మైత్రివనం బయట 5/- జూసు తాగుతూ తనతో ఒక సెల్ఫీ తీసుకుని ఫాస్బుక్లో పెట్టాడు 'ఇన్ లవ్ ' అని, తనని టాగ్ చేసి. సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ సందులోకి వెళ్ళగానే, ఎవరో దుప్పటి ముసుగు వేసి కుమ్మేసారు, "మళ్ళీ మా పల్లు జోలికి వెళ్ళావంటే పళ్ళు రాలిపొతాయి" అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు.
అంత ముద్దుగా చెప్పాకా వినకుండా ఉండగలరా ఎవరైనా? తరువాత రోజు నుంచి .NET మానేసి, Naresh technologies  లో JAVA కోర్సు జాయిన్ అయ్యాడు.

జావా నేర్చుకుంటూ లావుగా ఉన్న తన పక్క సీటు అమ్మాయికి లలిత కి మంచి జీవితం ఇచ్చి సంఘ సేవ చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.
SR నగర్లో చపాతీలు , పార్క్లో పల్లీలు తింటూ కొన్నాళ్ళు బాగానే గడిచిపోయాయి ఇద్దరికీ.(ఇంకా ఉంది)

(Sorry for late Update... this blog series is stopped as it is 
COMING SOON AS A SHORT FILM)No comments:

Post a Comment